Bone health: పిల్లల్లో ఎముకల పటిష్టతకు పేరెంట్స్ తెలుసుకోవాల్సిన 4 టిప్స్-know 4 tips to improve bone health of your children and food for strong bone density ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know 4 Tips To Improve Bone Health Of Your Children And Food For Strong Bone Density

Bone health: పిల్లల్లో ఎముకల పటిష్టతకు పేరెంట్స్ తెలుసుకోవాల్సిన 4 టిప్స్

HT Telugu Desk HT Telugu
Jan 04, 2023 12:43 PM IST

Child’s bone health: పిల్లల్లో బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన 4 ముఖ్యమైన టిప్స్ ఇవే.

పిల్లల్లో బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి 4 టిప్స్
పిల్లల్లో బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి 4 టిప్స్ (RODNAE Productions)

మన ఎముకలు, కీళ్ళు మన శరీరానికి సపోర్ట్‌గా నిలిచేందుకు అవసరమైన స్వరూపాన్ని తయారు చేస్తాయి. మన అవయవాలను రక్షించడంలో, మన కండరాలకు అండగా ఉండడంలో, కాల్షియం నిల్వ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఎముకల సంరక్షణ మన శరీరానికి అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లల శారీరక, మానసిక బాగోగుల గురించి తరచుగా ఆందోళన చెందుతారు.

బాల్యం, కౌమార దశలో మీ పిల్లల ఎముకలు పెద్దవిగా ఎదుగుతూ పటిష్టంగా మారుతుంటాయి. ఎముకల సాంద్రత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీ పిల్లవాడు యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాత అంటే 18-25 సంవత్సరాల వయస్సులో బోన్ మాస్ గరిష్ట దశకు చేరుకుంటుంది. ఎముక సాంద్రత అభివృద్ధి చెందడం ఆగిపోతుంది. బోన్‌మాస్‌లో 90% అప్పటికే అభివృద్ధి చెంది ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల ఆహారంలో పోషకాలు సమకూర్చడం చాలా ముఖ్యం.

ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ పిడియాట్రిక్ ఇమ్యునాలజీ, ర్యుమటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సాగర్ భట్టాడ్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా అంశాలపై మాట్లాడారు. బలహీనంగా ఉన్న ఎముకలు కేవలం ఫ్రాక్చర్లకు మాత్రమే కారణం కాకుండా పిల్లల్లో ఆస్టియోపోరోసిస్, రికెట్స్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీ పిల్లల ఎముకలు పటిష్టంగా ఉండేందుకు ఆయన పలు సూచనలు చేశారు.

1. Increase your Vitamin D intake: విటమిన్ డి పెంచాలి

ఎముకల ఆరోగ్యంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. మీ శరీరం కాల్షియం గ్రహించడంలో తోడ్పడుతుంది. చిన్నారులు, యువకులు, పెద్దవాళ్లలో విటమిన్ డీ లోపం ఏర్పడడం సర్వసాధారణం. విటమిన్ డీ స్థాయి తక్కువగా ఉంటే బోన్ డెన్సిటీ తగ్గి ఎముకల క్షీణత ఏర్పడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల పిల్లల్లో ఎముకల సంబంధిత వ్యాధుల నివారణకు తగినంత విటమిన్ డీ అవసరం. విటమిన్ డీ ఇవ్వాలంటే వారికి ఉదయం పూట 10 నుంచి 15 నిమిషాల పాటు సూర్యరశ్మి సోకేలా చూడాలి. వారంలో రెండు మూడు రోజులు ఇలా చేయాలి. చేతులు, కాళ్లు, ముఖంపై సూర్యరశ్మి పడేలా చూడాలి. అలాగే చీజ్, లివర్, కొవ్వు ఉన్న చేపలు తినేలా చూడాలి. వీటిని సాండ్‌విచ్, పాస్తా వంటి వాటితో కూడా ఇవ్వొచ్చు.

2. Calcium: తగినంత కాల్షియం అందేలా చూడాలి

ఎముకల నిర్మాణంలో కాల్షియం పాత్ర కీలకం. కండరాల పటిష్టతకు, గుండె సక్రమ పనితీరుకు కూడా కాల్షియం అవసరం. పాలు, చీజ్, యోగర్ట్ తగినంత కాల్షియం సమకూరుస్తాయి. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు కనీసం 2 గ్లాసుల పాలు తాగేలా చూడాలి. దీనికి తోడు కనీసం ఒక పూట ఒక కప్పు పెరుగు లేదా యోగర్ట్ తీసుకునేా చూడాలి. ఇక పాలకూర, బచ్చలికూర, బెండ కాయ వంటివి వారి ఆహారంలో భాగం అవ్వాలి. ఆరేంజ్ విటమిన్ సీతో పాటు కాల్షియం కూడా అందిస్తుంది. సోయాబీన్ ఉత్పత్తులైన సోయా మిల్క్, సోయా యోగర్ట్‌లో కూడా కాల్షియం ఉంటుంది. చేపల్లో కూడా కాల్షియం ఉంటుంది.

3. Vitamin K and Magnesium: బోన్ డెన్సిటీ కోసం విటమిన్ కె, మెగ్నీషియం

విటమిన్ కె, మెగ్నీషియం అధికంగా తీసుకునే వ్యక్తులు ఆరోగ్యకరమైన ఎముక సాంద్రత కలిగి ఉంటారని, రికెట్స్, బోలు ఎముకల వ్యాధి వంటి బోన్ డిసీజెస్‌కు తక్కువ అవకాశం ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఇవి కాల్షియంతో కలిసి మీ పిల్లల ఎముకలు బలంగా పెరిగేలా చేస్తాయి. బచ్చలికూర, క్యాబేజీ, మొలకలు, ఆకు కూరలు విటమిన్ కె, మెగ్నీషియం సమకూరుస్తాయి.

4. physical activity: యాంత్రిక జీవనశైలి వద్దు

పిల్లలు టీవీ, మొబైల్‌కు పరిమితమైనందున వారు చలనం లేని జీవితాన్ని గడుపుతున్నారు. శారీరక చురుకుదనం లేకపోవడం క్రమంగా ఎముకల వ్యాధులకు కారణమవుతుంది. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం వంటివి వారి ఎముకలు బలోపేతం కావడానికి ఉపయోగపడుతాయి. ఆటలు వారి మనోవికాసానికి కూడా అవసరం. ఆయా వ్యాయామాలు బోన్ సెల్స్ ఎదుగుదలకు తోడ్పడుతాయి. మీ పిల్లలు ఎముక సంబంధిత సమస్యల నుంచి బాధపడుతుంటే ఎక్కువ రోజులు ఎదురుచూడకండా వైద్యుడిని సంప్రదించడం మేలు.

WhatsApp channel

టాపిక్