LED Therapy। ముఖంలో కాంతి కోసం, కాంతితోనే చికిత్స.. ఈ థెరపీ గురించి మీకు తెలుసా?
అందానికి తీర్చుదిద్దటం కోసం, చర్మ సమస్యల నివారణకు ఇప్పుడు అనేక అధునాతనమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో LED therapy కూడా ఒకటి. నొప్పి లేకుండా, తక్కువ టైంలో ఉత్తమ ఫలితాలను కనబరుస్తున్న ఈ చికిత్స గురించి తెలుసుకోండి.
ముఖంలో కాంతి రావటానికి చాలా మంది ఫేషియల్ మాస్కులు వాడటం గురించి తెలిసిందే. కానీ నేరుగా కాంతినే మాస్క్ లాగే వాడితే ఎలా ఉంటుంది, ఎప్పుడైనా ఊహించారా? నిజానికి ఇలాంటి లైటింగ్ మాస్క్ కూడా ఒకటి ఉంది. ముఖంపై ముడతలు, మొటిమలు అలాగే ఇతర చర్మ సమస్యలను తొలగించి, చర్మాన్ని పునరుజ్జీవనం చేయడానికి ఇప్పుడు కొంతమంది సౌందర్య నిపుణులు LED లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. దీనిని ఫోటో-డైనమిక్ లేదా లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు. జుట్టు రాలడం సంబంధిత సమస్యలకు సంబంధించిన చికిత్సలకు ఈ థెరపీ వాడుకలో ఉంది.
ఈ LED థెరపీలో కాంతిని ప్రసరింపజేసే మాస్క్‌ను ముఖానికి తొడుగుతారు. ఈ మాస్క్ వివిధ రకాల LED తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాలను పంపిస్తుంది. నిర్దిష్ట తరంగదైర్ఘ్యానికి అనుగుణంగా వెలువడే సూక్ష్మ LED కిరణాలు చర్మాన్ని సమకాలీకరణం చేస్తాయి. తద్వారా చర్మ సమస్యలు నెమ్మదినెమ్మదిగా నయం అవుతాయి. ఈ ప్రక్రియలో 15-20 నిమిషాల పాటు కాంతి పంపిణీ చేస్తారు. ఇలా వివిధ సిట్టింగ్‌లలో చికిత్సను అందిస్తారు.
LED Therapy లో రకాలు
వ్యక్తులకు ఉన్న చర్మ సమస్య రకాన్ని బట్టి కాంతి పౌనఃపున్యాలు మారుతూ ఉంటాయి. యాంటీ ఏజింగ్ చికిత్స కోసం ఎరుపు రంగు LED థెరపీ ఉపయోగిస్తారు, నీలం మొటిమల చికిత్సకు ఉపయోగిస్తారు.
రెడ్ లైట్: ఇది కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి చేసే కణాలను ప్రేరేపిస్తుంది. దీనిని ప్రధానంగా యాంటీ ఏజింగ్ చికిత్సల కోసం ఉపయోగిస్తారు.
ఎల్లో లైట్: ఇది ముఖ కండరాలను టోన్ చేస్తుంది, బిగుతుగా చేస్తుంది. ఈ థెరపీ నిర్విషీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మానికి శక్తినిస్తుంది, యాంటీఅలెర్జెన్‌గా కూడా పనిచేస్తుంది.
గ్రీన్ లైట్: ఇది ఎరుపును, దద్దుర్లను తగ్గిస్తుంది. చర్మం మొత్తం ఆకృతిని మెరుగుపరుస్తుంది. లేజర్ చికిత్సలు, వడదెబ్బల చికిత్సలకు ఈ థెరపీ ఉత్తమంగా పనిచేస్తుంది. పోస్ట్-ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది.
బ్లూ లైట్: ఇది పెద్దగా మారే సిస్టిక్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా పనిచేస్తుంది. ఈ కాంతి చర్మాన్ని క్రిమిరహితం చేయడానికి కూడా అద్భుతమైనది.
ఇన్‌ఫ్రారెడ్ లైట్: ఇవి పొడవైన తరంగదైర్ఘ్యాలు కలిగిన లైట్లు. చర్మ కణాల పనితీరును లోతైన స్థాయిలలో ప్రేరేపించడం ద్వారా చర్మ సమస్యలను నయం చేసేందుకు ఉపయోగిస్తారు.
LED Therapy ఎవరు తీసుకోవచ్చు?
ఈ LED థెరపీ అనేది నొప్పి లేని సర్జరీ లాంటిది. చర్మం దద్దుర్లు కలవారు, ముడతలు తగ్గించుకోవాలనుకునే వారు, చిన్న రక్తనాళాల రూపాన్ని తగ్గించాలనుకునే వారు, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నవారు, కాలిన మచ్చలు, మొటిమల మచ్చలు, రోసేసియా, తామర, సోరియాసిస్, అథ్లెట్స్ ఫుట్ ఉన్నవారు, కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు, పిగ్మెంటేషన్ ఉన్నవారు, జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు LED థెరపీని తీసుకోవచ్చు.
LED Therapy ని ఎవరు నివారించాలి?
గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే మహిళలు, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, ఫోటోఎస్థీషియా చరిత్ర కలిగిన వారు, మిగతా ఏదైనా సర్జరీలు లేదా చికిత్సలు తీసుకునే వారు ఈ LED therapyని నివారించాలి.
ఈ LED థెరపీతో ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు రెండూ ఉంటాయి. ఈ తరహా చికిత్స తీసుకునే ముందు డెర్మటాలజిస్ట్ లేదా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం