Munugode Assembly: మునుగోడులో పాతకాపులెవరు?-munugode assembly previous election statistics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Munugode Assembly Previous Election Statistics

Munugode Assembly: మునుగోడులో పాతకాపులెవరు?

Praveen Kumar Lenkala HT Telugu
Sep 11, 2022 01:22 PM IST

Munugode Assembly: మునుగోడు అసెంబ్లీ 2014, 2018 ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు దక్కాయి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.. (PTI)

Munugode assembly: మునుగోడు కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉంటోంది. అయితే 2014లో మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

ఇక్కడ మొదటి నుంచీ కాంగ్రెస్, సీపీఐ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 1967, 1972, 1978, 1983లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి గోవర్దన్ రెడ్డి గెలుపొందారు.

తరువాత 1985, 1989, 1994లలో సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణ రావు గెలుపొందారు. తిరిగి 1999లో మళ్లీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.

2004లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డి గెలుపొందారు. 2009లో తిరిగి సీపీఐ నుంచి ఉజ్జిని యాదగిరి రావు గెలుపొందారు.

ఇక 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, 2018లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు.

2018లో ఇలా..

2018 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 96,961 ఓట్లు (48 శాతం) రాగా, సమీప ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 74,604 ఓట్లు (37.56 శాతం) లభించాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 22 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ దక్కింది.

ఇక మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి నిలిచారు. ఈయనకు 12,704 ఓట్లు (6.40 శాతం) లభించాయి.

మరో ముగ్గురు అభ్యర్థులకు 2 వేల నుంచి 3,500 మధ్య ఓట్లు లభించాయి.

ఇక మిగిలిన 9 మందికి వెయ్యి లోపు ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక్కడ మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయగా, 11 మందివి తిరస్కరణకు గురయ్యాయి. ఏడుగురు ఉపసంహరించుకున్నారు. 15 మంది బరిలో నిలవగా 13 మంది డిపాజిట్లు కోల్పోయారు.

2018 ఎన్నికల సమయానికి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,760. ఇందులో మహిళలు 1,07,212 మంది కాగా, పురుషులు 1,10,536. కాగా మొత్తం 1,98,452 ఓట్లు పోలయ్యాయి. అంటే 91.30 శాతం ఓట్లు పోలయ్యాయి.

2014లో ఇలా..

2014లో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,09,092 ఓట్లకు గాను 1,71,512 ఓట్లు పోలయ్యాయి. 82.15 శాతం ఓట్లు పోలయ్యాయి.

2014 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 38,055 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు 65,496 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థఇ ఇండిపెండెంట్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 27,441 ఓట్లు లభించాయి. మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి నిలిచారు. ఆయనకు 27,434 ఓట్లు లభించాయి. అంటే సుమారు 16 శాతం ఓట్లు దక్కాయి. సీపీఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డికి 20,952 ఓట్లు (12 శాతం) లభించాయి.

మొత్తం 34 నామినేషన్లు దాఖలవగా 3 తిరస్కరణకు గురయ్యాయి. 9 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 22 మంది బరిలో నిలవగా, 21 మంది డిపాజిట్లు కోల్పోయారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇంకా టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే సీపీఐ టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వనుంది. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ ధ్యేయమని సీపీఎం ప్రకటించింది.

IPL_Entry_Point