Ghee | నెయ్యి తినడం ద్వారా బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? తెలుసుకోండి!-is ghee good for weight loss or weight gain read this story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee | నెయ్యి తినడం ద్వారా బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? తెలుసుకోండి!

Ghee | నెయ్యి తినడం ద్వారా బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 04:26 PM IST

నెయ్యి అనేక పోషక విలువలు కలిగి ఉందని మనకు తెలుసు. మరి నెయ్యి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలేమి. నెయ్యి తింటే బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవండి.

Ghee for Weight loss or gain
Ghee for Weight loss or gain (Unsplash)

నెయ్యి తింటే బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందని, చదువు బాగా వస్తుందని చెబుతూ చిన్నప్పుడు మన పెద్దవాళ్లు మనకు బలవంతంగా ఆహారంలో నెయ్యిని కలిపి తినిపించేవారు. కానీ నెయ్యి కొవ్వు పదార్థం, దీనివల్ల బరువు పెరుగుతారు అని పేర్కొంటూ ఈరోజుల్లో చాలా మంది నెయ్యి తినడం మానేస్తున్నారు. మరి నిజంగా నెయ్యి తినడం వలన బరువు పెరుగుతారా? అని అడిగితే.. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. సరైన మోతాదులో నెయ్యి తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు, అంతేకాకుండా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చునని తెలియజేస్తున్నారు.

నెయ్యిలో ఒమేగా 3 కొవ్వులు (DHA), అలాగే ఒమేగా 6 (CLA) లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొవ్వును తగ్గిస్తాయి. బరువు తగ్గించడంలో మీ శరీరానికి సహాయపడతాయి. అలాగే పలుచగా ఉన్న శరీరంలో బాడీ మాస్‌ను పెంచుతాయి. కొవ్వు కణాలను సమీకరించడం, వాటిని కాల్చడం ద్వారా నెయ్యి మీ శరీరానికి అదనపు శక్తిని అందిస్తుందని కూడా నివేదికలు పేర్కొన్నాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు.

అయితే రోజులో 1 నుంచి 2 టీస్పూన్లకు మించి ఎక్కువ నెయ్యి తీసుకోకూడదని సిఫార్సు చేస్తున్నారు. బరువు తగ్గాలి అనుకునే వారు రోజుకు ఒక స్పూన్ నెయిని తీసుకోవచ్చు. ఉన్న బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు 2 స్పూన్ల మోతాదులో నెయ్యి తీసుకోవచ్చు. ఇంతకు మించి నెయ్యి తీసుకుంటే సమతుల్యత లోపిస్తుందని పలు రిపోర్టులు సూచిస్తున్నాయి.

నెయ్యి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రతి భారతీయ వంటగదిలో నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం కూడా నెయ్యి తీసుకోవడం ఆరోగ్యకరమైనది. మీరు మీ ఆహారంలో నెయ్యిని కలుపుకోకపోతే, అనేక ఆరోగ్య ప్రయోజనాల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకుంటున్నారని అర్థం. మరి సరైన మోతాదులో శుద్ధమైన నెయ్యి తీసుకోవడం ద్వారా కలిగే మరికొన్ని ప్రయోజనాలు ఈ కింద చూడవచ్చు.

శక్తి లభిస్తుంది

మీ రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా మీరు రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. నెయ్యి శక్తిని ఉత్పత్తి చేసే ఒక పవర్‌హౌస్ లాంటిది. గర్భధారణ సమయంలోనూ నెయ్యి తిన్సాల్సిందిగా సూచిస్తారు.

చర్మానికి మేలు చేస్తుంది

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను లాక్ చేయడం ద్వారా ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంలో నిగారింపు, ఆరోగ్యకరమైన చర్మం పొందాలంటే ఆహారంలో నెయ్యిని కూడా కలుపుకోవాలి.

పీరియడ్ సమస్య తగ్గుతుంది

శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి సహాయపడుతుంది. ఆడవారు పీరియడ్స్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆహారంలో నెయ్యిని చేర్చుకోవాలి. ఇది క్రమరహిత పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.

ఎముకలు బలంగా ఉంటాయి

నెయ్యిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. తద్వారా దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్‌ రాకుండా ఉంచడానికి తోడ్పడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం