Chiyaan Vikram: గాయం నుంచి కోలుకున్న విక్రమ్! మళ్లీ ఆ సినిమా షూటింగ్‍కు..-chiyaan vikram recovers from injury ready to join thangalaan shooting reports ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiyaan Vikram: గాయం నుంచి కోలుకున్న విక్రమ్! మళ్లీ ఆ సినిమా షూటింగ్‍కు..

Chiyaan Vikram: గాయం నుంచి కోలుకున్న విక్రమ్! మళ్లీ ఆ సినిమా షూటింగ్‍కు..

Chiyaan Vikram: హీరో విక్రమ్ గాయం నుంచి కోలుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన తంగలాన్ షూటింగ్‍లో మళ్లీ పాల్గొననున్నారట.

తంగలాన్ సినిమాలో హీరో విక్రమ్ గెటప్ ఇది

Chiyaan Vikram: ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ విభిన్న పాత్రలను పోషించటంలో దిట్ట. ప్రతీ సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. కష్టమైన పాత్రలు, డిఫరెంట్ గెటప్‍లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ అభిరుచిని చాటుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం విక్రమ్ మరో విభిన్నమైన మూవీ చేస్తున్నారు. తంగలాన్ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. పా రంజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. డీ గ్లామరస్ రోల్‍లో విక్రమ్ నటిస్తున్నారు. అయితే, ఈ చిత్ర షూటింగ్‍లో గత నెల గాయపడిన విక్రమ్ ఇప్పుడు కోలుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. వివరాలివే..

తంగలాన్ చిత్ర షూటింగ్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా.. గత నెల చియాన్ విక్రమ్‍కు తీవ్రగాయమైంది. యాక్షన్ సీన్ కోసం సన్నాహకం చేస్తుండగా.. ఆయన పక్కెటెముక విరిగింది. దీంతో తీవ్ర ఆందోళన రేకెత్తింది. చికిత్స కోసం విక్రమ్ కొన్ని రోజులు షూటింగ్‍కు దూరమయ్యారు. అయితే, విక్రమ్ ఇప్పుడు గాయం నుంచి కోలుకున్నారని తెలుస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో విక్రమ్.. తంగలాన్ షూటింగ్‍లో పాల్గొంటారని సమాచారం.

ఇప్పటికే తంగలాన్ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. విక్రమ్‍పై చిత్రీకరించిన సన్నివేశాలే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. విక్రమ్ షూటింగ్ స్టార్ట్ చేశాక 10 నుంచి 15 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తయి ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే ఛాన్స్ ఉంది.

కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోనే ఈ తంగలాన్ చిత్రం తెరకెక్కుతోంది. 19వ దశాబ్దంలో ఆ ప్రాంతంలో జరిగిన నిజజీవిత ఘటనల ఆధారంగా పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తంగలాన్ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలను కూడా చిత్ర యూనిట్ గతంలో విడుదల చేసింది. వీటిని చూస్తే విక్రమ్ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది.

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ తంగలాన్ చిత్రానికి జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ఉన్నారు. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2డీతో పాటు 3జీ ఫార్మాట్‍లోనూ ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఉన్నారు. పార్వతి తిరువోతు, మాళవిక మోహన్, పుశుపతి, హరికృష్ణన్ అన్బుదొరై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది చివరికి లేదా 2024 ప్రారంభంలో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.