Ground Report: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్ల మనస్సులో ఏముంది?-madhya pradesh assembly elections ground report on voter pulse by peoples pulse research ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ground Report: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్ల మనస్సులో ఏముంది?

Ground Report: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్ల మనస్సులో ఏముంది?

HT Telugu Desk HT Telugu
Oct 27, 2023 03:34 PM IST

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? అక్కడి ఓటర్ల మనసులో ఏముంది? ఇలాంటి ప్రశ్నలకు పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ రీసెర్చర్‌ ఎన్‌.సాంబశివరావు తన రాజకీయ విశ్లేషణలో సమాధానం ఇచ్చారు.

మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్  పీపుల్స్ పల్స్ రీసెర్చ్
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ పీపుల్స్ పల్స్ రీసెర్చ్ (PTI/HT)

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు పెను సవాలుగా మారుతున్నాయి. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టి ఉత్తరాదిన తమకు తిరుగులేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంటే, మూడు సంవత్సరాల క్రితం తమ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీపై బదులు తీర్చుకోవాలనే గట్టి సంకల్పంతో కాంగ్రెస్‌ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాలు, ప్రధాన నరేంద్ర మోదీ చరిష్మాతో గట్టెకుతామని బీజేపీ ఆశలు పెట్టుకుంటే, ప్రభుత్వ వ్యతిరేకత తమను అందలమెక్కిస్తుందనే ధీమాతో కాంగ్రెస్‌ ఉంది.

ఆరు నెలల్లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు నవంబర్‌లో నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండగా, మధ్యప్రదేశ్‌లో అధికంగా 230 స్థానాలు ఉండడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. హిందీ రాష్ట్రాలకు గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌లో అధికార పగ్గాల కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అనేక ఉచిత హామీలతో హోరాహోరీగా తలపడుతుండగా పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు పీపుల్స్‌పల్స్‌ క్షేత్రస్థాయిలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

మధ్యప్రదేశ్‌లో 2003 నుండి ఇప్పటి వరకూ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. మధ్యలో 2018 డిసెంబర్‌ నుండి మార్చి 2020 వరకు పదిహేను నెలలు కమల్‌నాథ్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ సర్కారు పాలించింది. 2005లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో 2008, 2013లో వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ 2018లో 108 స్థానాలు సాధించి మెజార్టీకి ఎనిమిది సీట్ల దూరంలో ఆగిపోయింది. ఆ ఎన్నికల్లో 114 స్థానాలు సాధించి అధికారానికి రెండు సీట్లు తక్కువున్న కాంగ్రెస్‌ బీఎస్పీ సాయంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాదిత్య సింధియా 22 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేయడంతో 15 నెలల వ్యవధిలో 2020లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు.

ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఆందోళన పరుస్తున్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన 13 మంది మంత్రులతో సహా 58 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పరాజయం పొందారనేది ఇక్కడ గమనార్హం. 15 మంది సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా 2018లో ఓడిపోయారు. దీంతో 2023 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో రెండు పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ప్రస్తుత 29 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు 2018లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు నిరాకరించింది.

బీజేపీ వ్యూహాల్లో గందరగోళం

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు కొంత గందరగోళంగా ఉన్నాయి. గత మూడు పర్యాయాలు చౌహాన్‌ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ ఇప్పుడు ఆయనను పక్కకు పెట్టాలని చూస్తుందనే సంకేతాలున్నాయి. దీంతో ఆయన ఇంటా, బయటా పోరాడాల్సి వస్తోంది. దీర్ఘకాలికంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా పనిచేయడంతో ఆయనపై వ్యతిరేకత ఏర్పడిందని, ఆయనకు ప్రత్యామ్నాయ అభ్యర్థిని తీసుకొస్తే ఈ ఎన్నికల్లో గెలవచ్చని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది.

2018 ఎన్నికల సమయంలో చౌహాన్‌ ఒక్కరే ‘జన ఆశీర్వాద్‌’ యాత్ర నిర్వహించగా, ఈ సారి ఆయనతో సమాంతరంగా ఇతర నేతలు కూడా ఐదు యాత్రలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో ప్రమేయం లేకుండా పార్టీ అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కూడా పార్టీ కేంద్రమే భుజాన వేసుకొని రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చౌహాన్‌ పాత్రను నామమాత్రం చేయాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది.

సీఎం చౌహాన్‌పై నమ్మకం సన్నగిల్లిన పార్టీ నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, ప్రహ్లాద్‌ పాటిల్‌ మొదలగు కేంద్ర మంత్రులతో పాటు ఎనిమిది మంది జాతీయ నేతలను పార్టీ ఎన్నికల బరిలోకి దింపింది. దీంతో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ప్రభావం ఉంటుందని బీజేపీ అధిష్టానం విశ్వషిస్తోంది. అంతేకాక చౌహాన్‌ మాత్రమే కాకుండా పార్టీకి ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయనే సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనేది కాకుండా ప్రధాని మోదీని, కమలం పువ్వును చూసి ఓటు వేయమని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

