Natural Facial Glow | మేకప్ వద్దు.. ఆరోగ్యమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి!-go make up free here are the effective ways to get natural facial glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Go Make Up Free, Here Are The Effective Ways To Get Natural Facial Glow

Natural Facial Glow | మేకప్ వద్దు.. ఆరోగ్యమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 10:05 AM IST

Ways to Get Natural Facial Glow: మేకప్ వలన చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని తిరిగి పునరుజ్జీవనం చేయాలంటే ఈ చిట్కాలు పాటించండి.

Ways to Get Natural Facial Glow
Ways to Get Natural Facial Glow (Unsplash)

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. తమ అందానికి మెరుగులు దిద్దడానికి మేకప్ వేసుకుంటారు. కానీ మేకప్ వేసుకోవడం కంటే సహజంగా ముఖ కాంతిని కలిగి ఉండటమే నిజమైన అందం. మేకప్ వల్ల ముఖం ప్లాస్టిక్ పువ్వులా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ మేకప్ లేకుంటే మీ మొఖమే సహజమైన, అందమైన పుష్పంలా వికసించినట్లు ఉంటుంది. మీ ముఖం విచ్చుకోవాలంటే దానికి తగినంత ఆక్సిజన్, నీరు లభిస్తే చాలు.

తీవ్రమైన జీవనశైలి, నిద్రలేమి, పర్యావరణంలోని కాలుష్య కారకాలు, కాలానుగుణ మార్పుల ఫలితంగా మన చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా మారుతుంది. కానీ చింతించాల్సిన అవసరం లేదు. మీ చర్మాన్ని రిపేర్ చేసి, పునరుజ్జీవింపజేసేందుకు కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి.

Ways to Get Natural Facial Glow- సహజమైన ముఖ కాంతి కోసం చిట్కాలు

ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ చర్మానికి తగిన పోషణ లభిస్తుంది. యవ్వనమైన చర్మాన్ని పొందవచ్చు, మీ ముఖంలో సహజ నిగారింపు వస్తుంది.

హైడ్రేటెడ్‌గా ఉండండి

మన శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి నీరు అవసరం. కాబట్టి మీరు తగినంత నీరు త్రాగడం వలన మొత్తం శరీరానికి వివిధ మార్గాల్లో ప్రయోజనం చేకూరుతుంది, వాటిలో ఒకటి మెరుగైన చర్మం. మీరు హైడ్రేటెడ్ గా ఉంటే మీ ముఖం విచ్చుకుంటుంది. లేదంటే కళావిహీనంగా కనిపిస్తుంది. అందువల్ల నీరు, ఎలక్ట్రోలైట్స్ కలిగిన స్వచ్ఛమైన కొబ్బరినీరు తాగుతుండాలి.

క్లెన్సింగ్

స్పష్టమైన ముఖకాంతిని పొందడం కోసం మీరు తీసుకోగల ముఖ్యమైన రోజువారీ చర్య మీ చర్మాన్ని శుభ్రపరచడం. ప్రతిరోజూ పడుకునే ముందు, ఉదయం నిద్ర లేవగానే, మీ చర్మాన్ని స్వచ్ఛమైన నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోండి. బయట తిరగడం, వ్యాయామం, ఆటలతో చర్మంపై దుమ్ము, చెమట, మురికి, సూక్ష్మజీవులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం అప్పుడప్పుడు సహజమైన రోజ్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు.

వేడి నీటిని ఉపయోగించవద్దు

మీ ముఖాన్ని వేడి నీటితో కడగడం వల్ల మీ చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచే సహజ నూనెలు తొలగిపోతాయి. వేడి నీరు మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది. మీ చర్మం సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. మీరు మీ చర్మాన్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది మీ ఆరోగ్యం, బిగుతును, ఆకృతిని ప్రభావితం చేస్తుంది.

ఎక్స్‌ఫోలియేట్ చేయండి

కాంతివంతమైన చర్మం కావాలంటే ఎక్స్‌ఫోలియేషన్ కీలకం. ఈ ఎక్స్‌ఫోలియేషన్ చనిపోయిన చర్మ కణాల పై పొరలను తొలగించి, దాని కింద ఉన్న యవ్వనపు చర్మాన్ని బహిర్గతం చేయడంలో సహాయపడుతుంది. సున్నితమైన ఎక్స్‌ఫోలియేట్ ఉత్పత్తిని ఉపయోగించి వారానికి ఒకటి లేదా రెండుసార్లు లైట్ ఎక్స్‌ఫోలియేషన్ చేయడం ద్వారా మీ ముఖం యవ్వన కాంతిని పొందుతుంది.

మేకప్ వద్దు

సహజమైన చర్మ కాంతి పొందాలంటే తరచుగా మేకప్ వేసుకోవద్దు. వారానికి కనీసం ఒకరోజు మీ ముఖానికి ఎలాంటి ఫేషియల్ క్రీమ్‌లు, సౌందర్య సాధనాలను అప్లై చేయకుండా ఉండండి. ఇలా ఏమి చేయకుండా ఉండటం వలన మీ ముఖంలో సహజ నిగారింపు వస్తుంది.

అయితే బయటకు వెళ్లేటపుడు హానికరమైన సూర్య కిరణాల ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించడం కోసం సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించవచ్చు.

పేగు ఆరోగ్యం

మీకు ఆరోగ్యకరమైన చర్మం కోసం బయట నుంచి మాత్రమే శ్రద్ద తీసుకుంటే సరిపోదు, లోపలి నుంచి పోషణ అందించడంపై కూడా దృష్టిపెట్టాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ పేగు ఆరోగ్యం కూడా ముఖ్యమే. అది మంచి పోషకాహారం తీసుకోవడం వలనే సాధ్యపడుతుంది. మీ జీర్ణాశయం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవడం మేలు. ప్రాసెస్ చేసిన భోజనం, తెల్ల చక్కెర , అధిక ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్