Hyderabad : ఫుట్​పాత్​లే టార్గెట్.. నగరంలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్, చేధించిన పోలీసులు-police rescue two kidnapped children in just two hours in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : ఫుట్​పాత్​లే టార్గెట్.. నగరంలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్, చేధించిన పోలీసులు

Hyderabad : ఫుట్​పాత్​లే టార్గెట్.. నగరంలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్, చేధించిన పోలీసులు

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 07:57 PM IST

Kidnap Cases in Hyderabad: చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.

ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. 2 గంటల్లోనే చేధించిన పోలీసులు
ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. 2 గంటల్లోనే చేధించిన పోలీసులు (unsplash)

Childrens Kidnap in Hyderabad: హైదరాబాద్‌లో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు నగర పోలీసులు. కేవలం 2 గంటల్లోనే 2 కిడ్నాప్‌ కేసులను ఛేదించారు. ప్యారడైజ్ వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మూడున్నరేళ్ల చిన్నారిని.. ఇద్దరు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అదే జంట సుల్తాన్ బజార్ వద్ద ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఏడు నెలల బాలుడిని ఎత్తుకెళ్లారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేశారు.

మొదట జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... రంగంలోకి దిగారు. నాలుగు బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దంపతుల దగ్గర కిడ్నాప్‌ అయిన పాపతో పాటు మరో చిన్నారిని కూడా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మహంకాళి ఏసీపీ రమేష్ వెల్లడించారు. ఇద్దరు పిల్లలను ఎత్తుకెల్లింది ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళగా గుర్తించారు. అయితే వీరు దంపతులా లేక ముఠాగా కలిసి చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. వీరి అరెస్ట్ తో మరిన్ని కిడ్నాప్ కేసుల సమాచారాన్ని కూడా లాగే పనిలో పడ్డారు పోలీసులు. చిన్నారులను కిడ్నాప్ చేసి ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థి సజీవ దహనం…

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లాకు శైలేష్ దుర్మరణం చెందాడు. నిజామాబాద్ బడాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల, సత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్‌(21) బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. అయితే శనివారం అతడు కారులో వెళ్తుండగా..ఎదురుగా వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. శైలేష్‌ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు వ్యాపించి... మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. ఈ ప్రమాద సమాచారాన్ని న్యూజెర్సీ అధికారులు శైలేష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడు... తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించారు. శైలేష్‌ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కోరారు.