మోదీ చరిష్మాపై పార్టీ ఎంత ఆధారపడిందంటే ఆయన గత ఆరు నెలల్లో ఏడు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. ‘మధ్యప్రదేశ్‌కే మన్‌ మే మోదీ’ నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు తీసుకెళ్తోంది. ఇలాంటి ప్రయోగాలే చేసి కర్ణాటక ఎన్నికల్లో విఫలమైన బీజేపీ మళ్లీ అవే ప్రయత్నాలు ఇక్కడ చేస్తోంది. పార్టీ అధిష్టానం తనపై వివక్ష చూపిస్తున్నా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

బీజేపీ అధిష్టానం తనకు వ్యతిరేకంగా పావులు నడుపుతోందని గుర్తించిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తనదైన శైలీలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం చౌహాన్‌ ఇమేజ్‌ను తగ్గించాలని చూస్తున్నా అవి విఫలయత్నాలవుతున్నాయి. ‘నేను లేకపోతే నాలాంటి వారు మీకు దొరకరు’ అంటూ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపాయి. ‘లాడ్లీ బెహన్‌ యోజన’ పథకం ద్వారా మహిళల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చౌహాన్‌ రాబోయే ఎన్నికల్లో తనును బీజేపీ అధిష్టానం విస్మరించే సాహసం చేయదనే విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కులగణన అంశాన్ని తెరపైకి తేవడంతో ఓబీసీలో కిరార్‌ సామాజికవర్గానికి చెందిన తనను పార్టీ విస్మరించదనే ధీమాతో చౌహాన్‌ ఉన్నారు.

మధ్య ప్రదేశ్ ఎన్నికలు: కాంగ్రెస్‌‌లో ఐకమత్యం

బీజేపీ తన ఓటమిని ముందే గుర్తించింది కాబట్టే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆ పార్టీ పునరాలోచనలో పడిందని, ఈ చర్య ఆ పార్టీ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్టేనని, ఇది తమకు నైతిక విజయమని కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘కాంగ్రెస్‌ వస్తుంది.. సంతోషం తెస్తుంది’ అనే నినాదంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌, మాజీ సీఎం కమల్‌నాథ్‌ కలిసికట్టుగా సాగుతుండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. జ్యోతిరాదిత్య ప్రమేయంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలలో కొందరు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఈ పరిణామాలు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పైచేయి సాధించే దిశగా ఉన్నాయి.

కాంగ్రెస్‌ గ్రామీణ ఓటర్లను, రైతులను మచ్చిక చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. చౌహాన్‌ ఓబీసీలపైనే ఆధారపడ్డారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో 27% ఓబీసీ రిజర్వేషన్లను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు పాత పింఛన్‌ పథకాన్ని వర్తింపచేస్తామని హామీ ఇచ్చింది. జర్నలిస్టులకు నెలకు రూ. 25 వేల గౌరవ వేతనంతో పాటు మెట్రో నగరాల్లో ఇల్లు కట్టిస్తామని ప్రకటించింది. దీర్ఘకాలిక బీజేపీ పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ రూ. 1500 నుండి రూ. 3000 వరకు నిరుద్యోగ భృతిని అందిస్తామని హామీతో యువతను ఆకట్టుకుంటోంది. 2020లో జ్యోతిరాధిత్య సింధియా పార్టీ ఫిరాయింపు వ్యవహారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగిపోయాక, ఆగిపోయిన ప్రభుత్వ పథకాలను తిరిగి అందజేస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ రుణాలను పూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. బీజేపీ పాలనలో అవినీతిని కాంగ్రెస్‌ ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్‌ ఆకర్షణీయమైన హామీలు ఆ పార్టీ విజయానికి తోడ్పడేలా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

‘ఉచిత’ హామీలపై పోటాపోటీ

రెండు పార్టీలు ఉచిత హామీలను కురిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ‘నారీ సమ్మాన్‌ నిధి’ పేరుతో నెలకు రూ. 1500 అందిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం ‘లాడ్లీ బహిన్‌ యోజన’ కింద 1.32 కోట్ల మహిళలకు అందుతున్న రూ. 1,250 నెలవారీ ఆర్థిక సాయాన్ని క్రమంగా రూ. 3,000కు పెంచుతామని సీఎం చౌహాన్‌ ప్రకటించారు. రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని కాంగ్రెస్‌ చెబితే రూ. 450కే ఇస్తామని బీజేపీ ప్రకటించింది. హిందూ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన బీజేపీ ఆలయాల పునర్నిర్మాణం, సుందరీకరణ కోసం రూ. 3000 కోట్లు వెచ్చిస్తున్నట్టు ప్రకటిస్తే, మైనార్టీలకు అనుకూలమనే ముద్ర పోగొట్టుకోవడానికి కాంగ్రెస్‌ ‘నర్మద పరిక్రమ పరిషత్‌’ ఏర్పాటు హామీతో మెజార్టీ ఓట్లను ఆకర్షించాలని చూస్తోంది. రాష్ట్రంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ జై నర్మద, జై బజరంగ్‌బలీ నినాదాలు చేశారు. కమల్‌నాథ్‌తో పాటు రాహుల్‌ గాంధీ కూడా దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రాంతాల వారీగా ఎవరి బలం ఎంత?

