Ganesh Immersion : వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా?
వినాయకుడిని నిమజ్జనం చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. 3,9, 12 రోజులకు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ నిమజ్జనం ప్రక్రియ ఎందుకు చేస్తారనే విషయం ఎక్కువ మందికి తెలియదు. మీకు కూడా తెలియదా? అయితే మీరు ఇది చదవాల్సిందే.
Ganesh Immersion : వినాయక చవితి అనంతరం సకల పూజలు అందుకున్న వినాయకుడిని కొన్నిరోజుల తర్వాత నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది. అయితే వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అయితే శౌనకాదులకు కూడా ఈ డౌట్ వచ్చింది. వారు సూతుడిని ఈ ప్రశ్న అడుగగా ఆయన ఈ విధంగా వారికి సమాధానమిచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు
"మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. అంతవరకు బాగానే ఉంది. మాములుగా చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే.. అది పరబ్రహ్మ రూపమైన ప్రతిమ. అనంతరం పూజలు చేస్తాం. మనం ప్రాణప్రతిష్ట చేసి.. ఆహ్వానించి పూజ చేయకపోయినా.. ఆ ప్రతిమనందు పరబ్రహ్మ ఉంటాడు. అలాంటి ప్రతిమను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం.
బొమ్మను పూజించాము. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయాలా వద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడమే. బ్రహ్మాండంలో లీనం చేయడమే. అంటే ఎక్కడినుంచి వచ్చిందో.. అక్కడికి పంపడం. ఇదే సృష్టి. ఇదే లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం. అందుకే వినాయక విగ్రహాన్ని సముద్ర జలమందు కానీ.. నదులు, చెరువలలో కానీ నిమజ్జనం చేస్తారు. ఆ నీటిలో చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయాణించి.. పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం చేస్తారు." అని సూతమహర్షి వివరించారు.
సంబంధిత కథనం