Covid effect on Brain: కోవిడ్‌తో మెదడు దెబ్బతింది.. తేల్చిన తాజా స్టడీ-iit delhi study reveals mri shows significant brain abnormalities postcovid ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Covid Effect On Brain: కోవిడ్‌తో మెదడు దెబ్బతింది.. తేల్చిన తాజా స్టడీ

Covid effect on Brain: కోవిడ్‌తో మెదడు దెబ్బతింది.. తేల్చిన తాజా స్టడీ

HT Telugu Desk HT Telugu

Covid effect on Brain: కోవిడ్ అనంతరం విభిన్న న్యూరలాజికల్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ తాజా అధ్యయన సారాంశం చదవండి.

కోవిడ్ కారణంగా పేషెంట్ల మెదడు అసాధారణతలకు గురైందని తేల్చిన స్టడీ (AP)

కోవిడ్-19 నుంచి రికవరీ అయిన సమయం నుంచి 6 నెలల వరకు మెదడులో మార్పులు సంభవించాయని ఐఐటీ-ఢిల్లీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఒక ప్రత్యేక ఎమ్మారై స్కానింగ్ యంత్రం ద్వారా ఐఐటీ-ఢిల్లీ పరిశోధకులు ఈ అధ్యయనం జరిపారు. కోవిడ్ వల్ల ప్రతి ఐదుగురు వయోజనుల్లో ఒకరు దీర్ఘకాలిక ప్రభావాలకు గురయ్యారని అధ్యయనం తేల్చింది.

ఆలోచించడంలో ఇబ్బంది, ఏకాగ్రత లోపం, తలనొప్పి, నిద్ర లేమి సమస్యలు, సూదులతో గుచ్చినట్టు అనిపించడం, వాసన, రుచిలో మార్పులు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి న్యూరలాజికల్ లక్షణాలు కోవిడ్‌ కారణంగా కనిపించాయని తేల్చింది.

లక్షణాలు కనిపించని పేషెంట్లలో కూడా కోవిడ్-19 కారణంగా గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల్లో మార్పులు సంభవించాయని అధ్యయనం తేల్చింది. మెదడుపై కోవిడ్-19 ప్రభావాలను వెయిటెడ్ ఇమేజింగ్ మిషన్ ద్వారా విశ్లేషించడంపై జరిగిన ఈ అధ్యయన నివేదికను రేడియోలజీ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ఎస్ఎన్ఏ)కు వచ్చే వారం సమర్పించనున్నారు.

రక్తం, ఇనుము, కాల్షియం వంటి నిర్దిష్ట పదార్థాలు అనువర్తిత అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతీకరణకు గురైన పరిమాణాన్ని మాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఇమేజింగ్ వ్యవస్థ సూచిస్తుంది. మైక్రోబ్లీడ్స్, మెదడు కణితులు, స్ట్రోక్‌లతో సహా అనేక న్యూరోలాజిక్ పరిస్థితులను గుర్తించడంలో, పర్యవేక్షించడంలో ఈ సామర్థ్యం సహాయపడుతుంది.

‘కోవిడ్-19 కారణంగా మెదడు యొక్క అయస్కాంత గ్రహణశీలతలో మార్పులపై గతంలో గ్రూప్ లెవల్ అధ్యయనాలు జరగలేదు. చాలా కేసు నివేదికలు ఈ అసాధారణతలను సూచిస్తున్నాయి..’ అని ఐఐటీ ఢిల్లీ రీసెర్చ్ స్కాలర్ సప్నా మిశ్రా తెలిపారు.

‘మా అధ్యయనం కోవిడ్-19 యొక్క న్యూరలాజికల్ ప్రభావాలను సూచిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో అసాధారణతలను ఈ అధ్యయనం సూచిస్తోంది..’ అని మిశ్రా తెలిపారు.

కోవిడ్ నుంచి కోలుకున్న 46 మంది డేటాను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. సుదీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడిన పేషెంట్లలో ఎక్కువ మందిలో కనిపించిన లక్షణాలు అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మెమొరీ కోల్పోవడం వంటివి సంభవించాయని కోవిడ్ ఈ అధ్యయనంలో తేలాయి.

కోవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్లలో ఫ్రంటల్ లోబ్‌, బ్రెయిన్ స్టెమ్‌లో ససెప్టిబులిటీ వ్యాల్యూ గణనీయమైన స్థాయిలో ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఫ్రంటల్ లోబ్ క్లస్టర్లలో తెల్లని పదార్థంలో తేడాలు కనిపించాయని తెలిపారు. ‘అలసట, నిద్ర లేమి, యాంగ్జైటీ, డిప్రెషన్, తలనొప్పులు, బ్రెయిన్ నిర్వర్తించే ఇతర పనులతో ఈ బ్రెయిన్ ప్రాంతాలు ముడివడి ఉన్నాయి..’ అని మిశ్రా తెలిపారు. 

‘ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న నెలల తర్వాత కూడా కరోనా వైరస్ వల్ల కలిగే తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను ఈ అధ్యయనం సూచిస్తుంది..’ అని మిశ్రా చెప్పారు.

ఈ మెదడు అసాధారణతలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు అదే రోగి సమూహంపై అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు.