Telugu News  /  Telangana  /  Massive Cold Wave Intensified Across The Telangana Districts
తెలంగాణలో చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత (twitter)

Cold Wave in Telangana: చంపేస్తున్న చలి.. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

18 November 2022, 10:04 ISTHT Telugu Desk
18 November 2022, 10:04 IST

Telangana Weather Updates: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీపావళి ముందే వణికించిన చలి.. తర్వాత కాస్త తగ్గినట్లు అనిపించినప్పటికీ… మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Cold Wave Increased in Telangana: వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరగటం మొదలైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 5 దాటితే చాలు .. చలి వణికిస్తోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. తెల్ల‌వారుజామున మంచు కురియ‌డంతో.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లాలంటే జంకుతున్నారు. మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా చ‌లి తీవ్ర‌త మరితం పెరిగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

ట్రెండింగ్ వార్తలు

మొన్నటి వరకు 15 డిగ్రీలున్న కనిష్ఠ ఉష్ణోగ్రత ఇప్పుడు సింగిల్ డిజిట్ కు వచ్చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం 9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాళ్లపల్లిలో అత్యల్పంగా 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 9.2, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 9.7 డిగ్రీలుంది. ఇబ్రహీంపట్నంలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చాలాచోట్ల ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువే ఉంది. కాగా, మూడు రోజులుగా శీతల గాలులతో రాజధాని హైదరాబాద్‌ వణుకుతోంది. రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల మధ్య బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గురువారం రాజేంద్రనగర్‌లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రానున్న రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది తెలంగాణ వెథర్ మ్యాన్ ట్వీట్ చేసింది. వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మన్యంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కమ్మేస్తోంది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మంచు తెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు కూడా జరిగాయి. పొగ మంచుతో స్కూళ్లకు వెళ్లే పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు స్వెటర్లను ధరించాలని చెబుతున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఉదయపు నడక నడిచే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.