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏడు ప్రాంతాలలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. చంబాలిలో 34, బుందేల్‌ఖండ్‌లో 26, వింధ్యాలో 30, మహాకోషల్‌లో 38, మధ్యభారత్‌లో 36, ఉత్తర మాల్వాలో 38, ట్రైబల్‌ మాల్వా/నిమర్‌లో 28 అసెంబ్లీ స్థానాలున్నాయి. చంబాలి, బందేల్‌ఖండ్‌లో బీఎస్పీ ప్రభావం కొంత ఉంది. 2018 ఎన్నికల్లో చంబాలి, మహాకోషల్‌లో, మాల్వాలలో కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పుడు కూడా ఆ పార్టీకి అనుకూల పరిస్థితులే ఉన్నాయి.

బీజేపీ ప్రభుత్వంలో జరిగిన ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలపై కాంగ్రెస్‌ పెద్దఎత్తున నిరసనలు చేపట్టి ఆ వర్గానికి చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. పార్టీకి మొదటి నుండి బలమున్న రాష్ట్రంలోని రిజర్వుడ్‌ స్థానాలపై కాంగ్రెస్‌ పట్టు జారీపోకుండా ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షులు మలిఖార్జున్‌ ఖర్గే ప్రత్యేకంగా ఆ ప్రాంతాలలో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 2018 ఎన్నికల్లో మొత్తం 45 ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 30 స్థానాలను సాధించి తన పట్టును నిలుపుకుంది. ట్రైబల్‌ మాల్వా/నిమర్‌, మహాకోషల్‌, వింధ్యా ప్రాంతాల్లో ఉన్న ఈ ఎస్టీ సెగ్మంట్లలో కాంగ్రెస్‌ రాబోయే ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తిరుగుబాట్లు, చిన్న పార్టీలతో ఓట్ల చీలిక

బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలకు సంబంధించి మొత్తం మీద 35కు పైగా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. హోరాహోరీగా జరగనున్న రాబోయే ఎన్నికల్లో వీరు కచ్చితంగా నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఆ రెండు పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఉభయ పార్టీలలో టికెట్లు రాని అభ్యర్థులు బీఎస్పీ, ఎస్పీ, ఆప్‌ పార్టీల తరఫున లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పోటాపోటీగా జరగనున్న రాబోయే ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ ఫలితాలు వచ్చే స్థానాల్లో ఈ తిరుగుబాటు అభ్యర్థులు రెండు పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు ఆప్‌, బీఎస్పీ, ఎస్పీ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాయి. ఆప్‌ నుండి ఇప్పటికే కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ భారీగానే ప్రచారం చేశారు. ఉచిత విద్య, వైద్యం, విద్యుత్‌ అందిస్తామని ఆప్‌ ప్రకటించింది. 2018లో రెండు స్థానాలు గెలిచి కీలకపాత్ర పోషించిన బీఎస్పీ మరోమారు సత్తా చాటడానికి సిద్దమవుతోంది. సమాజ్‌వాద్‌ పార్టీ ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గొడుగు కింద బరిలోకి దిగాలని ఆశించినా, కాంగ్రెస్‌ సహకరించకపోవడంతో ఆ పార్టీ ఆగ్రహంగా ఉంది. 2018 ఎన్నికల్లో ఎస్పీ 52 స్థానాల్లో పోటీ చేసి 1.3 శాతం ఓట్లతో ఒక్క స్థానం సాధించింది. ఆ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ పరాజయానికి కారణమైంది. మధ్యప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో కొంత పట్టున్న ఎస్పీ విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు నష్టం చేకూరే అవకాశాలున్నాయి.

గెలుపు గాలి కాంగ్రెస్‌ వైపే

శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారని, ఇది తమకు సానుకూలమనే విశ్వాసం కాంగ్రెస్‌లో ఉంది. 2020లో దొడ్డిదారిన కాంగ్రెస్‌ను పడగొట్టి బీజేపీ అధికారం చేపట్టడంతో కాంగ్రెస్‌పై కొంత సానుభూతి కూడా ఉంది. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉన్న అనిశ్చితితో ఆ పార్టీలో విభేదాలు, గ్రూపులు పార్టీకి నష్టం కలగజేస్తోంది. దీన్ని కాంగ్రెస్‌ అనుకూలంగా మల్చుకుంటోంది. బీజేపీ దేశ వ్యాప్తంగా చేపడుతున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఇక్కడ ప్రభావం చూపడం లేదు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందిందని బీజేపీ ప్రచారం చేస్తుంటే, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ పట్టాలు తప్పిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో పలు సర్వే సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్‌ ఓటర్ల మనస్సులో ఏముందనేది తేలాలంటే డిసెంబర్‌ 3న వెలువడే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

పీపుల్స్ పల్స్ రీసెర్చర్ సాంబశివరావు
పీపుల్స్ పల్స్ రీసెర్చర్ సాంబశివరావు

- ఎన్‌.సాంబశివరావు,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు వ్యాసకర్త, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి. హెచ్‌టీ తెలుగువి కావు)

Whats_app_banner