Jagananna Vidya Deevena : జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల.. 'పిల్లలకిచ్చే ఆస్తి చదువే'-cm jagan disburses rs 694 crores under jagananna vidya deevena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Disburses Rs 694 Crores Under Jagananna Vidya Deevena

Jagananna Vidya Deevena : జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల.. 'పిల్లలకిచ్చే ఆస్తి చదువే'

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 06:24 PM IST

సీఎం వైఎస్ జగన్ 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి రూ.694 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. పిల్లలకు మనమిచ్చే.. ఆస్తి చదువేనని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.

జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం
జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం

2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి.. రూ.694 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. బటన్ నొక్కి.. సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. అనంతరం బాపట్ల సభలో మాట్లాడారు. పథకాలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక వర్గానికి చెందిన నలుగురు మాత్రమే లబ్ధి పొందారని, ఇప్పుడు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

'మా ప్రభుత్వం పేదలకు నేరుగా డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందజేస్తోంది. ఈ పాలనకు గత పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలి. ఏ కుటుంబమూ చదువు కోసం అప్పులు చేయకూడదనే ఉద్దేశ్యంతో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాం.' అని సీఎం జగన్ అన్నారు.

అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం, బైజూస్‌ పథకాలతో మూడేళ్లలో విద్యారంగంలో రూ.53 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి విద్యేనని చెప్పారు. అందుకే ప్రభుత్వం పేదల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుందని జగన్ పునరుద్ఘాటించారు. ‘ప్రపంచంలో ఊహించని విధంగా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులతో కలిసి మనం ప్రయాణం చేయాలి. లేకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడలేరు. రాబోయే కాలంలో పోటీని ఎదుర్కొంటూ సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో పిల్లలంతా జీవించాలి.' అని సీఎం పేర్కొన్నారు.

పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే చూసుకుంటుంది. ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నాం. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశాం. ఏప్రిల్‌-జూన్‌ 2022 కాలానికి 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

- సీఎం జగన్‌

IPL_Entry_Point