Notices to YS Sharmila: షర్మిల పాదయాత్రకు మరో బ్రేక్.. పోలీసుల నుంచి నోటీసులు-waragal police have issued a show cause notice to ys sharmila ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Waragal Police Have Issued A Show Cause Notice To Ys Sharmila

Notices to YS Sharmila: షర్మిల పాదయాత్రకు మరో బ్రేక్.. పోలీసుల నుంచి నోటీసులు

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 09:49 AM IST

YS Sharmila Padayatra Updates: వైఎస్ షర్మిల పాదయాత్ర కు వరంగల్ పోలీసులు బ్రేక్ వేశారు. పాదయాత్రపై షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

వైఎస్ షర్మిలకు నోటీసులు
వైఎస్ షర్మిలకు నోటీసులు (twitter)

YS Sharmila Praja Prasthanam Padayatra: వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నర్సంపేట ఘటనతో ఒక్కసారిగా షర్మిల టార్గెట్ గా టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అదేస్థాయిలో షర్మిల కూడా జవాబునిస్తున్నారు. బస్సుపై దాడి, హైదరాబాద్ లో షర్మిల అరెస్ట్, తదితర పరిణామాలను గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు షర్మిల. ఈ నేపథ్యంలో ఆమె పాదయాత్ర కొనసాగిస్తారా..? లేక ఆపుతారా అన్న చర్చ కూడా నడించింది. ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల... స్పష్టతనిచ్చారు. తన పాదయాత్ర తిరిగి ఈ నెల 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

షర్మిల ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో వరంగల్ పోలీసులు షర్మిలకు మరో షాక్ ఇచ్చారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. షర్మిల రాసిన అనుమతి లేఖను ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని తిరిగి షర్మిలకు పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒకసారి అనుమతి ఇస్తేనే వ్యక్తిగత దూసుషణలకు దిగి.. శాంతిభద్రతల సమస్యకు కారణమయ్యారని నోటీసులో పేర్కొన్నారు. దానిపై వివరణ ఇచ్చాకే అనుమతి ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం రాత్రే పోలీసులు ఈ నోటీసులు ఇవ్వగా…ఆమె నుంచి స్పందన రానట్లు తెలుస్తోంది. ఒకవేళ పాదయాత్ర చేపట్టినా… పోలీసులు అడ్డుకునే అవకాశముందని వైఎస్సార్‌టీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచి పున:ప్రారంభం కావాల్సిన షర్మిల పాదయాత్రపై డైలమా నెలకొంది. దీనిపై ఆ పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల షర్మిల పాదయాత్రలో చోటుచేసుకున్న పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. షర్మిల కారవాన్, కారుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్ర నిలిపివేయాలని పోలీసులు సూచించినా.. షర్మిల ఆపకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని తన ఇంటికి తరలించారు. అనంతరం ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లిన షర్మిలను అరెస్ట్ చేయడం, ఆమె కారులో ఉండగానే క్రేన్‌తో తీసుకెళ్లడం హైడ్రామాకు తెరతీశాయి.ఈ పరిణామాలపై ఆమె... గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పాదయాత్ర ఎక్కడ అగిందో అక్కడ్నుంచే ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని నర్సంపేట టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పాదయాత్రను మళ్లీ అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అనుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారు. పాదయాత్రలో మళ్లీ శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో.. షర్మిలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

అయితే వరంగల్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వైఎస్ షర్మిల సమాధానం ఇస్తారా? లేదా షెడ్యూల్ ప్రకారం నేడు పాదయాత్రను తిరిగి మొదలుపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point