Rythu Bandhu Status : రైతుబంధు పడుతోంది చూసుకున్నారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు-rythu bandhu scheme funds released check your rythu bandhu money status here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu Status : రైతుబంధు పడుతోంది చూసుకున్నారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Rythu Bandhu Status : రైతుబంధు పడుతోంది చూసుకున్నారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 04:12 PM IST

పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లోకి జమ అవుతోంది. ఇవాళ్టి నుంచే మెుదలైంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రెండు పెట్టుబడి సాయం అందిస్తుంది.

రైతుబంధు నిధులు విడుదల
రైతుబంధు నిధులు విడుదల

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ అవుతోంది. వానాకాలం సీజన్‌కుగానూ రాష్ట్రంలో 68 లక్షల 94 వేల 486 మంది రైతులకు రైతు బంధు వర్తిస్తుంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా అన్నదాతలకు పంట సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఎకరాలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు నగదు జమ అవుతోంది. ఎకరాకు రూ.5 వేలు చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం అందించనుంది.

మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు ఈసారి రైతు బంధు వర్తిస్తుంది. కొత్తగా 1.50 లక్షల ఎకరాల భూమి రైతుబంధు లబ్ధి పొందే జాబితాలో చేర్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎకరంలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేడు రూ. 586 కోట్లు జమ అవుతాయి. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలి.

ఎంతమంది రైతులకు ఇచ్చారంటే

రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మొదటి రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో 586.66 కోట్ల జమ అయ్యాయని చెప్పారు. ఇవి అంకెలు కావు.. రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ గారి అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు అని వ్యాఖ్యానించారు. మొత్తం 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించనుందన్నారు.

'కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దనే సీఎం కేసీఆర్ గారి దృఢ సంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతున్నది. తొలకరి రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం. రైతుబంధు అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరం. ఇది రైతు ప్రభుత్వం..రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం.' అని హరీశ్ రావు అన్నారు.

అర్హుల జాబితా చూడండి

రైతుబంధు అర్హుల జాబితాలో ఉన్నారా లేదో తెలుసుకునేందుకు.. అధికారిక వెబ్ సైట్‌ కు వెళ్లాలి. హోం పేజీలో రైతు బంధు స్కీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే.. ఆ తరువాతి పేజీలో మీ జిల్లా, మండలం సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోవాలి.

స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

రైతు బంధు నగదు జమ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోవాలి. తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అనంతరం రైతుబంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేసి... స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో చూసుకోవచ్చు.

IPL_Entry_Point

టాపిక్