MeToo case : మళ్లీ తెరపైకి మీటూ కేసు.. అర్జున్ వేధింపులకు సంబంధించి ఆధారాలివ్వండి!
Sruthi Hariharan-Arjun Sarja Case : అప్పట్లో మీటూ ఉద్యమం సాగుతున్న సమయంలో నటుడు అర్జున్ మీద నటి శృతి హరిహరన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. అయితే తాజాగా మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.

2018 లో సంచలనం సృష్టించిన మీటూ(Metoo) ఉద్యమంలో నటి శృతి హరిహరన్ అర్జున్ సర్జాపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసింది. అర్జున్(Arjun) మీద శృతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కోర్టులో బి రిపోర్ట్ సమర్పించారు. దానిని శృతి హరిహరన్(Sruthi Hariharan) సవాలు చేసింది.
మీటూ కేసును పోలీసులు మూడేళ్లపాటు విచారించారు. అయితే, సరైన సాక్షులు దొరకలేదు. దీంతో పోలీసులు కోర్టుకు బి-రిపోర్టు సమర్పించారు. కేసు దర్యాప్తులో నిందితులను విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలు లభించలేదని ట్రయల్ కోర్టుకు పోలీసులు తుది నివేదిక ఇచ్చారు.
బి-రిపోర్ట్‌తో శృతి హరిహరన్ విభేదించారు. శృతి విజ్ఞప్తిని కోర్టు స్వీకరించింది. పోలీసులకు ఆధారాలు ఇవ్వాలంటూ శృతికి నోటీసులు ఇచ్చింది కోర్టు. బెంగళూరులోని 8వ ఏసీఎంఎం కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. శృతి హరిహరన్(Sruthi Hariharan) ఆధారాలు ఇవ్వకపోతే, కోర్టు బి-రిపోర్ట్‌ను అంగీకరిస్తుందని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో కబ్బన్ పార్క్ పోలీసులు దాఖలు చేసిన బి-రిపోర్ట్‌ను సవాలు చేస్తూ హరిహరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ అంశంపై తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు ఆధారాలు అందించాలని ఆమెకు నోటీసు జారీ చేసింది.
అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విస్మయ’ సినిమాలో శృతి హరిహరన్, అర్జున్ సర్జా(Arjun Sarja) భార్యాభర్తలుగా నటించారు. షూటింగ్ సమయంలో అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడంటూ శృతి హరిహరన్ ఆరోపించడంతో కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తం మండిపడింది. కొందరు శృతికి అనుకూలంగా మాట్లాడితే, పలువురు అర్జున్ సర్జాకు మద్దతు పలికారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ కామర్స్ బోర్డులో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్జున్ సర్జా, శృతి హరిహరన్ మధ్య రాజీ కుదరలేదు.
గతంలో మీటూ ఉద్యమం సినీ ప్రపంచాన్ని ఊపేసింది. మమ్మల్ని లైంగికంగా వేధించారని, పెద్ద పెద్ద స్టార్స్ పేర్లు మీడియాకు కొంతమంది లీక్ చేశారు. అవకాశాల పేరుతో మహిళా ఆర్టిస్టులను శారీరకంగా వాడుకోవడం, లైంగికంగా వేధించారని చాలా మంది బయటకు వచ్చారు. హాలీవుడ్ లో మెుదలైన మీటూ సెగ.. వయా బాలీవుడ్ నుంచి.. సౌత్ సినిమాలపై వైపు వచ్చింది. అదే సమయంలో అర్జున్ సర్జా మీద శృతి హరిహరన్ ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసులో హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని శృతి సవాల్ చేసింది. దీంతో తాజాగా మరోసారి మీటూ కేసు తెరపైకి వచ్చింది.
టాపిక్