Ganesh in Pushpa Style: వినాయక చవితి వస్తుందంటే చాలు రకరకాల గణేష్ విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. ఈసారి రెండు సూపర్ డూపర్ హిట్ టాలీవుడ్ సినిమాల స్ఫూర్తిగా మహారాష్ట్రలో గణేష్ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్ క్యారెక్టర్‌లాగా గణేషుడి విగ్రహాన్ని రూపొందించగా.. తాజాగా పుష్ప స్టైల్‌లో మరో గణేషుడు తగ్గేదేలే అంటున్నాడు.
అచ్చూ పుష్ప మూవీలో అల్లు అర్జున్‌లాగా తెల్లటి డ్రెస్సు, అదే హెయిర్‌స్టైల్‌తో తగ్గేదే లే సిగ్నేచర్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ ఈ గణేషుని విగ్రహాన్ని తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చేశారు. మహారాష్ట్రలోని ఓ మండపంలో ఈ గణేషుడు కొలువు దీరనున్నాడు.
ఇక్కడ ఒక్కచోటే కాదు.. మహారాష్ట్రలోని చాలా చోట్లు పుష్ప లుక్స్, మేనరిజాలతో కూడిని ఎన్నో గణేషులు భక్తులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి ఫొటోలను కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన పుష్ప ద రైజ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నార్త్‌లోనూ ఈ మూవీ దుమ్ము రేపింది.
తాజాగా సీక్వెల్ పుష్ప ద రూల్ షూటింగ్ కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సీక్వెల్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప హిట్ అయిన తర్వాత అందులోని అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్, శ్రీవల్లి సాంగ్‌లో అతని స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయి. గల్లీలో పిల్లల నుంచి ఇంటర్నేషనల్ లెవల్లో క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లలోనూ ప్లేయర్స్ వీటిని ఇమిటేట్ చేశారు. ఇక ఇప్పుడు గణేష్ విగ్రహాలను కూడా పుష్ప ఇన్‌స్పైర్ చేశాడు.
అటు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్యారెక్టర్ల గణేషులు కూడా కొలువుదీరనున్నాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ గణేష్ విగ్రహాలను మండపాల్లో ఉంచి పూజించనున్నారు. మొత్తానికి మన టాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లడమే కాదు.. ఏకంగా గణేష్ విగ్రహ రూపాల్లోకే మారిపోతుండటం విశేషం.