Telangana Lok Sabha Polls 2024 : ఒకే పేరు... అభ్యర్థులు వేర్వురు..! ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు సరికొత్త టెన్షన్-duplicate names stir ballot confusion in several other parliament constituencies in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Lok Sabha Polls 2024 : ఒకే పేరు... అభ్యర్థులు వేర్వురు..! ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు సరికొత్త టెన్షన్

Telangana Lok Sabha Polls 2024 : ఒకే పేరు... అభ్యర్థులు వేర్వురు..! ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు సరికొత్త టెన్షన్

Maheshwaram Mahendra Chary HT Telugu
May 02, 2024 10:20 PM IST

Lok Sabha Election in Telangana : తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురి అభ్యర్థులకు సరికొత్త టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతోనే మరికొందరు కూడా బరిలో ఉన్నారు. దీంతో ఓట్లు చీలే ఛాన్స్ ఉందని ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు - 2024
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు - 2024

Same Name Candidates in Telangana polls 2024: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తక్కువ సమయమే మాత్రమే ఉండటంతో మరింత దూకుడు పెంచాలని  చూస్తున్నారు. గెలుపుపై లెక్కలు వేసుకుంటూ… ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు. 

ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులకు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఒకే పేరు ఉన్న అభ్యర్థులు బరిలో ఉండటంతో ఓట్లు చీలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇదే విషయంపై చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(konda vishweshwar reddy) పేరు ఉన్న మరో అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు.  దీంతో అలర్ట్ అయిన బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి… ఈసీకి ఓ వినతిపత్రం ఇచ్చారు. సీరియల్ నెంబర్లు దూరంగా కేటాయించాలని కోరారు. ఒకే చోట ఉంటే ఓటర్లు అయోమయానికి గురవుతారని లేఖలో ప్రస్తావించారు.  ఇదే విషయంపై తగిన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని ఈసీకి హైకోర్టు సూచించింది.

ఇదే తరహాలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా తుటుకూరు జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి పోటీలో ఉండగా…. డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ తరపున అంబోజు రవి పోటీ చేస్తున్నారు.

ఈ నియోజకవర్గాల్లోనూ సేమ్ సేన్…

  • భువనగిరి పార్లమెంట్(Bhuvanagiri parliamentary constituency) పరిధిలో చూస్తే బీఆర్ఎస్ తరపున క్యామ మల్లేశ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ యూ. మల్లేశ్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇదే సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తుండగా…స్వతంత్ర అభ్యర్థిగా బూర నర్సయ్య అనే వ్యక్తి నామినేషన్ వేశాడు. అయితే ఇతని నామినేషన్ ను ఈసీ రిజెక్ట్ చేసింది. 
  • భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమిరెడ్డి కిరణ్ రెడ్డి బరిలో ఉన్నారు.
  • కరీంనగర్ లో చూస్తే కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ ఉండగా… స్వతంత్ర అభ్యర్థిగా పోతూరి రాజేందర్ పోటీ చేస్తున్నారు.
  • ఖమ్మంలో(khammam lok sabha constituency) బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్ రావు పోటీ చేస్తుండగా…. అల్ ఇండియా నేషన్ రక్షా పార్టీ తరపున లాకావత్ నాగేశ్వర్ రావు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కాసిమెల్ల నాగేశ్వరరావు, కాటుకోజ్వాల నాగేశ్వరరావు అనే అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
  • మల్కాజ్ గిరిలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ఉండగా….  ఇండిపెండెంట్ గా బుద్ధి రాజేందర్ నామినేషన్ వేశారు. 
  • నల్గొండ సెగ్మెంట్ లో చూస్తే… బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా…. ఇండిపెండెంట్  అభ్యర్థిగా లింగం కృష్ణా ఉన్నారు.
  • పెద్దపల్లిలో బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తుండదగా…. దుర్గె ఈశ్వర్ అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. ఈసీ పరిశీలనలో ఈ పేరు రిజెక్ట్  అయింది. ఇదే నియోజకవర్గంలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గోమాస ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ దగ్గం అనే వ్యక్తి బరిలో ఉన్నాడు. 
  • జహీరాబాద్ లో(zaheerabad lok sabha constituency) చూస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్ షెట్కర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ సురేశ్ విటల్ కుమార్ షెట్కర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈసీ పరిశీలనలో ఈ పేరు తిరస్కరణకు గురైంది.

ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు బరిలో ఉంటే…. ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. అయితే బ్యాలెట్ లో దూరంగా సదరు వ్యక్తుల పేర్లు ఉంటే ఓట్లు చీలే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ దగ్గర దగ్గరగా ఉంటే మాత్రం…. క్రాస్ ఓటింగ్ కు ఛాన్స్ ఉంటుంది. ఒకే పేర్ల విషయంలో ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు రావొచ్చు. కొన్నిసార్లు విజయం అనేది కేవలం ఒక్క ఓటుతోనే మారిపోతుంది. కాబట్టి… ఎన్నికల ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కీలకమే…!

WhatsApp channel