Lord Siva | శివుడికి పూజ ఎలా చేయాలి? ఈ పొరపాట్లు మాత్రం చేయకండి-mistakes that should not be committed while offering prayers to lord shiva ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lord Siva | శివుడికి పూజ ఎలా చేయాలి? ఈ పొరపాట్లు మాత్రం చేయకండి

Lord Siva | శివుడికి పూజ ఎలా చేయాలి? ఈ పొరపాట్లు మాత్రం చేయకండి

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 02:06 PM IST

శివుడు... భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివుడికి పూజ చేసే సమయంలో ఏవైనా పొరపాట్లు చేస్తే మాత్రం ఆ స్వామి ఆగ్రహానికి గురవుతాం.

శివుడ్ని ఎలా పూజించాలి?
శివుడ్ని ఎలా పూజించాలి? (pexels)

హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో ‘శి’ అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, ‘వ’ అంటే మహిళల శక్తి అని అర్థం. పరమేశ్వరుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. శివుడిని లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

 శివపూజ జాగ్రత్తలు..

 - స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. పూజ చేసే సమయంలో ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది.

- శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే.. పై నుంచి జలధార కచ్ఛితంగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే.. ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.

- శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే  ఆ బోలాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి.

- శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో కోయరాదు. వీచిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి.

- సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదు. శివుడు.. సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది. ఓ సారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను , సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడట.

- శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి, గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి.

- కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్షాయుష్షుని సూచిస్తుంది.

- శంకు పుష్పాలు, తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది.

- కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడ్ని గుండ్రటి మల్లె పూలతో పూజించాలి. శమీ పత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్