Blood donation benefits: రక్తదానం చేస్తే మీ ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం తెలుసా?-know health benefits of blood donation and precautions in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Health Benefits Of Blood Donation And Precautions In Telugu

Blood donation benefits: రక్తదానం చేస్తే మీ ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 03:59 PM IST

Blood donation benefits: రక్తదానం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందంటే నమ్ముతారా? ఒకసారి ఇది చదవండి.

రక్తదానంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది..
రక్తదానంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. (HT_PRINT)

Blood donation benefits: రక్తదానం అంటే ప్రాణాలను కాపాడడమే. ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా రక్తం తక్కువైనప్పుడు లేదా క్లిష్టమైన అనారోగ్య సమస్యలకు చికిత్సలో ప్లాస్మా చికిత్సకు రక్తదానం అవసరం అవుతుంది. అయితే రక్తదానంపై ప్రజల్లో అపోహలు, అపనమ్మకాలు ఉన్నాయి. మీరు రక్తదానం చేయొచ్చా లేదా వంటి అనుమానాలకు ఆరోగ్య సిబ్బంది సమాధానం ఇస్తారు. రక్తదానంపై ఎలాంటి సందేహాలైనా మీ రక్తం స్వీకరించేటప్పుడు ఆరోగ్య నిపుణులు నివృతి చేస్తారు. ముందుగా ఇప్పుడు రక్తదానం వల్ల మీకు, మీ ఆరోగ్యానికి ప్రయోజనాలేంటో తెలుసుకోండి.

1. ఉచితంగా వైద్య పరీక్షలు

మీరు రక్తదానం చేసేటప్పుడు ముందుగా మీ బీపీ చెక్ చేస్తారు. రక్త దానం చేశాక కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. కొన్ని వ్యాధుల నిర్ధారణకు ఇవి ఉపయోగపడుతాయి. హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి నిర్ధిష్ట వ్యాధులు ఉన్నప్పుడు మీ రక్తాన్ని ఎవరికీ ఉపయోగించరు. ఆయా వ్యాధులు ఉన్నట్టు మీకు తెలియపరుస్తారు. తెలుసుకోవాలనుకున్నట్టు ముందే వారికి సమాచారం ఇవ్వడం మరిచిపోవద్దు.

2. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

మీరు రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు వైద్య నిపుణులు. రక్తంలో హిమోగ్లోబిన్ అధికంగా ఉన్నప్పుడు రక్తదానం చేయడం వల్ల రక్తం చిక్కదనం తగ్గుతుంది. అంటే రక్తం గడ్డకట్టడం, గుండె పోట్ల ముప్పు, స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది. ఈ ప్రయోజనం పురుషులకు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలిపాయి. అధికంగా ఉన్న ఐరన్ రక్తదానం వల్ల తగ్గడం కూడా గుండెకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

3. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

రక్తదానం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి. నిబంధనలను ఉల్లంఘించకుండా క్రమం తప్పక రక్తదానం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని, ఇది అంతిమంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

3. దీర్ఘాయుష్షు లభిస్తుంది

ఒకసారి రక్తదానం చేస్తే అది మూడు ప్రాణాల వరకు కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు సాయం చేయడం కోసం మనం రక్తదానం చేస్తాం. ఈ సానుకూల దృక్పథం మనలోని మానసిక కుంగుబాటును దూరం చేస్తుందట. ఇది దీర్ఘాయువు ఉండేలా చేస్తుందట. ఇతరులకు సాయం చేయడానికి మించి సంతృప్తి ఏముంటుంది? ఈ విషయమే మనల్ని సానుకూలంగా ఉంచుతుంది.

నిజాలు దాచిపెట్టొద్దు..

రక్తదానానికి ముందు ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. అందులో మీ ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు రాయాల్సి ఉంటుంది. మీకు ఏయే వ్యాధులు ఉన్నాయి? గడిచిన నాలుగు గంటల్లో భోజనం చేశారా? పీరియడ్స్ వచ్చి ఎంత కాలం అయ్యింది? మీరు గర్భం దాల్చారా? వంటి విషయాలు అడుగుతారు. అలాగే మీకు డయాబెటిస్ ఉన్నా రక్తదానం చేయొచ్చు. కానీ డయాబెటిస్ ఉండి ఇన్సులిన్ తీసుకుంటుంటే మాత్రం తీసుకోరు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

రక్తదానం చేసిన తరువాత ఒక అరగంట సేపు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఉండడం మంచిది. తలతిప్పడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే వారికి చెప్పాలి. రక్తదానం చేసిన తరువాత ఇచ్చే స్నాక్స్, జ్యూస్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే షుగర్ లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. వెంటనే డ్రైవింగ్ చేయడం వంటివి వద్దు. అలాగే 24 గంటల వరకు ఆల్కహాల్ ముట్టుకోవద్దు. మూడు నాలుగు రోజుల పాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి.

WhatsApp channel

టాపిక్