Alzheimer's Disease : అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం వారికే ఎక్కువట.. లక్షణాలు ఇవే..-research says alzheimers is more likely to affect every covid victim over 65 years of age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Research Says Alzheimers Is More Likely To Affect Every Covid Victim Over 65 Years Of Age

Alzheimer's Disease : అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం వారికే ఎక్కువట.. లక్షణాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 21, 2022 01:40 PM IST

Alzheimer's Disease : నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక కూడా ఎవరికీ లేదు. కొన్ని వ్యాధులు పైకి కనిపిస్తే మరికొన్ని వ్యాధులు కంటికి కనిపించకుండా ముదిరే వరకు తెలియదు. ఎలా అంటే వాటి గురించి డాక్టర్ దగ్గరకు వెళ్లేవరకు రోగికి కూడా ఏమాత్రం తెలియదు. అటువంటిదే అల్జీమర్స్‌. మరి దీనిని ఎలా గుర్తించాలి. ఏ వయసు వారికి ఎక్కువ వస్తుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అల్జీమర్స్‌
అల్జీమర్స్‌

Alzheimer's Disease : 65 ఏళ్లు పైబడిన ప్రతి కొవిడ్ బాధితులపై అల్జీమర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటున్నారు వైద్యులు. చాపకింద నీరులా విస్తరించే ఈ అల్జీమర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం 65 ఏళ్లు పైబడిన ప్రతి కొవిడ్ బాధితులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించాయి. ఇది సోకినట్లు అంత తొందరగా బాధితుడికి అర్థం కాదు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి? ఏ వయస్సు వారికి ఎక్కువగా వస్తుంది? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు కామినేని హాస్పిటల్స్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ కుమార్.

అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనివడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారికి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామార్థ్యం దెబ్బదింటాయి. వ్యాధి ప్రారంభ సంకేతాలు ఇటీవలి జరిగిన సంఘటనలు లేదా సంభాషణలను మరచిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాధి ముదిరే కొద్ది.. వ్యక్తి తీవ్రమైన జ్ఞాపకశక్తి బలహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా రోజువారీ పనులను నిర్వహించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు.

తగిన చికిత్స ద్వారా మందులు వాడినట్లయితే తాత్కాలికంగా లక్షణాలను తగ్గుతాయి. ఈ చికిత్సలు కొన్నిసార్లు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల పనితీరును పెంచడానికి, కొంత సమయం వరకు స్వతంత్రంగా ఉంచడాని సహాయపడతాయి. కానీ జ్ఞాపకశక్తి క్షీణించటం వ్యక్తి రోజువారీ వ్యక్తిగత పనులను అస్థవ్యస్థం చేస్తుంది. ఆలోచనా శక్తిని కోల్పోతారు కాబట్టి.. దానిని తీవ్రమైన సమస్యగా పరిగణించి.. వెంటనే డాక్టరును సంప్రదించి అల్జీమర్స్ ఉన్నదో, లేదో నిర్ధారణ చేసుకోవాలి.

అల్జీమర్స్ వ్యాధి ఏ వయస్సు వారికి వస్తుంది?

అల్జీమర్స్ వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. 65 సంల వయస్సు పైబడిన ప్రతీ 9 మందిలో ఒకరు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం కలిగి ఉంటారు. అయితే పలు సందర్భాలలో 40-50 సం. వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ కనిపిస్తున్నది. ఇటువంటి మధ్యవయస్కుల్లో కనిపించే అల్జీమర్స్ లక్షణాలను మధ్యవయస్సు తాలూకు మతిమరుపుగానో లేక ఒత్తిడి, మానసిక కృంగుబాటు, మహిళల్లో అయితే మోనోపాజ్ వంటి లక్షణాలుగా భావించి తేలికగా తీసుకుంటుంటారు. దాంతో ఈ వ్యాధి ముదిరి పరిస్థితి దిగజారుతుంది.

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితం గడపవచ్చా?

అల్జీమర్స్ సోకినప్పటికీ ఆ వ్యక్తి చాలా సంవత్సరాల పాటు సాధారణ జీవితం గడపవచ్చు. గుండెను ఆరోగ్యకరంగా ఉంచే సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ మెదడుకు తగిన పనిపెట్టే అలవాట్లను కొనసాగించటం ద్వారా అల్జీమర్స్ వ్యాధి తీవ్రమయ్యే వేగాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు. అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే.. ఈ వ్యాధి లక్షణాలను అదుపు చేసే చికిత్సకు మంచి ఫలితాలను ఇచ్చే మందులూ అందుబాటులోకి ఉన్నాయి. కాబట్టి అల్జీమర్స్ ను ప్రారంభదశలోనే గుర్తించటం ఎంతో ముఖ్యం.

అల్జీమర్స్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?

ఈ వ్యాధిని ప్రారంభంలో గుర్తించినపుడు మందులు, కుటుంబసభ్యుల సేవలు్, సహకారం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు పెరగకుండా, జీవననాణ్యత దిగజారిపోకుండా అదుపుచేయవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం కోలినెట్రేస్ ఇనిహిబిటర్స్, మెమంటైన్ అనే రెండు రకాల జనరిక్ మందులు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం, సరైన రీతిలో ఆలోచించలేకపోవటం వంటివి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలలో కొన్నింటిని అదుపుచేసేందుకు ఈ మందులను సూచిస్తున్నారు. ఇంతకు మించి ఈ వ్యాధిని తగ్గించే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. బి12 లోపం, అనియంత్రిత థైరాయిడ్ డిజార్డర్ వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇవి చిత్తవైకల్యం రివర్సిబుల్ కారణాలుగా పరిగణిస్తాము కాబట్టి. ఎందుకంటే అవి చికిత్స చేయదగినవి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా అల్జీమర్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. అల్జీమర్స్‌ను నివారించడంలో సహాయపడటానికి వ్యాయామం చాల ముఖ్యమైనది. అత్యంత నమ్మదగిన సాక్ష్యం ఏమిటంటే శారీరక వ్యాయామం అల్జీమర్స్ అభివృద్ధిని నిరోధించడంలో లేదా లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులలో వ్యాధి పురోగతిని నెమ్మదిస్తుంది. వారానికి మూడు నుంచి నాలుగు రోజులు 30 నిమిషాల మధ్యస్థంగా శక్తివంతమైన ఏరోబిక్ వ్యాయామం చేయడం మంచిది. సమతుల్య ఆహారం తీసుకోవడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండడం వంటి ఆరోగ్యకమైన జీవనవిధానం మెదడును ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతాయి. ఇవి అల్జీమర్స్ వ్యాధితో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి రాకుండా సహాయపడతాయి. చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించటంవల్ల మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలను బలపడి మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇది వ్యక్తి ఆలోచనా శక్తి దెబ్బదినకుండా ఉండటానికి కూడా తోడ్పడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్