KTR Letter to Centre: వివక్షతోనే ఆ పార్క్ కేటాయించలేదు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్-ktr letter to union minister mansukh mandaviya over allotment of bulk drug park ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Letter To Centre: వివక్షతోనే ఆ పార్క్ కేటాయించలేదు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్

KTR Letter to Centre: వివక్షతోనే ఆ పార్క్ కేటాయించలేదు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్

Mahendra Maheshwaram HT Telugu
Sep 02, 2022 07:59 PM IST

minister ktr on bulk drug park: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోదీ సర్కార్ మొండి చేయి చూపిందంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు.

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

Minister KTR Letter to Union Minister Mansukh Mandaviya: తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందన్నారు మంత్రి కేటీఆర్. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యం అన్నారు. లైఫ్ సైన్సెస్- ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ నగరాన్ని కావాలనే విస్మరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోదీ సర్కార్ వివక్షాపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మసిటీ పేరును కనీసం పరిశీలించకుండా తెలంగాణ పట్ల తనకున్న వివక్షను కేంద్ర సర్కార్ బయటపెట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర మంత్రి మాండవీయాకు లేఖ రాశారు.

సమగ్ర నివేదిక ఇచ్చాం… కానీ

minister ktr on bulk drug park: 70 శాతం పైగా ముడిసరుకుల కోసం మన దేశ ఫార్మా రంగం చైనా పై ఆధారపడుతోంది. మారుతున్న ప్రపంచ రాజకీయాల దృష్ట్యా బల్క్ డ్రగ్ తయారీలో దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2015 లో 2000 ఏకరాల్లో వివిధ రాయితీలు, ప్రోత్సహకాలతో బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చింది. అయితే అపరిమిత అలస్యం తరువాత, కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పార్కు ఎర్పాటు అవసరం పట్ల కళ్లు తెరిచిన కేంద్రం 2020లో అధికారిక ప్రకటన చేసింది. ఆ తర్వాత సైతం ప్రతిపాదనలు స్వీకరించి వాటిపైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు సంవత్సరాలు అలస్యం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, నేటి వరకు ఎన్నో సార్లు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం. బల్క్ డ్రగ్ పార్క్ ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలను కూడా సమర్పించాం. హైదరాబాద్ ఫార్మసిటీ లోని 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టంగా తెలియచేశాం' అని లేఖలో ప్రస్తావించారు.

ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా కేంద్రానికి అందచేశామన్నారు కేటీఆర్. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ సమగ్ర నివేదిక ఇచ్చామని తెలిపారు. దీంతోపాటు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

షాక్ కు గురి చేసింది….

KTR Fires on PM Modi: బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని 2015లో నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ సర్కార్, ప్రతిపాదనల పరిశీలన, ఇతర అంశాల పేరుతో 2021 వరకు టైంపాస్ చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో అన్ని సిద్దంగా ఉన్న తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను షాక్ గురించేసిందని ప్రస్తావించారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలంటే భూసేకరణ, ప్లానింగ్, డిజైన్, పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసంగా మూడు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటులో అన్ని రకాల అనుకూలతలు, అనుమతులు ఉన్న ఫార్మాసిటీని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన నిబద్ధత లేమిని నరేంద్ర మోడీ సర్కార్ బయటపెట్టుకుందని దుయ్యబట్టారు.

ఈ ఎంపిక పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు కేటీఆర్. దేశీయ ఫార్మా రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్న తమ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నిజంగానే కట్టుబడి ఉంటే తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని విమర్శించారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసి తమ ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా నిలవాలని కేంద్రాన్ని కోరారు.

IPL_Entry_Point

టాపిక్