షాంఘై లాక్‌డౌన్.. స్థానికుల నిరసన.. చైనాకు చుక్కలు చూపుతున్న కరోనా
పుట్టినిల్లు చైనాను కరోనా వణికిస్తోంది. తనను ప్రపంచానికి పరిచయం చేసిన దేశానికి ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. అనూహ్యంగా విజృంభిస్తున్న కరోనా ధాటికి చైనా చేష్టలుడిగిపోయింది. లాక్‌డౌన్ సహా తీవ్రమైన ఆంక్షలను ప్రారంభించింది.
దేశ ఆర్ధిక రాజధాని షాంఘైలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ తో పరిస్థితులు దిగజారి, షాంఘై ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. తమ నివాసాల నుంచి గట్టిగా అరస్తూ నిరసన తెలుపుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆహార అవసరాలకు కూడా బయటకు వెళ్లనివ్వడం లేదని తమ నివాసాల కిటికీల నుంచి గట్టిగా అరుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షాంఘై లో స్థానికుల నిరసనల వీడియోలు వైరల్
చైనా ఆర్థిక రాజధాని షాంఘై జనాభా దాదాపు రెండున్నర కోట్లు. దేశ ఆర్థిక రాజధానిగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నగరం. అడుగడుగునా ఆకాశ హార్మ్యాలే. విలాసవంతమైన జీవన శైలి ఈ నగర ప్రజలది. కానీ ఇప్పుడు ఈ నగరం కరోనా గుప్పిట చిక్కి విలవలలాడుతోంది. ఇక్కడ ఇప్పుడు రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు సరిపోకపోవడంతో.. నివాస సముదాయాలను కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నారు. పాఠశాలలను తాత్కాలిక ఆసుపత్రులుగా మారుస్తున్నారు. అయితే, సీరియస్ కేసుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. లాక్‌డౌన్ నేపథ్యంలో భారీ జనాభాకు అవసరమైన ఆహార వసతులు కల్పించడంలో అధికార వర్గాలు విఫలమవుతున్నాయి. ఆహారం, ఔషధాలు, నీరు, పాలు అందివ్వడం లేదని సోషల్ మీడియాలో స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 3 వారాలుగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో.. నిత్యావసరాలకు ఇబ్బంది పడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన ప్రాంతల్లో మాత్రమే లాక్‌డౌన్‌ను 3 నుంచి 4 గంటల పాటు సడలిస్తున్నారు.
రోజుకు 27 వేల కేసులు
షాంఘైలో గురువారం నమోదైన కేసుల సంఖ్య 27 వేలు. ఈ మధ్య కాలంలో ఇది రికార్డు. మరోవైపు, కోవిడ్ 19ను రూపుమాపే దిశగా కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తేల్చి చెబుతున్నారు. అంతర్జాతీయ విమానాలను ఇప్పట్లో అనుమతించబోమన్నారు. ఈ మార్చ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నాటి నుంచి.. సీరియస్ కేసులు ఎక్కువగా లేకపోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. గురువారం నాటికి సీరియస్ కేసుల సంఖ్య 9 కాగా, అందులో ఏడుగురు డెబ్బై ఏళ్ల వయస్సు దాటినవారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు. మరోవైపు, వారిలో ఎవరూ వాక్సిన్ తీసుకోలేదని అధికారులు వివరిస్తున్నారు. అయితే, లక్షణాలు లేనివారు కూడా క్వారంటైన్ కేంద్రాల్లో చేరాలని, వారివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల వైరస్ వ్యాప్తితో పాటు ఆ వ్యక్తి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని `చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్` చీఫ్ ఎపిడమాజిస్ట్ వు జున్యు తెలిపారు. మొత్తం కుటుంబం ఇన్‌ఫెక్షన్ బారిన పడడం వల్ల కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందన్నారు. ఈ పెరుగుదలకు ఒమిక్రాన్‌తో పాటు దాని సబ్ వేరియంట్లు కారణం కావచ్చన్నారు.
ఆర్థికంగానూ దెబ్బ..
కరోనా విజృంభణతో ఆర్థికంగానూ చైనా భారీగా నష్టపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అయిన చైనాకు ఇప్పడు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉంది. మార్చ్ రెండో వారం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతూనే ఉంది. కరోనా విజృంభణ మరి కొంత కాలం కొనసాగి, లాక్‌డౌన్‌ను మరి కొన్నాళ్లు పొడగించాల్సిన పరిస్థితి నెలకొంటే.. ఆర్థికంగా చైనాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మొత్తం చైనాలోనే జీడీపీ పరంగా షాంఘై అతిపెద్ద నగరం. ఈ నగరం జీడీపీ 679 బిలియన్ డాలర్లు(4.32 ట్రిలియన్ యువాన్లు). షాంఘై స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ మార్కెట్. ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లు ఉన్న ఐదో నగరం ఇది. ఇక్కడ ఆపిల్, క్వాల్‌కామ్, జనరల్ మోటార్స్, పెప్సీ కో తదితర 800కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలకు ప్రధాన లేదా ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. షాంఘైలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతే, దేశ మొత్తం జీడీపీలో 2 శాతానికి పైగా తగ్గుతుంది.