Tuesday Motivation : ఎదుటివారినుంచి ఏమి ఆశించకపోవడమే నిజమైన ప్రేమ..-tuesday motivational quote on real love begins where nothing is expected in return ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : ఎదుటివారినుంచి ఏమి ఆశించకపోవడమే నిజమైన ప్రేమ..

Tuesday Motivation : ఎదుటివారినుంచి ఏమి ఆశించకపోవడమే నిజమైన ప్రేమ..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 19, 2022 09:31 AM IST

మీరు ప్రేమించిన వ్యక్తి.. మిమ్మల్ని ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే టక్కున ఇది అని ఆన్సర్​ చెప్పలేము. బహుశ అదేనేమో ప్రేమంటే. పైగా ఎప్పుడు, ఎవ్వరితో, ఎందుకు, ఎలా లవ్​లో పడతామో కూడా మనకే అర్థంకానీ పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ప్రేమలో ఎదుటివారినుంచి ఏమి ఆశించకపోవడమే నిజమైన ప్రేమ.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ఒక్కోసారి ప్రేమ చాలా గమ్మత్తు చేస్తుంది. ఎదుటివారికి కనీసం మన ప్రేమను తెలపకుండా ఉండిపోయేలా చేస్తుంది. దూరంగానే వారికి తెలియకుండా ప్రేమించేలా చేస్తుంది. ఇలాంటి ప్రేమలో ఎలాంటి ఆశ, కోరికలకు స్థానం ఉండదు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇలాంటివారు కొందరుంటారు. దూరంగా ఉంటూనే ప్రేమించిన వారిని ఆరాధిస్తూ ఉంటారు.

మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు.. వారిలోని కొన్ని లక్షణాలు మీకు వారిపై ఇంట్రెస్ట్​ని కలిగిస్తాయి. ఆ ఇంట్రెస్ట్​తో మీరు వారి దగ్గరకు వెళ్లినప్పుడు.. మీకు తెలియకుండానే ప్రేమలో పడిపోతారు. అప్పుడు వారిని ప్రేమించడానికి ఇది కారణం అని మీరు ఏ కారణాన్ని చూపించలేరు. పైగా మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే.. వారిని మీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఖాళీగా ఉన్నామనో.. లేదా లవర్​ కావాలనో.. నలుగురికి బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్​ ఫ్రెండ్ ఉందని చూపించుకోవాలనో ప్రేమించకూడదు. అది ప్రేమ అనిపించుకోదు.

ఒకరిని నిజంగా ప్రేమించాలంటే ముందు చాలా ధైర్యం కావాలి. దృఢసంకల్పం అవసరం. మీరు ప్రేమలో పడ్డారని మీరు భావించిన క్షణం.. అతను లేదా ఆమె మీద మీకున్నది ప్రేమేనా? మీరు వారిపట్ల నిజమైన ఫీలింగ్స్​తో ఉన్నారా? లేదా టెంపరరీ ఫీలింగ్స్​తో ఉన్నారా అని ప్రశ్నించుకోండి. ఆ వ్యక్తిని ప్రేమించడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదా జన్యూన్​గా ఆ ఫీల్ వచ్చిందా అని తెలుసుకోండి. మీ ప్రశ్నలన్నింటికీ ప్రేమే అని జవాబు వస్తే.. మీరు నిజంగా ప్రేమలో ఉన్నారనే అర్థం.

ప్రేమలో ఉన్నామని తెలిశాక.. పరిస్థితులు ఎలా మారినప్పటికీ మీరు ధైర్యంగా ఉండాలి. ఈ ప్రేమలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయో తెలుసా? అవతలి వ్యక్తినుంచి ఏదైనా ఆశించడం ప్రారంభించినప్పుడు. అలా మీరు ఆశిస్తున్నారంటే.. మీ సొంత కారణాలతో ఆ వ్యక్తికి దగ్గరవుతున్నారని అర్థం. మీ స్వార్థం కోసం ఒకరిని ప్రేమిస్తున్నారంటే.. అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది. వారి నుంచి ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా.. కేవలం వారు ఉన్న విధంగానే ప్రేమిస్తున్నారని నిర్ధారించుకోండి. నిస్వార్థంగా వారిని ప్రేమించండి. అప్పుడు మీ ప్రేమే వారిని మారేలా చేస్తుంది. మీరు ఎదుటి వ్యక్తి నుంచి ప్రతిఫలంగా ఏమీ ఆశించనప్పుడు.. మీరు నిజమైన 'ప్రేమ'లో ఉన్నారని అర్థం. వ్యక్తులను నిస్వార్థంగా ప్రేమించండి. వారి నుంచి ఏదైనా కోరుకుని మాత్రం ప్రేమించకండి.

WhatsApp channel

సంబంధిత కథనం