Kishan Reddy On ORR : 16 రోజుల్లో రూ.100 కోట్లు ఎందుకు పెంచారు, ఓఆర్ఆర్ లీజుపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా?-కిషన్ రెడ్డి
Kishan Reddy On ORR Lease : హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ లీజుపై సందేహం వ్యక్తం చేశారు.
Kishan Reddy On ORR Lease : హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లీజు విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బంగారుబాతులాంటి ఓఆర్ఆర్ ను తమ అనుకూలమైన వ్యక్తులకు లీజుకు ఇచ్చుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఓఆర్ఆర్ పై టోల్స్ వసూళ్లు రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు.
సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా?
"ఓఆర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బంగారు బాతులాంటిది. అటువంటి బంగారు బాతును కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం చంపేస్తున్నారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియను పూర్తిగా ఆడిట్ చేయిస్తారా? సీబీఐ దర్యాప్తునకు అంగీకరిస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టలేదని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తుంటే సీబీఐ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నారా?. హైదరాబాద్ నగరం చుట్టూ బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఓఆర్ఆర్ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. ఈ స్కామ్ లో ఉన్న అధికారులు, పాలకులు ఎవరినీ విడిచిపెట్టమని స్పష్టం చేస్తున్నాను. ఈ కుంభకోణంలో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉందో తేలాల్సిన అవసరం ఉంది. ఓఆర్ఆర్ టెండర్ కు ఏప్రిల్ 11 చివరి తేదీ. చివరి తేదీని ఏప్రిల్ 28 మార్చారు. ముందు టెండర్ ప్రక్రియలో పేపర్ పై రూ. 7272 కోట్లు ఉంది. ఆ తర్వాత టెండర్ ను రూ.7380 కోట్లకు పెంచారని, ఇందులో ఎవరి హస్తం ఉంది. 16 రోజుల్లో ఎందుకు 100 కోట్లు పెంచారు. ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదు." - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి?
ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెబుతున్న బీఆర్ఎస్... ఓఆర్ఆర్ ను లీజును ఎందుకు ప్రైవేట్ కంపెనీకి కట్టబెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏ కంపెనీకి టెండరు రావాలో సీఎం కేసీఆర్ ముందే నిర్ణయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్‌హెచ్ఏఐ నిబంధనల ప్రకారం లీజు ప్రక్రియ జరగడం లేదన్నారు. ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని కిషన్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ చెప్పే గుణాత్మకమైన మార్పు అంటూ ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.