AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ.. 15 బిల్లులకు ఆమోదం
AP Budget Session 2023 : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 45 అజెండా అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి జగన్(CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు.. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం(BAC Meeting) నిర్వహించారు. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
తొమ్మిది రోజులపాటుగా.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) జరుగుతాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
సమావేశం తర్వాత.. చీఫ్ విప్ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందన్నారు. బడ్జెట్ సెషన్(Budget Session) కావడంతో శని, ఆదివారాల్లోనూ సమావేశాలు కొనసాగుతాయని వెల్లడించారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవులు ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. ప్రతిపక్షం లేవనెత్తే.. అంశాలపై చర్చకు సిద్ధమని ప్రసాదరాజు అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మంగళవారం ఉదయం మెుదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఆర్థికాభివృద్ధిలో ఆంధ‌్రప్రదేశ్(Andhra Pradesh) ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నట్లు గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవంలో వివరించారు. ఏపీలో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నట్లు వివరించారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
అవినీతికి తావులేవకుండా అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. నాలుగేళ్లుగా ఏపీలో సుపరిపాలన అందించినట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారి సంక్షేమ పథకాల అమలు కోసం వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.