Delhi Liquor Scam : ఈడీ అధికారులు బెదిరించడంతోనే కవిత పేరు, సొంత సొమ్ముతోనే పిళ్లై లిక్కర్ వ్యాపారం!
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అరుణ్ పిళ్లై ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి కాదని పిళ్లై తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ అధికారులు అరెస్టు చేస్తామని బెదిరించడంతోనే పిళ్లై కవిత పేరు చెప్పారని వాదించారు.
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. అరుణ్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీ అని ఈడీ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలను అరుణ్ పిళ్లై తరఫు న్యాయవాది తప్పుబట్టారు. పిళ్లైకు ఈ కేసుకు సంబంధంలేదని, ఆయన ఎవరికీ ప్రతినిధి కాదని తెలిపారు. లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై తన సొంత సొమ్మును పెట్టుబడిగా పెట్టారని కోర్టుకు తెలిపారు. ఎవరూ ఇండో స్పిరిట్స్‌లో పెట్టుబడిగా పెట్టలేదన్నారు. సొంత డబ్బుతోనే భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేశారని పిళ్లై న్యాయవాది వాదించారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అనంతరం ఘటనల్లో పిళ్లై పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
అరెస్టు భయంతోనే అలా వాంగ్మూలం
ఈ కేసులో అరుణ్ పిళ్లై తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... తన వాంగ్మూలం ఈడీ రికార్డు చేసిన మూడు రోజులకే పిళ్లై దానిని ఉపసంహరించుకున్నారన్నారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని సంతకం చేయాల్సి వచ్చిందని పిళ్లై తరఫు న్యాయవాది చెప్పారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారన్నారు. వాంగ్మూలం ఉపసంహరించుకున్నారంటూ పిళ్లై బెయిల్ ను వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈడీ ఆరోపిస్తున్నట్లు పిళ్లై 2021 మార్చి 17 వరకు దిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో లేరని, మార్చి 16నే ఖాళీ చేశారని కోర్టుకు తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి, బుచ్చిబాబులు మాత్రం మార్చి 17 వరకూ ఆ హోటల్‌లో ఉన్నారన్నారు. దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మార్చి 18, 2021న ఎక్సైజ్ శాఖ కార్యదర్శి డ్రాఫ్టు పాలసీ ఇచ్చారని గుర్తుచేశారు. మార్చి16న హోటల్ ఖాళీ చేసిన పిళ్లై పాలసీని ఎలా ప్రింట్ అవుట్ తీస్తారని ప్రశ్నించారు. పిళ్లై బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వు చేస్తున్నామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. జూన్ 8న బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ రూ.623 కోట్లు
దిల్లీ లిక్కర్ స్కామ్ లో రూ.623 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ అభియోగిస్తుంది. ఈ స్కామ్ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 4న దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాత్రపై ప్రధానంగా అభియోగాలను వివరించింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి తాను అప్రూవర్‌గా మారుతున్నట్లు అందుకు అనుమతి ఇవ్వాలంటూ దిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అనుమతులు మంజూరు చేసింది.