Opinion: బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా బీజేపీ-opinion piece on ysrcp tdp jana sena performance in achieving pending provisions of bifurcation act ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Opinion Piece On Ysrcp Tdp Jana Sena Performance In Achieving Pending Provisions Of Bifurcation Act

Opinion: బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా బీజేపీ

HT Telugu Desk HT Telugu
May 02, 2023 12:04 PM IST

‘విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం..’ - లోక్‌సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి రాజకీయ విశ్లేషణ

బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు
బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు

తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు. పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం.

ట్రెండింగ్ వార్తలు

దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి ఈ ముగ్గురు రాష్ట్ర భవిష్యత్తును అగాథంలోకి నెడుతున్నారు. రాజకీయంగా రాష్ట్రాన్ని వీరు తాకట్టుపెట్టిన తీరు చూస్తుంటే, దశాబ్దాల కింద ‘తాకట్టులో భారతదేశం’ అని కమ్యూనిస్టు యోధుడు తరిమెళ నాగిరెడ్డి అన్నమాటలు గుర్తొస్తాయి.

రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ చేసిన తప్పు అని రాద్దాంతం చేసే ఈ మూడు పార్టీలూ ఈ పదేళ్లలో విభజన చట్టంలోని హామీలను అమలు చేయని బీజేపీ పల్లకి మోయడం చూస్తే, వీరి అసలు రంగేంటో ఇట్టే అర్థమైపోతుంది. 2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దానికి ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలి ఉంది. కానీ, ఇప్పటి వరకూ కనీసం ఒక్క హామీ కూడా బీజేపీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.

విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని, 2014 సాధారణ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై మాట మార్చి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఇంత మోసం చేసినా ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఇప్పుడు కిమ్మనకుండా, బీజేపీని పల్లెత్తు మాటనకుండా మెలుగుతున్న టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన పార్టీలు ఆడుతున్న డ్రామా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పట్ల వారికున్న ప్రేమకు అద్దం పడుతుంది.

మడిమ తిప్పిన జగన్‌

2019 ఎన్నికల ముందు వరకు ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి తామే పోరాడుతున్నామని చెప్తూవచ్చిన జగన్‌ ప్రజల సానుభూతిని తమ ఖాతాలో వేసుకున్నారు. విపక్షంలో ఉండగానే అఖిలపక్ష సమావేశం జరిపి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేద్దామంటూ ప్రతిపాదించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్‌ ఫిరాయించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానంటూ దీక్షలు, ధర్నాలు చేసిన జగన్‌ ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా?

లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు ఏనాడు ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన పాపాన పోలేదు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా జగన్‌ ప్రభుత్వం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలని కలిసిన సందర్భాల్లో రాష్ట్ర సమస్యలు విన్నవించినట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప, సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రకటించలేదు. పోరాటానికీ సిద్ధం కాలేదు. తమ అనుబంధం రాజకీయాలకి అతీతమైనది అంటూ నేరుగా మోదీ సమక్షంలో ప్రకటించిన జగన్‌, మీ అనుబంధం వల్ల మన రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలేంటో చెప్పగలరా?

‘యూ’ టర్నుల బాబు...

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ‘యూ’ టర్నులు కొత్త కాదు. తన స్వార్థం కోసం రోజుకో మాట మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ‘జీవితంలో ఇక బీజేపీతో పొత్తు పెట్టుకోను’ అని శపథం చేసిన చంద్రబాబు, 2014 నిస్సిగ్గుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు బీజేపీతో చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. మంత్రి పదవులు పంచుకున్నారు. కానీ, ఆ నాలుగేళ్లూ టీడీపీకి ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా, విభజన హామీలు గుర్తురాలేదు. రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి మట్టి, నీళ్లు పట్టుకొస్తే బాబు సంతోషంగా పుచ్చుకున్నారు. తీరా 2019 ఎన్నికల ముందు ఆయనకు జ్ఞానోదయం అయినట్టు ‘యూ’ టర్న్‌ తీసుకొని డ్రామాలు ఆడారు. మోదీ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారనీ, మోదీ హయాంలో దేశం అభివృద్ధి కుంటుపడిరదన్నారు. హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని మొదట ఒప్పుకున్న చంద్రబాబే తర్వాత మాటమార్చి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ ధర్మదీక్ష చేశారు. అయినా రాష్ట్ర ప్రజలు ఆయన నాటకాలను నమ్మలేదు.

