Opinion: కమలనాథుల చేతుల్లోనే ఉలి.. రెండోస్థానానికి బహుమతి లేదు-there is no prize for the second place says political analyst dileep reddy about bjp performance in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  There Is No Prize For The Second Place Says Political Analyst Dileep Reddy About Bjp Performance In Telangana

Opinion: కమలనాథుల చేతుల్లోనే ఉలి.. రెండోస్థానానికి బహుమతి లేదు

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 04:34 PM IST

‘బీజేపీ ఎదుర్కొనే పరిస్థితుల్లో బెంగాల్‌కు తెలంగాణకు కొన్ని సామ్యాలున్నాయి. వామపక్ష పార్టీల ప్రభావం, ముస్లీం మైనారిటీలు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు, కాంగ్రెస్‌ చతికిలపడి దాన్నుంచే ఎదిగిన ప్రాంతీయ పార్టీ.... ఇలా చాలా పోలికలున్నాయి..’ - ఆర్.దిలీప్ రెడ్డి, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ విశ్లేషణ

ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర
ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర

రెండో స్థానానికి బహుమతి ఉండదు రాజకీయాల్లో! ఒకటి కానప్పుడు... రెండైనా, ఇరవై అయినా ఒక్కటే! అందుకే, రెండో స్థానం సరిపెట్టుకోవడానికి రాజకీయ పార్టీలేవీ ఇష్టపడవు. ఒకటో స్థానానికెగబాకటానికే అన్ని ప్రయత్నాలూ! దానికి ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ, ఆ పేరుతో అతివిశ్వాసమే ప్రమాదకరం! ఎదుగుదలకది పెద్ద అవరోధం కూడా!

మొదటి స్థానం కోసం తెలంగాణలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అది దక్కాలంటే, ఇప్పుడు అక్కడున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని కిందకు దించాలి. అందుకోసం, వారితోనే పోటీపడాలి, తాడో పేడో ఆ పార్టీతోనే తేల్చుకోవాలి. ఇంకో జాతీయపార్టీ కాంగ్రెస్‌తో కాదు. కాంగ్రెస్‌తో పోటీ పడటమో, వారికన్నా మెరుగ్గా ఉన్నామనో, రాష్ట్రంలో రెండోస్థానం మాదే అనో చంకలు గుద్దుకుంటే, అంతిమంగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు, తీవ్రమైన భంగపాటు తప్ప!

రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేని ఈ తరుణంలో... సర్కారు ఏర్పాటుకు సరిపడా గెలవగల సీట్లు, తగినన్ని స్థానాలు గెలిపించే ఓట్లు, అవి రాబట్టే పార్టీ ఏ‘ర్పాట్లు’ తమకు ఉన్నాయా? లేవా? బీజేపీ నాయకత్వం సరిచూసుకోవాలి. అందుకొక వ్యూహం, ప్రణాళిక, కార్యాచరణ కావాలి. ఆ దిశలో అడుగులు పడుతున్న జాడలేవీ కనిపించడం లేదు. పునాది పటిష్టంగా లేనిదే ఆధారపడదగ్గ ఏ నిర్మాణం సాధ్యపడదు. ఒకవేళ, ఏదేదో చేసి ఓ సౌధాన్ని కట్టేస్తామనుకున్నా, నాలుగు కాలాలు నిలువడం దుస్సాధ్యం. వాటి కోసం ఓ పక్కా రోడ్‌ మ్యాప్‌ ఉండాలి. సదరు ఎజెండానే బీజేపీ ప్రస్తుతం మిస్సవుతోందనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతోంది.

ప్రత్యామ్నాయ విధానం ఏది?

