Chandrababu On YCP : జగన్ రెడ్డి చెప్పింది నిజమే.. వెనక ఉన్న నలుగురు వీరే..
Chandrababu Tweet On YS Jagan: ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు... గురువారం నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బీసీ మహాసభలో జగన్ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు.
Idhem Karma Mana Rastraniki Program By TDP: అధికార వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తూ 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అంటూ టీడీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు పలు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించగా... భారీగా స్పందన వచ్చింది. తాజాగా గుంటూరు, బాపట్ల జిల్లాల పర్యటన కూడా ఖరారైంది. ఈ మేరకు గురువారం నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు... గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తారు,
ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటన కొనసాగగా... రేపు బాపట్ల జిల్లాలో, ఎల్లుండి చీరాలలో పర్యటిస్తారు. గతవారం మూడు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో తిరిగిన చంద్రబాబు, ఈ వారం మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల మీదుగా పర్యటిస్తారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధమైంది.
గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా భారీ రోడ్ షో తో రాత్రికి పొన్నూరు చేరుకుంటారు. పెదకాకాని నుంచి పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి దూళిపాళ్ల నరేంద్ర భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. నారా కోడూరులో రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్న తర్వాత... రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు బాపట్ల జిల్లా.. బాపట్ల టౌన్ లో రోడ్ షో నిర్వహించడంతోపాటు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఈనెల 10వ తేదీన బాపట్ల జిల్లా చీరాలలో రోడ్ షో ,బహిరంగ సభ ,ముస్లిం నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. పార్టీ అధినేత చంద్రబాబు పర్యటను విజయవంతం చేసేందుకు ఇరు జిల్లాల నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు కౌంటర్
Chandrababu On YS Jagan: బీసీ మహాసభ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'నా వెనుక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా నిన్న సీఎం జగన్ రెడ్డి చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి' అంటూ రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే బుధవారం విజయవాడ వేదికగా వైసీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ మహా సభను నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్… టీడీపీ టార్గెట్ గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని వ్యాఖ్యానించారు.