Secrets of Happiness | ఆనందంగా ఉండాలనుకుంటున్నారా..? ఈ రహస్యాలను తెలుసుకోండి!-know the secrets of happiness and live happily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know The Secrets Of Happiness And Live Happily

Secrets of Happiness | ఆనందంగా ఉండాలనుకుంటున్నారా..? ఈ రహస్యాలను తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
Jun 26, 2022 01:04 PM IST

ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ అది వేరొకరు ఇచ్చేది కాదు. మీకు మీరుగా సొంతం చేసుకునేది. ఆనందంగా ఉండటానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరించండి.

Happiness
Happiness (Pixabay)

ఆనందం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, వేరొకరి సాంగత్యంతో లభించేది అంతకంటే కాదు. అది మీలోపల కలిగే ఒక భావన, ఒక అనుభూతి. మీకు నచ్చిన ఉద్యోగం లభిస్తే ఆనందం కలుగుతుంది. బైక్ మీద అలా సరదాగా షికారుకు వెళ్తే ఆనందం లభిస్తుంది. వర్షంలో ఆటలాడితే ఆనందం లభిస్తుంది. కొలనులో ఈతకొడితే ఆనందం లభిస్తుంది. నవ్వులు పూయించే మంచి సినిమా చూస్తే ఆనందం కలుగుతుంది. సోషల్ మీడియాలో మీ పోస్టులకు ఫుల్లుగా ఆనందం కలిగుతుంది. అంటే మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు ఆనందాన్ని పొందలేరు. జీవితం మీద ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరూ మనకు శాశ్వతం కాదు. కాబట్టి మీతో ఎవరూ లేకపోయినా, మీరు ఆనందంగా ఉండాలి అని నిర్ణయించుకుంటే కచ్చితంగా ఆనందాన్ని పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలను సూచిస్తున్నాం. సానుకూల దృక్పథంతో వీటిని అనుసరిస్తే మీరు కచ్చితంగా ఆనందం పొందుతారు.

మనసారా నవ్వండి

మీరు ఒక చిన్న నవ్వుతో ఎవరినైనా పలకరించండి. అదే చిరునవ్వుతో మీకు జవాబు లభిస్తుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని, కలుపుగోలు తనాన్ని పెంచుతుంది. లేదా మనసారా నవ్వండి, ఇది కష్టంగా అనిపించే సులభమైన పద్ధతి. ఇలా నవ్వినపుడు డోపమైన్ అని పిలిచే 'ఫీల్ గుడ్' హార్మీన్ విడుదలవుతుంది. ఇది మీలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మీకు ఒక ఆనందకరమైన అనుభూతిని కలిగిస్తుంది.

వ్యాయామం చేయండి

ఖాళీగా కూర్చుని ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొద్దిసేపు మీకు నచ్చిన వ్యాయామం ఏదైనా చేయండి. రన్నింగ్, వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ ఇలా ఏదైనా కావొచ్చు.. మీ శరీరాన్ని ఉన్నచోటు నుంచి కదిలించి కాస్త శ్రమ కల్పించండి. లేదా కొన్ని యోగాసనాలు వేయండి. దీనివల్ల మీకు తెలియని ఆనందం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుపడుతుంది.

బాగా నిద్రపోండి

తగినంత నిద్ర లేకపోవడం వలన ప్రతికూల ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇది అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. బాగా నిద్రపోండి. లేచిన తర్వాత మీకు రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.

మంచి ఆహారాలు

మీకు నచ్చిన పండ్లను తెచ్చుకొని ఒక్కొక్కటిగా తినండి. కొన్ని డ్రైఫ్రూట్స్, పలుకులు కూడా తినండి. తిన్న తర్వాత ఒకరకమైన తృప్తి, ఆ తర్వాత ఆనందం కలుగుతుంది. మానసిక స్థితి బాగుండాలంటే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఒంటరిగా మీ కంపెనీని ఆనందించండి

ఒకరి మీద ఆధారపడకండి, ఏది చేసినా మీ ఆనందం కోసమే అని చేయండి. మీకు నచ్చిన పనిని మీకు ఇష్టం వచ్చినట్లుగా చేయండి. ఒక్కరే సినిమాకు వెళ్లండి, ఒక్కరే రెస్టారెంటుకు వెళ్లండి, ఎక్కడికైనా సోలోగా వెళ్లిపోవడం అలవాటు చేసుకోండి. ఇలా సోలో లైఫ్ ను ఆస్వాదిస్తే మీ ఆనందాన్ని ఎవరూ ఆపలేరు. ఇదే క్రమంలో మీకు కొత్తగా స్నేహితులు ఏర్పడవచ్చు. వారూ మీ సోలో క్లబ్ లో చేరవచ్చు.

చివరగా చెప్పేదేంటంటే మీరు ఒక్కరే ఉంటే ఒంటరిగానే మీకు నచ్చిన పని చేయండి, మీరు అందరితో కలిసి ఉంటే అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. మనిషికి పుట్టినందుకు మనకు ఎన్నో ఆప్షన్లు, అవకాశాలు ఉన్నాయి. వాటితో తృప్తిపడండి.. ఉన్న ఒక్క జీవితాన్ని ఉన్నంతకాలం ఆనందంగా గడపండి. హ్యాపీగా ఉండండి!

WhatsApp channel

సంబంధిత కథనం