Rohit Sharma in London: ఇంగ్లండ్ చేరుకున్న రోహిత్.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్
Rohit Sharma in London: ఇంగ్లండ్ చేరుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం విడతల వారీగా టీమ్ సభ్యులు లండన్ చేరుకుంటున్నారు.
Rohit Sharma in London: ఐపీఎల్ ముగిసింది. ఇక అందరి కళ్లూ జూన్ 7 నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పైనే ఉన్నాయి. ఐపీఎల్ కారణంగా ఈ ఫైనల్ కోసం టీమిండియా విడతల వారీగా ఇంగ్లండ్ వెళ్తున్న విషయం తెలిసిందే. మొదట ఐపీఎల్ నుంచి లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన జట్లలోని సభ్యులు అక్కడికి వెళ్లారు.
తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మంగళవారం (మే 30) లండన్ చేరుకున్నాడు. అతడు కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ ముగిసిన మూడు రోజుల తర్వాత రోహిత్.. లండన్ వెళ్లాడు. ఇప్పటికే అక్కడ ఉన్న టీమ్ సభ్యులతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
2021-23 డబ్ల్యూటీసీ సైకిల్ లో ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ గ్రౌండ్ లో జరగనుంది. మంగళవారం రోహిత్ తోపాటు యశస్వి జైస్వాల్ కూడా ఇంగ్లండ్ వెళ్లాడు. యశస్వి రిజర్వ్ ప్లేయర్స్ లిస్టులో ఉన్నాడు. తాను ఇంగ్లండ్ లో దిగిన తర్వాత WTC o’clock అనే క్యాప్షన్ తో తన ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ముంబై ఇండియన్స్ కే చెందిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా రోహిత్ తో కలిసి వెళ్లారు. ఇప్పటికే ఇంగ్లండ్ లో ఉన్న విరాట్ కోహ్లి, చెతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనద్కట్, శార్దూల్ ఠాకూర్ లతో వీళ్లు కలిశారు. ఐపీఎల్ ఫైనల్లో ఆడిన శుభ్‌మన్ గిల్, షమి, భరత్, రవీంద్ర జడేజా, అజింక్య రహానేలాంటి వాళ్లు త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లనున్నారు.
ఈ ఐపీఎల్లో కోహ్లితోపాటు సూర్య, షమి, జడేజా, శుభ్‌మన్ గిల్ లాంటి వాళ్లు టాప్ ఫామ్ లో ఉండటం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాకు కలిసొచ్చేదే. రెండు నెలలుగా టీ20 క్రికెటే ఆడుతున్నా.. ఏదోరకంగా టీమిండియా ప్లేయర్స్ ఫీల్డ్ లో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం చాలా రోజులుగా క్రికెట్ ఫీల్డ్ కు దూరంగా ఉంది. ఫైనల్లోనూ ఎలాంటి వామప్ మ్యాచ్ లేకుండానే బరిలోకి దిగుతోంది.
సంబంధిత కథనం