Good Morning । శుభోదయం చెప్పుకోవటం ఒక మంచి అలవాటు.. కారణాలు ఇవిగో!
Good Morning :మనం ప్రతిరోజూ ఉదయం గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం, శుభోదయం అంటూ ఒకరినొకరం పలకరించుకుంటాం, మెసేజులు పంపుకుంటాం. మరి ఇలా ఎందుకు చేస్తాం? ఈ అలవాటును ఎందుకు అలవరుచుకోవాలో తెలుసుకోండి.
మనం ప్రతిరోజు ఉదయం 'గుడ్ మార్నింగ్' అని చెప్పుకుంటాం. దాదాపు ప్రతీ ఒక్కరికి స్కూల్ లైఫ్ నుంచే ఇలా చెప్పుకోవటం ఒక అలవాటు. నేరుగా వ్యక్తి ఎదురుపడినపుడు లేదా వాట్సాప్ ద్వారానో.. మరేదో రకంగా శుభోదయం అని పలకరించుకోవడం మన సంస్కృతిలో ఎప్పట్నుంచో భాగం అయింది. మరి ఇలా ఎందుకు చెప్పుకుంటారు.. అంటే? మనిషి ఒక సంఘజీవి. కానీ ప్రతిరోజూ ఏదో రకమైన ఒత్తిడి, ఆందోళనలతో తన లోకంలో తాను ఉంటాడు. అయితే ఇలా గుడ్ మార్నింగ్ చెప్పుకునే ఆచారం అలవాటు చేసుకుంటే ఏ వ్యక్తి ఈ ప్రపంచంలో ఏకాకి కాదు, తాను ఈ సమాజంలో భాగం అని అవతలి వ్యక్తికి గుర్తు చేసినట్లు అవుతుంది. వారికి ఒక భరోసా కల్పించినట్లు ఉంటుంది. అలాగే వేరొకరితో మాటలు కలపటానికి ఈ గుడ్ మార్నింగ్ లాంటి గ్రీటింగ్స్ ఒక వారధిలా పనిచేస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
సమాజంలో అందరితో పాటు కలిసి జీవిస్తున్నప్పుడు, ఒకరినొకరు పలకరించుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవటం ద్వారా అందరితో బంధుత్వం ఏర్పడుతుంది. నిజానికి వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడినపుడు ఇలా గ్రీట్ చేసుకోవాలనే కచ్చితమైన నియమం అంటూ ఏమి లేదు, కారణం ఇది అని చెప్పటానికి కూడా ఏమి లేదు. అయితే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు మనం సానుకూలంగా మార్చుకోవటానికి ఇలాంటి చిన్నచిన్న అభినందనలు ఉపయోగపడతాయి. దాదాపు సగానికి పైగా సమస్యలు మన చుట్టూ ఉండే వారి వల్లే తలెత్తుతాయి. అందరితో బాగుంటే వారు బాగుంటారు, మనం బాగుంటాం. కాబట్టి మన సంతోషానికి కూడా ఇలాంటి అభినందనలు పరోక్షంగా తోడ్పడతాయి.
ఎవరైతే అయితే తన చుట్టూ ఉండే వారితో కలిసిపోతూ బాగుంటారో, వారు తమ జీవితంలో ఏమీ లేకపోయినా, ఏం సాధించకపోయినా చాలా సుఖంగా, సౌకర్యంగా జీవిస్తారు. వారు ఎలాంటి వారైనా వారి కోసం పది మంది సహాయం చేయటానికి ముందుకొస్తారు.
Say Good Morning
ఒకరిని పలకరించటం ద్వారా ఎదుటి వారికి మీపై సదాభిప్రాయం కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. కాబట్టి ఇగోలను పక్కనపెట్టి ఎదుటి వారిని పలకరించటం మీకు ప్రయోజనమే తప్ప ఎలాంటి నష్టం ఉండదు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వంటివి ఎందుకు చెప్పుకోవాలో ఇక్కడ కొన్ని అంశాలు పరిశీలిద్దాం.
మర్యాదపూర్వకమైనది
ప్రజలకు 'గుడ్ మార్నింగ్' లేదా నమస్కారం చెప్పడం మర్యాదపూర్వకమైనది. అది మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. మన దైనందిన జీవితంలో ఏదైనా అడిగేటపుడు 'దయచేసి' అని అడగటం, తర్వాత 'ధన్యవాదాలు' తెలియజేయటం ద్వారా మీ వినమ్రతను తెలియజేస్తాయి. మీ గౌరవాన్ని పెంచుతాయి. స్నేహం చిగురించేలా చేస్తాయి.
స్వాగతించదగినది
మనకు అవతలి వ్యక్తితో ఏం మాట్లాడాలో తెలియనపుడు సులభంగా వారిని గ్రీట్ చేస్తే సరిపోతుంది. మీరు చెప్పే గ్రీటింగ్స్ స్వాగతించనివారు ఎవరైనా ఉంటారా? మీ ఆఫీసులో లేదా అపరిచయస్తులతో ఇంటరాక్ట్ అయ్యేటపుడు వారికి శుభోదయం అని పలకరిస్తే చాలు.. ఇలా మాటలు కలుస్తాయి.
ఇబ్బందిని తగ్గిస్తుంది
వ్యక్తులందరూ ఒకేలా ఉండరు. కొందరు ఎవరితోనూ అంత సులభంగా కలిసిపోరు. అలా అని వారు దురుసువారు కాకపోయినా, బిడియం, భయం వారికి అడ్డుకావచ్చు. అలాంటి సందర్భంలో మీరే గుడ్ మార్నింగ్ అంటూ వారిని పలకరిస్తే అది వారికి, మీకు మధ్య ఇబ్బందిని తగ్గిస్తుంది. సంతోషకరమైన పని సంబంధాలకు దారితీస్తాయి.
సంస్కారవంతమైన అలవాటు
గుడ్ మార్నింగ్ వంటివి చెప్పటం ద్వారా మీ విలువ పెరుగుతుందే తప్ప తగ్గదు. మీకన్నా చిన్న స్థాయి వ్యక్తికి చెబితే అది మీ ఔన్నత్యాన్ని పెంచుతుంది. మీ పైస్థాయి వారికి చెప్పినా మీపై మంచి ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి స్థాయితో సంబంధం లేకుండా సాగిపోవచ్చు.
ఇది పూర్తిగా ఉచితం
గుడ్ మార్నింగ్ చెప్పినంత మాత్రాన మీ నోటి నుండి ముత్యాలు రాలవు, మీ ఆస్తులేమి తరిగిపోవు. ఇది పూర్తిగా ఉచితం. మీ చుట్టూ సానుకూల వాతావరణానికి సృష్టించటానికి చెప్పేయండి.. గుడ్ మార్నింగ్.
సంబంధిత కథనం