Kohli and Yashasvi: యశస్వికి కోహ్లి బ్యాటింగ్ పాఠాలు.. వీడియో
Kohli and Yashasvi: యశస్వికి కోహ్లి బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన ఇండియన్ టీమ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
Kohli and Yashasvi: యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కు కింగ్ కోహ్లి బ్యాటింగ్ పాఠాలు చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా రిజర్వ్ ప్లేయర్స్ లో ఒకడిగా ఇంగ్లండ్ వెళ్లాడు. జూన్ 7 నుంచి 11 వరకూ ఈ ఫైనల్ జరగనుంది.
దీంతో గత మూడు రోజులుగా టీమిండియా సాధన చేస్తోంది. మొదటి బ్యాచ్ తోనే విరాట్ కోహ్లి లండన్ వెళ్లాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ తో కలిసి వెళ్లిన యశస్వి మరుసటి రోజే నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి అతనికి బ్యాటింగ్ టిప్స్ ఇస్తూ కనిపించాడు. ఐపీఎల్లో యశస్వి రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ లలో 625 పరుగులు చేశాడు.
ఈ సీజన్ లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ను సెలక్టర్లు రిజర్వ్ ప్లేయర్ గా ఎంపిక చేయాలని భావించారు. అయితే జూన్ 3న అతడి పెళ్లి జరగనుండటంతో రుతురాజ్ స్థానంలో యశస్వి వచ్చాడు. బుధవారం (మే 31) యశస్వి తన తొలి ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్న వీడియోను ఐసీసీ షేర్ చేసింది.
అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్లను అతడు ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా అశ్విన్ తోపాటు కోహ్లి కూడా యశస్వికి బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. నిజానికి ప్రస్తుతం జట్టులో రోహిత్, శుభ్‌మన్ గిల్ లాంటి ప్లేయర్స్ ఉండటంతో జైస్వాల్ టెస్టు అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే రోహిత్, కోహ్లిలాంటి సీనియర్స్ తో కలిసి ఇంగ్లండ్ కండిషన్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం యశస్వికి కచ్చితంగా కలిసొచ్చేదే.
సంబంధిత కథనం