Vande Bharat Inauguration: తిరుపతికి వందేభారత్… టైమింగ్స్‌ ఇవే..-prime minister modi will inaugurate the vande bharat train from secunderabad to tirupati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Prime Minister Modi Will Inaugurate The Vande Bharat Train From Secunderabad To Tirupati

Vande Bharat Inauguration: తిరుపతికి వందేభారత్… టైమింగ్స్‌ ఇవే..

HT Telugu Desk HT Telugu
Apr 07, 2023 07:35 AM IST

Vande Bharat Inauguration: సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీయనుంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ లాంఛనంగా రైలును ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రెండో రైలును మూడు నెలల వ్యవధిలోనే ప్రారంభిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విశాఖ రైలును ప్రారంభించారు.

వేగంగా దూసుకెళుతున్న వందే భారత్ రైలు
వేగంగా దూసుకెళుతున్న వందే భారత్ రైలు

Vande Bharat Inauguration: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. గత జనవరిలో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి తొలి వందే భారత్‌ రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. జనవరి 19వ తేదీన సికింద్రాబాద్‌కు ప్రధాని రావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. దీంతో సంక్రాంతి కానుకగా 16వ తేదీన ఢిల్లీ నుంచి రైలును ప్రారంభించారు.

శనివారం తిరుపతికి రెండో వందేభారత్‌ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్‌ నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. రైలు ప్రారంభోత్సవానికి దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు మరో మూడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ స్టేషన్ల మధ్య రూ.1,410 కోట్లతో నిర్మించిన 85.24 కిలోమీటర్ల దూరం డబ్లింగ్‌ పనులు, విద్యుదీకరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రూ.720 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన వేయనున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్‌కు సంబంధించిన 13 నూతన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

వారంలో ఆరు రోజుల వందే భారత్ ప్రయాణం

తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్‌-తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య నూతనంగా ప్రారంభిస్తున్న 'వందే భారత్‌' రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు. తొలి రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించారు. 9వ తేదీ నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. తొలి రోజు సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి తిరుపతికి రాత్రి 9.00 గంటలకు చేరుకుంటుందన్నారు. తొలిరోజు మాత్రం చర్లపల్లి 11.45, నల్గొండ 13.05, మిర్యాలగూడ 13.40, పిడుగురాళ్ల 14.30, గుంటూరు 15.35, తెనాలి 16.15, బాపట్ల 16.50, చీరాల 17.10, ఒంగోలు 17.50, నెల్లూరు 19.10, గూడూరు 19.35, తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది.

వందేభారత్‌ 16 కోచ్‌ల రైలులో ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌, సాధారణ చైర్‌కార్‌ బోగీలు ఉంటాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం తగ్గనుంది. తొలిరోజు మార్గం మధ్యలోని అన్ని స్టేషన్లలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులను రైలులో ప్రయాణం చేయాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ నెల 9వ తేదీ నుంచి 'వందేభారత్‌' రైలు నంబరు 20702 తిరుపతిలో 15.15 గంటలకు బయలుదేరి నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45 గంటలకు చేరుకుంటుందన్నారు. 10వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లో 06.00 గంటలకు బయలుదేరే రైలు(20701) నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30 గంటలకు చేరుతుంది.

IPL_Entry_Point