YS Sharmila vs TRS: నిజంగానే షర్మిల బీజేపీ వదిలిన బాణమా..?-trs serious allegations on ys sharmila role in telangana politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Serious Allegations On Ys Sharmila Role In Telangana Politics

YS Sharmila vs TRS: నిజంగానే షర్మిల బీజేపీ వదిలిన బాణమా..?

Mahendra Maheshwaram HT Telugu
Dec 01, 2022 06:10 AM IST

వైఎస్ షర్మిల టార్గెట్ గా టీఆర్ఎస్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. ఇష్టానుసారంగా మాట్లాడితే.. సహించబోమని వార్నింగ్ లు ఇస్తోంది. ఇదే సమయంలో షర్మిల.. బీజేపీ కోవర్టు అని ఆరోపిస్తోంది.

వైఎస్ షర్మిల( ఫైల్ ఫొటో)
వైఎస్ షర్మిల( ఫైల్ ఫొటో) (twitter)

TRS Leaders Fires On YS Sharmila: వైఎస్ షర్మిల... ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్..! ప్రజాప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె... పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశారు. పెద్దగా ఇబ్బందులు లేకుండానే ఆమె యాత్ర కొనసాగుతూ వచ్చింది. సీన్ కట్ చేస్తే... నర్సంపేట ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో కంప్లీట్ గా పరిస్థితి మారిపోయింది. ఏకంగా వైఎస్ఆర్టీపీకి చెందిన ఓ బస్సునే తగలబెట్టే వరకు పరిస్థితి వచ్చింది. ఈ దాడిని ఖండిస్తూ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడిలో పాడైన వాహనాలతోనే షర్మిల ప్రగతి భవన్‌ వైపు వెళ్లడం, ఆమె కారులో ఉండగానే.. పోలీసులు కారును లాక్కెళ్లడం.. అనంతరం అరెస్ట్ చేయడం.. వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం... ఓ రేంజ్ లోనే ఫైర్ అవుతున్నారు. ఇక నుంచి తగ్గేదేలే అని చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీతో ముడిపెట్టి కార్నర్ చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో మరోసారి వైఎస్ షర్మిల పార్టీపై సరికొత్త చర్చ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీ బాణమా...?

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. 2019 ఎన్నికల్లో సోదరుడు జగన్ కు మద్దతుగా కూడా ప్రచారం చేశారు. అనంతరం ఆమె... ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఏకంగా తెలంగాణలో ఓ రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. రాజన్న రాజ్యమే తమ లక్ష్యమని ప్రకటించి ముందుకెళ్తున్నారు. తెలంగాణలోనే పుట్టానని... ఇక్కడి ప్రయోజనాల కోసమే తుది శ్వాస వరకు పని చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటుతో పాటు అజెండా కూడా ప్రకటించి బలపడే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆమె పార్టీ ప్రకటన చేసిన రోజుల్లోనే అనేక ఊహాగానాలు వచ్చాయి. షర్మిలతో బీజేపీనే పార్టీ ఏర్పాటు చేయించిందనే వాదన కూడా వచ్చింది. అయితే వీటిని తీవ్రంగా కొట్టిపారేశారు వైఎస్ షర్మిల. అనంతరం ఈ చర్చ పెద్దగా రాలేదు. పలు ప్రజాసమస్యలపై పోరాడుతూ వచ్చారు షర్మిల. ప్రతి మంగళవారం దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గాల్లో చేస్తున్న యాత్రలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. పలువురు ఎమ్మెల్యేలు షర్మిలపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా నర్సంపేట ఘటన తర్వాత... టీఆర్ఎస్ మరింత తీవ్రంగా స్పందిస్తోంది.

హైదరాబాద్ లో పోలీసులు అడ్డుకోవటం..కారులో షర్మిల కూర్చొని ఉండగానే.. కారును లాక్కుంటూ వెళ్లటంతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. దీనిని బీజేపీ నేతలతో పాటుగా రాష్ట్ర గవర్నర్ తప్పు బట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఒక్కరిద్దరూ కాంగ్రెస్ నేతలు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అంశమే టీఆర్ఎస్ కు సరికొత్త అస్త్రంగా మారినట్లు అయింది. తొలి నుంచి బీజేపీ వదిలిన బాణంగా షర్మిల గురించి వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డైరెక్టుగా అవే విమర్శలు గుప్పిస్తున్నారు. తాము వదిలిన బాణం..తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలకు షర్మిల కృతజ్ఞతలు తెలపటం కూడా ఈ పరిణామాలను బలపరిచినట్లు అయింది. ఇక కేవలం బీజేపీ కోవర్టు అనటమే కాదు... ఏకంగా నాడు వైఎస్ఆర్ చేసిన వ్యాఖ్యలు, బయ్యారం గనులు, సీమాంధ్ర ఉద్యమం వంటి అంశాలను కూడా తెరపైకి తీసుకువస్తోంది టీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షర్మిల రోల్ పై అనుమానాలు ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజానికి తమకు ఎవరితో పొత్తు ఉండదని షర్మిల చెబుతున్నప్పటికీ... ఏదో ఒక పార్టీతో జట్టు కట్టుడతారనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ తో జత కట్టే అవకాశం లేనట్లు కనిపిస్తుండగా.... బీజేపీతో జత కడుతారా అనే చర్చ ప్రస్తుతం మొదలైంది. మొత్తానికి తాజాగా జరుగుతున్న పరిణామాలతో ముందు ముందు వైఎస్ షర్మిల ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఇక టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఏ విధంగా జవాబు ఇస్తారనేది కూడా చూడాలి.

IPL_Entry_Point