Monsoon Diet | వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు!-foods that should be avoided during monsoon for your health sake ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Foods That Should Be Avoided During Monsoon For Your Health Sake

Monsoon Diet | వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు!

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 07:14 PM IST

ఆరోగ్యానికి మంచిదని ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తినేస్తున్నారా? వర్షాకాలంలో కొన్నింటికి దూరంగా ఉండాలి. లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. ఈ స్టోరీ చదవండి..

Monsoon- Foods to be avoided
Monsoon- Foods to be avoided (Unsplash)

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ నోరు రుచికరమైన ఆహారం కోసం తహతహలాడుతుంది. వేడివేడిగా సమోసాలు, పకోడాలు వంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది. కానీ ఈ సీజన్ లో ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైనవిగా చెప్పే ఆహార పదార్థాలు కూడా వర్షాకాలంలో సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి కొన్ని రకాల కూరగాయలకు, ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, మాన్‌సూన్ సీజన్‌లో తినకూడనవి ఏవో ఇక్కడ తెలుసుకోండి.

1. ఆకు కూరలు

వర్షాకాలంలో వాతావరణంలోని తేమ, అనుకూలమైన ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అవకాశమిస్తాయి. ముఖ్యంగా ఆకు కూరలపై తెగుళ్లు వృద్ధి చెందుతాయి. వీటిని తింటే అది కడుపులో ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పాలకూర, మెంతికూర మొదలగు ఆకుకూరలను తినకూడదు. అలాగే కూరగాయల్లో కూడా వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి తీసుకోవద్దు.

బదులుగా చేదుగా, ఘాటుగా ఉండే కూరగాయలు తీసుకోవచ్చు. కాకరకాయ, సోరకాయ, టోమాటో ఇతర కూరగాయలను తినొచ్చు. అయితే బాగా ఉడికించుకొని తినాలి.

2. సీఫుడ్

మీరు వర్షాకాలంలో చేపలు , రొయ్యలు వంటి సీఫుడ్‌కు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది. ఈ నీటిలో వ్యాధులకు కారకమయ్యే అనేక హానికర వైరస్, బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. కాబట్టి నీటిలో జీవించే సీఫుడ్ తీసుకుంటే వాటి ద్వారా హానికర క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇక రెండవది, ఇది సంతానోత్పత్తి కాలం. కాబట్టి నీటిలో జీవించే జీవులు అనేక మార్పులకు లోనవుతాయి. వాటిని మనం తింటే అస్వస్థతకు గురికాక తప్పదు.

3. మసాలా ఫుడ్

కచోరీలు, పకోడాలు, సమోసాలు వంటి వేయించిన ఆహారాన్ని ఎప్పుడో ఒకసారి తినడం మంచిది. వర్షాకాలంలో మసాలా ఫుడ్, వేయించినవి తింటే అవి మీ కడుపుని అనేక విధాలుగా బాధపెడుతుంది. అజీర్ణం, విరేచనాలు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.

4. పుట్టగొడుగులు

పుట్టగొడుగులు తడి నేలలో పెరుగుతాయి. ఇవే ఒక ఫంగస్ జాతికి చెందినవి ఆపై వర్షాకాలంలో వీటిపై హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి పుట్టగొడుగులు విషతుల్యం అవుతాయి. వర్షాకాలంలో పుట్టగొడుగులకు నో చెప్పడం మంచిది!

5. పెరుగు

పెరుగులో ఉండే చల్లని స్వభావం వల్ల వర్షాకాలంలో ఇది శరీరానికి హానికరం. మీరు ఇప్పటికే జలుబు, సైనసైటిస్‌తో బాధపడుతున్నట్లయితే ఇటువంటి సమస్యలను పెరుగు మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి పాల ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తినే పదార్థాలతో పాటు తాగే పానీయాల విషయంలోనూ ఈ వర్షాకాలంలో జాగ్రత్త. మీరు హైడ్రేటింగ్ గా ఉండటం కోసం శుద్ధమైన నీటిని మాత్రమే తాగండి. నింబూ పానీ, జీరా పానీయాలు హాయిగా తాగవచ్చు. అయితే మార్కెట్లో దొరికే ఫిజ్జీ డ్రింక్స్, ఇతర ఎలాంటి డ్రింక్స్ మంచివి కావు.

పచ్చివి కూడా తినకండి, బాగా ఉడకబెట్టుకొని మాత్రమే తినండి. సురక్షితమైనవి తినండి, ఆరోగ్యంగా ఉండండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్