ప్రచారం చేసినంత తేలిక కాదు ప్రజల్ని నమ్మించడం. ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ని, ఆయన టీఆర్‌ఎస్‌ సర్కారును కాదని, తెలంగాణలో బీజేపీని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలో ప్రజలకు గట్టిగా తెలియజెప్పడం పార్టీ నాయకత్వం ముందున్న కర్తవ్యం. తమవైన విధానాల ప్రచారంతో వారిపై గాఢమైన ముద్ర వేయాలి. తాము తెలంగాణలో బలమైన ఒక ప్రాంతీయ పార్టీతో తలపడుతున్నామన్న వాస్తవాన్ని రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు మరచిపోతున్నాయి.

టిక్కెట్ల కేటాయింపు నుంచి హామీలివ్వడం, అమలు వరకు ప్రాంతీయ పార్టీలకుండే వెసులుబాటు జాతీయపార్టీలకు ఉండదు. దానికి కారణం, వేర్వేరు రాష్ట్రాల్లో అవి వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు ప్రత్యర్థులనెదుర్కొంటూ ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ఇంకా మెరుగుపరచి ఇస్తామని చెప్పడమొక్కటే సరిపోదు. అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే ఆర్థిక, సామాజిక ప్రత్యామ్నాయ విధానమేమిటో స్పష్టం చేయాలి. అది ప్రజల జీవితాల్ని ఎలా మెరుగుపరచగలదో నమ్మకం కుదిరేలా ప్రజలకు బీజేపీ వివరించగలగాలి.

ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ముఖ్యమైన హామీల తాజా పరిస్థితి ఏమిటి? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, కేజీ-టు-పీజీ ఉచిత విద్య, వివిధ ‘బంధు’లు.. వాటిపై తమదైన రాజకీయ వ్యాఖ్యానం కాకుండా లోతైన, వాస్తవిక పరిశీలన జరగాలి. అధ్యయనం, తగిన క్షేత్ర సమాచారం, కేస్‌-స్టడీలు, గణాంకాలతో సర్కారు వైఫల్యాలను ఎండగట్టకుండా ప్రజల్ని భిన్నంగా ఆలోచించేట్టు చేయలేమని వారు గ్రహించాలి.

అసలు సెంటిమెంట్‌ అడుగునే...

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ పేరు మార్చిన కేంద్ర పథాకాలేనని, వాటికి డబ్బు కేంద్రమే ఇస్తోందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని స్వీకరించడానికి ప్రజలు సిద్దంగా లేరు. ‘కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా... ఏ డబ్బూ వారి జేబుల్లోంచి ఇవ్వటం లేదు, మన డబ్బే మనకిస్తున్నారు’ అన్న అవగాహన ప్రజల్లో పెరిగిపోయింది. హైదరాబాద్‌ను ‘భాగ్యనగరం’గా మార్చినా, నిజామాబాద్‌ ను ‘ఇందూర్‌’ చేసినా, వికారాబాద్‌‌ను ‘అనంతగిరి’ అన్నా, భైంసాను ‘మైసా’ గా మార్చేసినా అదనంగా తమకేదో ఒరుగుతుందని ప్రజలు భావించే పరిస్థితి లేదు.ఈ పైపై సెంటిమెంట్లు కాకుండా, నిజమైన సెంటిమెంట్‌ ప్రచారం చేసుకోవడం బీజేపీ నాయకత్వానికి ఒంటబడుతున్నట్టు లేదు.

