Rythu Bandhu 2022: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో ‘రైతుబంధు’ నిధులు జమ!-rythu bandhu amount disbursement from next month ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rythu Bandhu Amount Disbursement From Next Month

Rythu Bandhu 2022: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో ‘రైతుబంధు’ నిధులు జమ!

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 10:25 AM IST

Rythu Bandhu in Telangana: యాసంగి సీజన్‌ లో రైతుబంధు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో వీటిని జమ చేయనున్నారు.

త్వరలోనే రైతు బంధు నిధులు!
త్వరలోనే రైతు బంధు నిధులు!

Rythu Bandhu Scheme Funds: యాసంగి సీజన్ వచ్చేసింది. దీంతో రైతుబంధు నిధుల జమపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో జమ చేసేలా రాష్ట్ర వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది. అయినే నిధుల విడుదలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

వానాకాలం సీజన్‌ కిందట జూన్ నెలలో 64 లక్షలకుపైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. మొత్తం 1.47 కోట్ల ఎకరాలకు రూ. 7,372.56 కోట్లు చెల్లించారు. ఒక్కో ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు సొమ్ము అందించారు. మరోవైపు యాసంగి సీజన్‌ అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచే ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు పనులు మొదలుపెట్టారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నదాతలకు ఏటా రెండు సీజన్లకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తోంది. వానాకాలం సీజన్ కోసం రైతుబంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది. అయితే ఈసారి మరికొంత మంది కొత్త లబ్ధిదారులు కూడా చేరే అవకాశం ఉంది. ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా నమోదు చేసుకునే వారికి పలు ధపాలుగా అవకాశం కూడా కల్పించింది సర్కార్.

మరోవైపు రైతుబంధు పథకం కింద వ్యవసాయశాఖ జమ చేస్తున్న నిధులు కొందరు రైతులకు అందడం లేదు. ఖాతాల వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో పాటు.. కొందరు రైతుల బ్యాంకు అకౌంట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణం. ఆరు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోవటం, కేవైసీ అప్డేట్ చేసుకోపోవటం వంటి కారణాలతో నిధులు జమ కావటం లేదని తెలుస్తోంది. వానాకాలం నిధులు జమ సమయంలోనూ పలువురి ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఇలా ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది రైతులు ఇబ్బంది పడినట్లు అధికారుల గుర్తించారు.

ఈసారి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా... ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతుబంధు పథకానికి పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 10 ఎకరాల వరకు సీలింగ్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇలాగే గతంలో కూడా వార్తలు వచ్చినప్పటికీ... ఎన్ని ఎకరాలు ఉన్నా రైతుబంధు అందించింది.

IPL_Entry_Point