అంతేకాక 2019లో అధికారం కోల్పోయాక ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి ఇటు గల్లీలో అటు ఢల్లీిలో టీడీపీ ఎంపీలు మాట్లడిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకొచ్చానని ప్రకటించుకున్న బాబు, ఇటీవల రిపబ్లిక్‌ టీవీ చర్చా వేదికలో మోదీ వల్లే దేశానికి గుర్తింపు వచ్చిందని చెప్పి అందరినీ విస్మయానికి గురి చేశారు. నాడు ఆయన చేసిన ధర్మదీక్షలన్నీ నేడు అధర్మ దీక్షలయ్యాయా? అమరావతి శంకుస్థాపనకు తెచ్చిన దోసెడు మట్టి, ముంత నీళ్లు నేడు తీర్థ ప్రసాదాలయ్యాయా?

మరి యువగళం పాదయాత్రలో ‘‘మాకూ 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా మాత్రమే కాదు విభజన చట్టంలోని ప్రతి అంశంపైనా పోరాడుతాం. న్యాయపోరాటం చేస్తాం’’ అంటున్న లోకేశ్‌ మాటలు నమ్మాలా? లేక తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్న చంద్రబాబు మాటలు నమ్మాలా? ప్రజాస్వామ్యం, లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటకలో, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని బీజేపీ ప్రకటనలు చేస్తోంది, దీనిపై టీడీపీ వైఖరి ఏంటి? బీజేపీ చేస్తున్న తప్పులకు కూడా ఇప్పుడు టీడీపీ సమాధానం చెప్పాలి.

క్లారిటీ లేని పవన్‌

ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు బీజేపీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిట్టిపోశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. కానీ, 2021కి వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయ్యింది. వామపక్షాలను వదిలేసి, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీతోనే మళ్లీ దోస్తీ కట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించుకున్నారు. కానీ ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాత్రం ఆయన ప్రస్తావించడం లేదు. పవన్‌ బీజేపీని అడగాల్సింది రోడ్‌ మ్యాప్‌ కాదు, ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌కు ఏం ఇచ్చారో అడగాలి. జగన్‌ దుష్ట పాలన అంతం చేస్తామని చెప్తున్న జనసేనానికి మోదీ పాలనలో ఏమి విజన్‌ కనిపించిందో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపైన ఉందని పవన్‌ గుర్తించాలి.

బీజేపీ ఏమిచ్చింది?

ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయకపోయినా, విశాఖ ఉక్కును ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగిస్తామన్నా మౌనమే. పెరిగిన ధరలకు అనుగుణంగా డిపిఆర్‌ సవరించకపోయినా, వైజాగ్‌ రైల్వే జోన్‌, వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టు, తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్‌ అంశాలపై తాత్సార్యం చేస్తున్నా, విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారం విద్యా సంస్థలను ఏర్పాటు చేయకపోయినా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమీపంలో దుగరాజపట్నం ఓడరేవు నిర్మించకపోయినా ఏనాడు కిమ్మనదీలేదు.

వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోయినా, బీజేపీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేసినా... బాబు, జగన్‌, పవన్‌ ఒక్క మాటా మాట్లాడరు. అన్యాయంగా కాంగ్రెస్‌ పార్టీ విభజించిందని మాట్లాడే ఈ ముగ్గురూ 9 ఏళ్లుగా అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు.

స్నేహం కోసం ఎదురుచూపులు

ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా మోదీతో స్నేహం చేయడానికి అర్రులు చాస్తున్నారు. ఈ మూడు పార్టీలు ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను మింగేశాయి. ఈ మూడు పార్టీలు ఆంధ్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాయి. తమ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశాన్ని అదానీకి తాకట్టపెట్టిన మోదీకి తాకట్టు పెట్టాయి. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పౌరసమాజం సదా అప్రమత్తంగా ఉండి ఎన్నికల సమయంలో వీరికి బుద్ధిచెప్పటం ఒకటే సరైన పరిష్కారం.

- భీశెట్టి బాబ్జి,

లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌

ఫోన్‌ నెం. 9866017413

లోక్‌సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి
లోక్‌సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవే. హెచ్‌టీ తెలుగువి కావు)

IPL_Entry_Point

సంబంధిత కథనం