ED On Casino Case: ఈడీ విచారణకు మంత్రి సోదరులు.. MLC కి నోటీసులు
chikoti praveen casino case: విదేశాల్లో కేసినో వ్యవహారంలో మళ్లీ ఈడీ దూకుడు పెంచింది. బుధవారం మంత్రి తలసాని సోదరులను ప్రశ్నించింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణకు నోటీసులు కూడా ఇచ్చింది.
ED On Chikoti Praveen Casino Case: క్యాసినో కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుల (తలసాని మహేష్ యాదవ్ , తలసాని ధర్మేంద్ర యాదవ్ )ను విచారించింది. చీకోటి నిర్వహించిన ఈ కేసీనోలకు వీరు కూడా హాజరయ్యారన్న సమాచారం మేరకు అధికారులు ప్రశ్నలవర్షం కురిపించినట్లు తెలుస్తోంది. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై వారిపై ప్రశ్నించినట్లు సమాచారం.
వీరిద్దర్నీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పిలిపించగా రాత్రి 9.30 వరకూ విచారణ కొనసాగింది. కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? నిబంధనల ప్రకారం మార్పిడి చేశారా? వంటి అంశాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. వీరిని ఇవాళ కూడా మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎమ్మెల్సీకి నోటీసులు…
కేసీనోలతో సంబంధమున్న మరికొందరికి నోటీసులు ఇచ్చింది ఈడీ. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికికూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే వీరు త్వరలోనే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచి క్యాసినోల కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఇప్పుడు మరోమారు తెరపైకి వచ్చింది. చీకోటి ప్రవీణ్ వ్యాపార లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఈడీ.. దాదాపు వంద మంది నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ విచారణ ప్రక్రియను షురూ చేసినట్లు సమాచారం.