Tirumala Drone visuals : తిరుమలలో 'డ్రోన్' అలజడి.. ఆ వీడియో నిజమేనా..?-drone visuals of tirumala goes viral on social media ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Drone Visuals : తిరుమలలో 'డ్రోన్' అలజడి.. ఆ వీడియో నిజమేనా..?

Tirumala Drone visuals : తిరుమలలో 'డ్రోన్' అలజడి.. ఆ వీడియో నిజమేనా..?

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 10:47 AM IST

Drone visuals of Tirumala temple: తిరుమల ఆలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో ఒకటి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

తిరుమలలో డ్రోన్ వీడియో కలకలం
తిరుమలలో డ్రోన్ వీడియో కలకలం (facebook)

Tirumala Drone visuals Viral: తిరుమల... ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. అధ్యాత్మిక నగరిగా విరసిల్లుతోంది. ప్రపంచం నలుమూలాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి తిరుగిరుల్లో భారీ భద్రత ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. తిరుమల కొండపై ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించారు. విమానాలు, హెలికాప్టర్లకు ఆ కొండ పైనుంచి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించిన ఓ డ్రోన్ వీడియో ప్రస్తుం ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎవరు తీశారు..? డ్రోన్ ఎలా వచ్చింది..? అసలు ఆ వీడియో నిజమేనా..? వంటి ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. దీనిపై టీడీపీ విజిలెన్స్ విచారణ ముమ్మరం చేసే పనిలో పడింది. నిత్యం పటిష్ట భద్రత నడుమ ఉండే తిరుమల కొండపై డ్రోన్ కెమెరా ఎలా ఎగిరింది? ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారు? విజిలెన్స్ సిబ్బంది ఎందుకు కనిపెట్టలేకపోయారు? అసలు ఇది నిజమేనా? నకిలీ వీడియోనా? అన్నది తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అకౌంట్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో

డ్రోన్ వీడియో అంశంపై టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

IPL_Entry_Point