Olivia Morris on Naatu Naatu: తారక్‌తో స్టెప్పులేసిన ఒలీవియా.. నాటు నాటు ఆస్కార్ నామినేషన్‌పై ఇదీ ఆమె రియాక్షన్
Olivia Morris on Naatu Naatu: తారక్‌తో స్టెప్పులేసిన ఒలీవియా మోరిస్.. ఇప్పుడా నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావడంపై స్పందించింది. ఆర్ఆర్ఆర్ మూవీలో తన అందంతో ఒలీవియా అభిమానులను ఆకట్టుకుంది.
Olivia Morris on Naatu Naatu: ప్రతిష్టాత్మక ఆస్కార్స్ దిశగా ఆర్ఆర్ఆర్ మరో అడుగు ముందుకేసింది. ఈ మధ్యే గోల్డెన్ గ్లోబ్స్ గెలుచుకున్న ఈ మూవీలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడెమీ అవార్డులకు నామినేట్ అయింది. గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు గెలిస్తే ఆస్కార్స్ కూడా ఖాయమన్న అంచనా ఉన్న నేపథ్యంలో కోట్లాది మంది భారతీయ సినీ అభిమానులు.. ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈ పాటలో తారక్, రామ్ చరణ్ లతో కలిసి స్టెప్పులేసిన అందాల నటి ఒలీవియా మోరిస్ మాత్రం ఇన్నాళ్లూ దీనిపై స్పందించలేదు. గోల్డెన్ గ్లోబ్స్ గెలిచినప్పుడు కూడా ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇప్పుడు ఆస్కార్స్ కు నామినేట్ అయిన తర్వాత మాత్రం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది.
తాను ఆ పాటలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆర్ఆర్ఆర్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పింది. "ఆర్ఆర్ఆర్ మూవీలో నేను చేసిన వాటిలో నా ఫేవరెట్ ఈ నాటు నాటు సీక్వెన్స్. అద్భుతమైన రాజమౌళి, కీరవాణి వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పుడీ నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కావడం, గోల్డెన్ గ్లోబ్స్ గెలవడం చాలా పెద్ద విషయం. ఈ అత్యద్భుతమైన సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది" అని ఒలీవియా తన పోస్ట్ లో చెప్పింది.
ఆర్ఆర్ఆర్ మూవీలో జెన్నీ అనే పాత్రలో ఆమె కనిపించిన విషయం తెలిసిందే. తన అందం, అమాయకపు చూపులతో ఒలీవియా అభిమానులను కట్టి పడేసింది. నాటు నాటు పాటలో ఒలీవియా కూడా తారక్, రామ్ చరణ్ లతో పోటీ పడి డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ మ్యూజిక్, అందుకు తగినట్లు హీరోలు వేసిన స్టెప్పులు, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గళం ఆస్కార్స్ కు చేరువ చేశాయి.
మంగళవారం (జనవరి 24) ఆస్కార్స్ నామినేషన్స్ లిస్ట్ ను అకాడెమీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట.. రిహానా, లేడీ గాగాల పాటలతో పోటీ పడనుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి పాటలను వెనక్కి నెట్టి ఈ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఇదే కేటగిరీలో ఈ పాటకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా వచ్చింది.
సంబంధిత కథనం