Lok Sabha polls: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్; త్రిపురలో అత్యధికం; యూపీలో అత్యల్పం-lok sabha polls tripura records highest voter turnout up lowest key points ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Polls: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్; త్రిపురలో అత్యధికం; యూపీలో అత్యల్పం

Lok Sabha polls: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్; త్రిపురలో అత్యధికం; యూపీలో అత్యల్పం

HT Telugu Desk HT Telugu
Apr 26, 2024 07:54 PM IST

Lok Sabha polls: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండో దశలో త్రిపురలో అత్యధిక పోలింగ్, యూపీలో అత్యల్ప పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్ చాలా బాగా జరిగిందని ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు.

రెండో దశ ఎన్నికల్లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు
రెండో దశ ఎన్నికల్లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు (ANI Picture Service)

Lok Sabha polls: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్ ల్లో క్యూలో ఉన్నవారికి కూడా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు.

త్రిపురలో అత్యధికం..

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం పోలింగ్ నమోదు అయింది. మణిపూర్ (76.46 శాతం), పశ్చిమ బెంగాల్ (71.84 శాతం), చత్తీస్ గఢ్ (72.13 శాతం), అసోం (70.67 శాతం) రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు అధిక పోలింగ్ శాతం (polling) నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

యూపీలో అత్యల్పం..

మరోవైపు, లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో ఉత్తర ప్రదేశ్ లో అత్యల్ప పోలింగ్ (polling) నమోదైంది. యూపీలో అత్యల్పంగా 52.91 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు వివరించాయి. మహారాష్ట్ర, బిహార్, మధ్య ప్రదేశ్ ల్లో కూడా తక్కువ స్థాయిలోనే పోలింగ్ శాతం నమోదైంది. మహారాష్ట్రలో 53.71 శాతం, బిహార్ లో 53.6 శాతం, మధ్యప్రదేశ్ లో 55.16 శాతం, రాజస్థాన్ లో 59.35 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు కేరళలో 64.8 శాతం, కర్ణాటకలో 64.4 శాతం, జమ్మూ కాశ్మీర్లో 67.22 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26, శుక్రవారం రెండో దశ పోలింగ్ జరిగింది.

ఫేజ్ 2 ఓటింగ్ ముఖ్యాంశాలు

1. రెండో దశలో ఓటు వేసిన భారత దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్డీఏ సుపరిపాలనను ఓటర్లు కోరుకుంటున్నారని, యువత, మహిళా ఓటర్లు ఎన్డీఏకు మద్దతిస్తున్నారని ప్రధాని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

2. రాజీవ్ చంద్రశేఖర్, వి.మురళీధరన్, వీరేంద్ర కుమార్ వంటి కేంద్రమంత్రులు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటి హేమమాలిని, అరుణ్ గోవిల్, తేజస్వి సూర్య, శశిథరూర్, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు రెండో దశలో బరిలో ఉన్నారు.

3. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మతం పేరుతో ఓట్లు అడిగినందుకు భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు, బెంగళూరు దక్షిణ ఎంపి తేజస్వి సూర్యపై భారత ఎన్నికల సంఘం (ECI) కేసు నమోదు చేసింది.

4. త్రిపురలో స్థిరపడిన బ్రూ శరణార్థులు లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు మిజోరాంకు తిరిగి రాకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇది రెండోసారి.

5. ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో (కంకేర్, రాజ్ నంద్ గావ్, మహాసముంద్) సాయంత్రం 5 గంటల వరకు 72 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

6. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతుండగా, ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు గరియాబంద్ జిల్లాలో సర్వీస్ వెపన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

7. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. 34.8 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

WhatsApp channel