H3N2 Influenza | దేశంలో పెరుగుతున్నఇన్‌ఫ్లుఎంజా కేసులు.. లక్షణాలు, నివారణ, జాగ్రత్తలు చూడండి! -h3n2 influenza symptoms treatment precaution and all that you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  H3n2 Influenza Symptoms, Treatment, Precaution And All That You Need To Know

H3N2 Influenza | దేశంలో పెరుగుతున్నఇన్‌ఫ్లుఎంజా కేసులు.. లక్షణాలు, నివారణ, జాగ్రత్తలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 08:51 AM IST

H3N2 Influenza: H3N2 ఇన్‌ఫ్లుఎంజా ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి ముప్పు ఎక్కువ? ఈ వైరస్ బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్స విధానం మొదలైనవి ఇక్కడ తెలుసుకోండి.

H3N2 Influenza
H3N2 Influenza (Unsplash)

కోవిడ్ మహమ్మారి, దాని తదనంతర పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో దేశంలో ఇన్‌ఫ్లుఎంజా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో దీర్ఘకాలిక అనారోగ్యం, దగ్గు వంటి లక్షణాలు ఎదుర్కొంటున్న చాలా మందిలో H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ప్రబలినట్లు నిర్ధారణ అయింది. ఇది సాధారణ ఫ్లూ గా భావిస్తున్న ప్రజలు సరైన రోగనిర్ధారణ చేసుకోకుండా, వైద్యులను సంప్రదించకుండానే ఫార్మసీ స్టోర్లకు పరుగులు పెడుతూ ఫ్లూ ఔషధాలు, యాంటీ బయోటిక్‌ ట్యాబ్లెట్‌లు, ఇంటి నివారణలు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుంచి ప్రకటన వెలువడింది. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించకుండా స్వంత వైద్యం గానీ, ఔషధాలు తీసుకోవడం గానీ చేయవద్దని ప్రజలకు సిఫారసు చేసింది.

గతంలో వైరల్ వ్యాధుల బారినపడినవారు, వాయు కాలుష్యం మొదలైన కారకాలు H3N2 ఇన్‌ఫ్లుఎంజా ప్రబలడానికి ప్రభావం చూపుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎక్కువ సంక్రమణకు గురవుతున్నారు.

H3N2 Influenza Symptoms- H3N2 ఇన్‌ఫ్లుఎంజా లక్షణాలు

జ్వరం, దగ్గు , ముక్కు కారటం వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు, ఒళ్ళు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటివి H3N2 ఇన్‌ఫ్లుఎంజాకు ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ఉబ్బసం ఉన్న రోగులు, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వారికి ఈ వైరస్ సోకితే లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.

H3N2 Influenza Prevention- నివారణ ఎలా

రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా తిరగరాదు, ఆరుబయట పొల్యూషన్ మాస్క్ ధరించచాలి, చేతులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ముఖ్యంగా రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత, ఆహారం తీసుకునే ముందు మీ ముఖం, ముక్కు లేదా నోటిని తాకడానికి ముందు మీ చేతులు పరిశుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. వాయు మార్గాల పరిశుభ్రత పాటించాలి, వార్షిక ఫ్లూ షాట్‌లు తీసుకోవడం, ఇంటి లోపల గాలి నాణ్యత మెరుగుపరిచే పద్ధతులు అవలింబించడం వలన ఈ వైరస్ సోకకుండా నివారించవచ్చు. అలాగే వైద్యులను సంప్రదించకుండా ఫార్మసీ మందులు వాడటం, ఇంటి నివారణలకు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.

చికిత్స, జాగ్రత్తలు:

H3N2 వైరస్ సోకిన పిల్లలకైనా, పెద్దలకైనా ఒసెల్టామివిర్, జానామివిర్, పెరామివిర్, బాలోక్సావిర్‌లతో చికిత్స చేయవచ్చునని ఢిల్లీలోని ప్రైమస్ హాస్పిటల్, పల్మనరీ విభాగాధిపతి డాక్టర్. SK ఛబ్రా తెలిపారు. వీటిని వైద్యుడు సూచించిన ప్రిస్క్రిప్షన్‌తో పొందవచ్చు. కచ్చితంగా వైద్యుడు సూచించిన మోతాదు మేరకు యాంటీవైరల్ డ్రగ్ తీసుకోవాలని డాక్టర్. SK ఛబ్రా అన్నారు.

అలాగే వార్షిక ఫ్లూ టీకాలు వేయించుకోవాలి. ఈ అక్టోబరు చివరి నాటికే అందరూ టీకాలు వేయించుకొని ఉండాలని సూచించారు.

రద్దీగా ఉండే ప్రాంతాలు నివారించాలి: వైరస్ త్వరగా వ్యాప్తి చెందే రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండండి.

సామాజిక దూరం: అనారోగ్య వ్యక్తులతో భౌతిక దూరం పాటించాలి.

స్వీయ నిర్బంధం: ఫ్లూ విషయంలో, జ్వరం తగ్గిన తర్వాత కూడా 24 గంటల పాటు ఇంట్లోనే ఉండండి. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్