Thursday Thoughts | ఇదీ ఒక బ్రతుకేనా.. ఎంత చేసినా ఆనందం లేకపోతే ఎలా?!-thursday thoughts how to be happier in life find out the answer for what is true happiness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Thoughts | ఇదీ ఒక బ్రతుకేనా.. ఎంత చేసినా ఆనందం లేకపోతే ఎలా?!

Thursday Thoughts | ఇదీ ఒక బ్రతుకేనా.. ఎంత చేసినా ఆనందం లేకపోతే ఎలా?!

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 04:30 AM IST

Thursday Thoughts: డబ్బుంటే ఆనందం ఉంటుందా? ఏదైనా విజయంలో ఆనందం ఉంటుందా? ప్రేమలో ఆనందం ఉంటుందా? ఆనందం ఎక్కడ ఉంటుంది? కచ్చితమైన జవాబు ఇక్కడ తెలుసుకోండి.

Thursday Thoughts:
Thursday Thoughts: (unsplash)

Thursday Thoughts: జీవితం ఎలాంటిది అంటే తెలిసీతెలియని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ తెలిసిననాడు బాధను ఇస్తుంది. కొంతమంది జీవితంలో అసలు ఆనందం అనేది ఉండదు. ఎంత కష్టపడినా అనుకున్న ఫలితం రాదు, ఎంత సంపాదించినా డబ్బు చాలదు. నా జీవితంలో ఆనందం అనేది ఒకటి ఉందా? అంటూ చాలా మంది తమలో తామే కుమిలిపోతుంటారు. భగవంతుడు అనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు పెట్టడు అంటూ ఆక్రోదన చెందుతారు. ఆనందం ఎక్కడ దొరుకుతుందా అనుకుంటూ దాని కోసం వెంపర్లాడుతుంటారు. కానీ, నిజమైన ఆనందం డబ్బు సంపాదించడంలోనో, ఏదైనా సాధించడంలోనో ఉండదు. మరి ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మీకొక చిన్న కథ చెబుతాను, ఆ కథ చదివితే మీకే అర్థం అవుతుంది.

ఒకప్పుడు ఒక నగరంలో ఒక గొప్ప సంపన్నుడు నివసించేవాడు. అతడు తన సంపదను అంతకంతకూ వృద్ది చేసుకుంటూపోయాడు. కాలం కలిసి వచ్చి అనతి కాలంలోనే అతడో విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాధినేతగా ఎదిగాడు, రాజులకు మించిన ధనరాశి అతడి వద్ద పోగయ్యింది, కొన్ని తరాలు తిన్నాకూడా తరగని నిధి అతడి వద్ద ఉంది. ఏది కోరుకున్నా క్షణాల్లో అతడి ముందు ఉండేది. అయినా సరే ఇంకా ఏదో లోటు అతణ్ని వెంటాడుతూ ఉండేది, అదే ఆనందం. అతడికీ అన్నీ ఉన్నాయి, కానీ మనసులో ఎప్పుడూ ఏదో తక్కువయిందనే ఆందోళన, ఏరోజూ అతడు ఆనందంగా ఉండేవాడే కాదు. దీంతో ఒకరోజు అతడు ఒక గురువు వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు.

నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆనందం లేదు? అది ఎక్కడ దొరుకుతుంది అంటూ ఆ సంపన్నుడు గురువుని అడుగుతాడు. అందుకు గురువు అతడి సమస్య విని, రేపు రండి దీనికి పరిష్కారం రేపు చెబుతాను అంటాడు. అందుకు సరే అని సంపన్నుడు అక్కడ్నించి వెళ్లిపోతాడు.

గురువు చెప్పినట్లుగా మళ్లీ ఆ తరువాత రోజు ఆ సంపన్నుడు గురువు వద్దకు వెళ్తాడు. అప్పటికి ఆ గురువు ఏదో వెతుక్కుంటూ ఉంటాడు.

అప్పుడు ఆ వ్యక్తి 'దేనికోసమో వెతుకుతున్నట్లు ఉన్నారు, నేను సహాయం చేయాలా అని అడుగుతాడు', అందుకు గురువు 'అవును నా వద్ద ఒక విలువైన మణి ఉండేది, ఇది ఇక్కడే ఎక్కడో పడింది అని చెబుతాడు' . దీంతో ఇద్దరూ కలిసి చాలా సేపు ఆ మణి గురించి వెతుకుతారు, అయినా కూడా అది దొరకదు.

విసిగిపోయిన ఆ సంపన్నుడు 'మీరు సరిగ్గా ఎక్కడ పోగుట్టుకున్నారు, గుర్తు తెచ్చుకోండి' అని అడుగుతాడు. అందుకు గురువు, అది నా ఆశ్రమంలోపల పోగొట్టుకున్నాను, వెలుపల ఉందేమో చూస్తున్నా అంటాడు.

గురువు సమాధానానికి ఆశ్చర్యపోయిన సంపన్నుడు.. 'మీకు నిజంగా మతి ఉందా? లోపల పోగొట్టుకుంటే బయట ఎందుకు వెతుకుతున్నారు' అంటాడు. అందుగు గురువు బదులిస్తూ 'నువ్వు కూడా చేసేది అదే కదా, లోపల ఉన్న ఆనందాన్ని ఎక్కడో ఎందుకు వెతుకుతున్నావు అంటాడు'. అప్పుడు గురువు ఆంతర్యం ఆ సంపన్నుడికి అర్థం అవుతుంది.

గురువు ఇలా అంటాడు.. నీకు అన్నీ ఉన్నాయి, ఏ లోటూ లేదు. అయినా కూడా ఆనందం లేదని వచ్చావు. ఆనందం అనేది కళ్లతో చూస్తే వచ్చేది కాదు, మంచి మనసుతో చూస్తే కలిగే భావన.. భౌతిక ప్రపంచంలో డబ్బు, విదేశీ వస్తువులు ఏవీ ఆనందాన్ని కలిగించవు. ఆశను వదిలేసి బ్రతికి చూడు హాయిగా, ఆనందంగా బ్రతుకుతావు' అంటూ పరిష్కారం చెబుతారు.

ఈ కథతో ఒరిగే నీతి ఏమిటంటే.. ఆనందం, కోపం, బాధ, సంతోషం అన్నీ మనలోనే ఉన్నాయి. మీ మనసును నియంత్రణలో ఉంచుకుంటే మీ జీవితం ఎలా కావాలంటే అలా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం