YS Sharmila : హైదరాబాద్‌లో హైడ్రామా…చలో ప్రగతి భవన్‌కు సిద్ధమైన షర్మిల…-ysrtp president sharmila arrested by telangana police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ysrtp President Sharmila Arrested By Telangana Police

YS Sharmila : హైదరాబాద్‌లో హైడ్రామా…చలో ప్రగతి భవన్‌కు సిద్ధమైన షర్మిల…

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 02:22 PM IST

YS Sharmila నర్సంపేట ఉదంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను పంజాగుట్టలో పోలీసులు అడ్డుకున్నారు . సోమాజిగూడ నుంచి ప్రగతి భవన్‌ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ షర్మిల బయలుదేరడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పంజాగుట్ట చౌరస్తాలో పోలీసులు షర్మిలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

ప్రగతి భవన్ బయల్దేరిన వైఎస్‌.షర్మిల
ప్రగతి భవన్ బయల్దేరిన వైఎస్‌.షర్మిల

YS Sharmila నర్సంపేటలో సోమవారం వైఎస్ షర్మిల వాహనాలపై టిఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేయడంతో మొదలైన రగడ సోమవారం కూడా కొనసాగింది. సోమవారం రాత్రి నర్సంపేట నుంచి షర్మిలను బలవంతంగా హైదరాబాద్‌ నివాసానికి తరలించారు. ఈ ఘటనపై షర్మిల నిరసన తెలపాలని నిర్ణయించారు. నర్సంపేటలో దాడి తర్వాత షర్మిలను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారని భావించినా ఆమెను లోటస్ పాండ్ తరలించి ఇంటి దగ్గర విడిచిపెట్టారు. పాదయాత్రకు అటంకాలు కల్పించడంతో కేసీఆర్‌ ఎదుట నిరసనకు తెలపాలని నిర్ణయించారు. మంగళవారం ఉదయం పోలీసుల కళ్లుగప్పి సోమాజిగూడ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి చలో ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చారు.

పంజాగుట్ట నుంచి ధ్వంసమైన వాహనాలతో ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు బయల్దేరారు. షర్మిల స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ బయల్దేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు వాహనాన్ని అడ్డు పెట్టి షర్మిల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో 40 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. షర్మిల వాహనంలో కొంతమంది పార్టీ నాయకులు కూడా ఉన్నారు. పోలీసులు విజ్ఞప్తి చేసినా షర్మిల దిగిరాకపోవడంతో క్రేన్ సాయంతో వాహనాన్ని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత కూడా ఆమె వాహనం నుంచి కిందకు దిగేందుకు నిరాకరించారు. దాదాపు ఏడాది కాలంగా తాను పాదయాత్ర చేస్తున్నా ఎప్పుడు రాని అడ్డంకులు నర్సంపేటలో ఎందుకు ఎదురయ్యాయని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో టిఆర్‌ఎస్ నాయకుల్ని షర్మిల విమర్శించడంపై పలు సందర్భాల్లో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో వివాదం మొదలైంది. పాదయాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. నర్సంపేటలో జరిగిన దాడి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరిగిందని ఆరోపించారు.

షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వాహనాలను టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. షర్మిల బస చేసే బస్సును దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. నర్సంపేటలో బహిరంగ సభ నిర్వహించకుండానే ఆమె యాత్ర ముగించాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోమవారం రాత్రి షర్మిలను హైదరాబాద్ తరలించారు. దీంతో ఆమె కేసీఆర్‌ ఎదుట నిరసనకు దిగాలని నిర్ణయించారు. షర్మిలను బుజ్జగించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారు దిగేందుకు షర్మిల నిరాకరించడంతో కారు తలుపులు తెరిచే మెకానిక్ సాయంతో తలుపులు తెరిచి అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట వద్ద వాహనాన్ని తరలించే సమయంలో వైఎస్సార్‌టీపీ నాయకుల నుంచి షర్మిలకు ప్రతిఘటన ఎదురైంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వాహనం నుంచి కిందకు దిగడానికి షర్మిల తీవ్రంగా ప్రతిఘటించారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని షర్మిల ఆరోపించారు.పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌లోకి తరలించారు. పోలీస్ స్టేషన్‌ ఎదుట షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు.

IPL_Entry_Point

టాపిక్