మొదట్నుంచీ, అంటే 1969 నుంచీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రవాదానికి కట్టుబడి ఉన్నది, అంతకు ముందరి వేర్వేరు రూపాల్లోని తామేనని బీజేపీ చెప్పుకోలేకపోతోంది. ‘ఒక ఓటు, రెండు రాష్ట్రాల’ని కాకినాడలో తీర్మానం చేసి, పార్టీ విధానంగా ముద్ర వేయించడం నుంచి కీలక నిర్ణాయక దశలో తాము సానుకూలంగా వ్యవహరించడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని చెప్పుకోవడంలో బీజేపీ విఫలమౌతోంది. సుష్మాస్వరాజ్‌ కి లభించిన ‘చిన్నమ్మ’ బిరుదం వెనుక మతలబ్‌నూ వారు సమర్థంగా వాడుకునే పరిస్థితిలో లేరు. టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు పనికివచ్చేది ఈ సెంటిమెంటే! పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ఐదో విడతకు చేరిన ‘పాదయాత్ర’, దాని ప్రభావాన్ని, జనాభిప్రాయాన్ని మరింత సానుకూలంగా మలచుకునే అవకాశాన్నీ పార్టీ నాయకత్వం లోతుగా సమీక్షించింది లేదు. తదుపరి కార్యాచరణకు పకడ్బందీ వ్యూహరచన సాగటం లేదు.

బెంగాల్‌ భంగపాటు మరిచారా?

తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థులు పోటీ పడేది వంద స్థానాలకే! స్థిరమైన ఓటుబ్యాంకులు ఉన్న మజ్లీస్‌, మరి కొందరు ముఖ్య నాయకుల స్థానాలు వదిలేస్తే టీఆర్‌ఓస్‌తో విపక్షమైన బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడేది నిజానికి ఈ వంద స్థానాల్లోనే! అందులో 60 శాతం ఫలితం సాధిస్తేనే ఎవరికైనా అధికారం దక్కేది. అగ్రస్థానం ఆశిస్తున్న బీజేపీ ఇందుకు తగిన భూమిక ఏర్పాటు చేసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ధీటైన అభ్యర్థులెవరు? ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సయోధ్య ఎలా? ఇలాంటి అంశాల్ని తగినంత ముందుగానే సరిచూసుకోవాలి. పాలకపక్షంలో పొసగకో, కాంగ్రెస్‌ రోజు రోజుకు బలహీనపడుతోందనో బీజేపీ వైపు వచ్చే ‘వలస నాయకులు’ ఉంటారు. వారి విషయంలో మరింత దృష్టి పెట్టాలి.

రఘునందన్‌రావు (దుబ్బాక), ఈటల రాజేందర్ (హుజూరాబాద్‌) లాగే కె.రాజగోపాలరెడ్డి (మునుగోడు) కూడా పార్టీని గెలిపిస్తారని అంతా భావించారు. నోటి మాటలను చేతలు అధిగమించక, తృటిలో గెలుపు జారిపోయింది. అయినా, విజేతకు అంత సమీపంగా రావటంలో పార్టీ బలమెంత? రాజగోపాలరెడ్డి వల్ల వచ్చిందెంత? అన్న బేరీజు నిజాయితీగా జరగాలి. అన్ని సందర్భాల్లో వలసవీరులు పార్టీకి అదనపు బలం, బలగం అవుతారని గ్యారెంటీ లేదు. పైగా వారు పార్టీలో నిలుస్తారనీ లేదు. ఎన్నికలు కాగానే, వలస నేతలు సొంతపార్టీలకు ‘తిరుగుటపా’ కట్టిన బెంగాల్‌ అనుభవం తాజా ఉదాహరణే! వారిని నమ్ముకొనే అక్కడ గెలుపు దక్కక భంగపోయింది. బీజేపీ ఎదుర్కొనే పరిస్థితుల్లో బెంగాల్‌కు తెలంగాణకు కొన్ని సామ్యాలున్నాయి. వామపక్ష పార్టీల ప్రభావం, ముస్లీం మైనారిటీలు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు, కాంగ్రెస్‌ చతికిలపడి దాన్నుంచే ఎదిగిన ప్రాంతీయ పార్టీ.... ఇలా చాలా పోలికలున్నాయి. అటువంటిదే మరో పోలిక, మతపరమైన సెంటిమెంటు! ఎంతో ఆశించినా... అక్కడ పనిచేయనట్టే, మతపరమైన సెంటిమెంటు ఇక్కడ కూడా పనిచేయకపోవచ్చు. తెలంగాణలో లౌకిక పునాదులు గట్టివి.

