Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం ఎలా?-how to withdraw from my mutual fund ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Withdraw From My Mutual Fund?

Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం ఎలా?

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 04:51 PM IST

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు మదుపు చేయడం ఎంత సులువో, ఉప సంహరణ కూడా అంతే సులువు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్, మరికొన్ని నిర్ధిష్ట అవసరాలకు సంబంధించిన ఫండ్స్ మాత్రమే లాకిన్ పీరియడ్ కలిగి ఉంటాయి. ఇక ఇతర మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీ సొమ్మును ఎప్పుడంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం: మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిధులు ఉపసంహరణ సులువు
ప్రతీకాత్మక చిత్రం: మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిధులు ఉపసంహరణ సులువు (unsplash)

Mutual Funds.. మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీ సొమ్మును విత్ డ్రా చేసుకోవాలంటే ఆఫ్ లైన్ పద్ధతిలో అయితే మీ సంతకంతో కూడిన రిడెంప్షన్ రెక్వెస్ట్‌ను సంబంధిత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థానిక సంస్థకు చేరవేయాలి. కానీ ఇప్పుడు అంతా ఆన్ లైన్ పద్ధతిలోనే లావాదేవీలు జరుగుతున్నాయి.

మీకు సంబంధించిన ఆన్ లైన్ మ్యూచువల్ ఫండ్ ఖాతా వెబ్ సైట్ లాగిన్ అయి, మీరు కోరుకున్న ఫండ్ యూనిట్లను రిడెంప్షన్ చేసుకోవచ్చు.

ఓపెన్ ఎండ్ ఫండ్ అన్ని పని దినాల్లో విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు రిడెంప్షన్ చేసినప్పటికీ ఆ సమయంలో ఉన్న నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) ఆధారంగా మీ యూనిట్లకు విలువను లెక్కించి చెల్లిస్తారు.

ఎన్ని రోజుల్లో చెల్లిస్తారు?

మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షన్ చేసుకున్నప్పుడు గరిష్టంగా పది రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో చేరిపోతాయి. మూడు రోజుల నుంచి పది రోజుల్లోగా మీ ఖాతాలో జమ అవుతాయి.

ఎంత మేర విత్ డ్రా చేసుకోవచ్చు?

మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ ఎండ్ స్కీములు. గరిష్ట పరిమితి, మెచ్యూరిటీ సమయం వంటి షరతులు ఏవీ లేకుండా మీరు పెట్టిన పెట్టుబడి ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంత మొత్తమైనా విత్ డ్రా చేసుకోవచ్చు. 

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అయితే మాత్రమే లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. ఒకవేళ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడితే ప్రతి సారీ చేసిన పెట్టుబడికి లాకిన్ పీరియడ్ పూర్తవ్వాల్సి ఉంటుంది. లాకిన్ పీరియడ్ పూర్తయ్యాక ఒక్కో కిస్తీ వెనక్కి తీసుకోవచ్చు. లేదా అన్ని కిస్తీలకు లాకిన్ పీరియడ్ పూర్తయితే మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు.

విత్ డ్రా చేసుకుంటే రుసుము ఉంటుందా?

కొన్ని పథకాలు నిర్ధిష్ట సమయం కంటే ముందు విత్ డ్రా చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ పేరుతో స్వల్ప మొత్తంలో ఛార్జీ విధిస్తాయి. ఇందుకు సంబంధించిన విషయాలన్నీ సదరు ఫండ్ డాక్యుమెంట్స్‌లో ఉంటాయి. 

అయితే ఉపసంహరణ ఎన్నిసార్లు చేసుకోవచ్చు? పరిమితులేవైనా ఉంటాయా? అంటే లేవనే చెప్పాలి. సదరు సంస్థలు ఏవైనా నిబంధనలు పెడితే తప్పా ఎన్నిసార్లయినా విత్ డ్రా చేసుకోవచ్చు.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్