అనకపోయినా.... అన్నంత పని!

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ‘ఎందుకు మనం 175 గెలవొద్దు?’ అంటున్నట్టే, బయటకు ప్రకటించకపోయినా, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ధోరణీ కూడా అలాగే ఉందన్న భావన వ్యక్తమౌతోంది. ‘వందో, వందా పదో స్థానాలు మనమే ఎందుకు గెలవొద్దు?’ అని ప్రశ్నిస్తూ, ‘గెలిచే తీరతాం!’ అన్న ధీమాను పార్టీ వేదికల్లో ఆయన వెల్లడిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గ అంతర్గత కసరత్తు ఆయన ఈ పాటికే మొదలెట్టారు. ఎంత లేదన్నా కొంచెం హెచ్చుతగ్గులతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ తప్పదు. ఏ పార్టీ అయినా, గెలుపుకోసం కనీసం 40 శాతం ఓట్లపై గురి పెట్టాల్సిందే! మితి మీరిన మీడియా ప్రచారాల వల్ల కడదాకా ఇదొక ముక్కోణపు పోటీగానే కనిపించినా, తీరా పోలింగ్‌ సమయానికి ఎవరో ఒకరు ‘డమాల్‌’ మని అడుక్కు జారిపోవడం, మిగిలిన ఇద్దరి మధ్య పోటాపోటీనో, ఒకరికి స్పష్టమైన ఆధిక్యతో... కూడబలుక్కున్నట్టు ఓటు ద్వారా జనం నిర్ణయిస్తారు. కేసీఆర్‌‌కే కాకుండా ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ నాయకులకు సరితూగే వారు కూడా ప్రత్యర్థి పార్టీల్లో లేకపోవడం తెలంగాణలో జాతీయ పార్టీల డొల్లతనానికి నిదర్శనం. నిజమా? అబద్దమా? తెలిసి జరిగిందా? తెలియకా...! అన్నది పక్కన పెడితే, ఎంత కాదన్నా ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం ఫామ్‌ హౌజ్‌ వ్యవహారం బీజేపీకి మరకే!

పాదయాత్రలు సరే, ప్రజలకు ఏమిస్తారో బీజేపీ విస్పష్టంగా చెప్పాలి. అటు తమ్మినేని వీరభద్రం, ఇటు షర్మిల కూడా పాదయాత్రలు చేశారు. నడిపించే పరిస్థితులు, నడుస్తున్న కాలం, నడిచే వ్యక్తుల్ని బట్టి పాదయాత్రలు ఫలితాలిస్తాయి. అప్పటిలోపు సంస్థాగతంగా బలోపేతం కావడానికి పార్టీ అనుబంధ సంఘాలైన యువమోర్చా, మహిళామోర్చా, కిసాన్‌, ఎస్సీ, ఎస్టీ... వంటి మోర్చాలను చైతన్యపరచి జనంలోకి చొచ్చుకుపోతేనే పార్టీ బలోపేతం అవుతుందని గుర్తెరగాలి. ఐటీ, ఐబీ. ఈడీ. సిబిఐ వంటి కేంద్ర నిర్వహణ, నిఘా, దర్యాప్తు సంస్థల సేవలు దుర్వినియోగమౌతున్నాయనే ఆరోపణ ప్రత్యర్థుల నుంచి ఇప్పటికే ఉంది.వారంటున్నట్టు ఆయా సంస్థల్నే నమ్ముకుంటారా? పార్టీ అనుబంధ సంఘాల్ని క్రియాశీలం చేసి ప్రజాక్షేత్రంలో బలపడతారా? పార్టీ నాయకత్వం తేల్చుకోవాల్సిన తరుణమిది.

- దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ ఆనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802

ఆర్. దిలీప్ రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్
ఆర్. దిలీప్ రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్
IPL_Entry_Point