Peddapalli : ఒక్క నిమిషం ఎఫెక్ట్...! నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థి-a candidate could not file his nomination due to minute delay in peddapalli ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Peddapalli : ఒక్క నిమిషం ఎఫెక్ట్...! నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థి

Peddapalli : ఒక్క నిమిషం ఎఫెక్ట్...! నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థి

HT Telugu Desk HT Telugu
Apr 26, 2024 04:09 PM IST

Peddapalli Lok Sabha Constituency : ఒక్క నిమిషం ఆలస్యం కావటంతో పెద్దపల్లిలో ఓ అభ్యర్థి నామినేషన్ వేయలేకపోయారు. ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉండడంతో అధికారులు సదరు అభ్యర్థిని లోపలికి అనుమతి ఇవ్వలేదు.

పెద్దపల్లి లో నిముషం ఆలస్యం కావడంతో నామినేషన్ వేయలేని అభ్యర్థి
పెద్దపల్లి లో నిముషం ఆలస్యం కావడంతో నామినేషన్ వేయలేని అభ్యర్థి

Peddapalli Lok Sabha Constituency : ఒక్క నిముషం.. ఇది పరీక్షలకే పరీక్ష కాలం... కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సైతం పరీక్షకాలంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి నిముషం ఆలస్యం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి లభించలేదు. కాళ్ళ వేళ్ళ పడ్డా ప్రయోజనం లేకపోయింది. చివరకు నామినేషన్ వేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఎస్సీ రిజర్వుడు అయిన పెద్దపల్లి పార్లమెంట్(Peddapalli Lok Sabha Constituency) నియోజకవర్గంలో దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా మాతంగి హనుమయ్య పోటీకి సిద్దమయ్యారు. అన్ని పత్రాలు సిద్దం చేసుకుని నామినేషన్ చివరి రోజున నామినేషన్ వేసేందుకు పెద్దపల్లి కలెక్టరేట్ లోని ఆర్వో కార్యాలయానికి చేరారు. అప్పటికే సమయం మద్యాహ్నం మూడు గంటల ఒక్క నిముషం అయ్యింది. ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటలవరకే నామినేషన్ లు స్వీకరించడం జరుగుతుందని ఎన్నికల కమీషన్ నిబంధనలు ఉన్నాయి. ఆ లోగా ఎవ్వరు కార్యాలయంలోకి వచ్చిన కూర్చోబెట్టి నామినేషన్ లను స్వీకరిస్తారు. కానీ హనుమయ్య మూడు గంటలలోపు కార్యాలయంలోకి రాలేదు. ఒక్క నిముషం ఆలస్యంగా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. మూడు గంటలకే గేటు మూసేసిన ఎన్నికల అధికారులు ఎవ్వరిని లోనికి అనుమతించలేదు. హనుమయ్య గేటువద్ద ఉన్న నోడల్ అధికారులను ప్లీజ్ సార్ లోపలికి అనుమతించడని వేడుకున్నారు. కాళ్ళవేళ్ళ పడి ఒక్క అవకాశం ఇవ్వండని బ్రతిమాలారు. ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉండడంతో అదికారులు హనుమయ్యకు లోపలికి అనుమతి ఇవ్వలేదు. చివరకు నిముషం తనను పోటీ చేయకుండా చేసిందని ఆవేధనతో వెనుతిరిగారు.

ఆలస్యం అమృతం విషం..

ఆలస్యం అమృతం విషం అన్నట్లు..ఆలస్యం కొన్ని సందర్బాల్లో కలిసివస్తుంది.. కానీ హనుమయ్య విషయంలో నిముషం లేటు అతని ఆందోళనకు గురిచేసింది. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను ఉద్దరిద్దామనుకుంటే నిముషం లేటు తనకు పరీక్షకాలంగా మారిందని హనుమయ్య ఆవేధన వ్యక్తం చేశారు. పిల్లలకు పరీక్షల్లో నిముషం ఆలస్యం కాకుండా అరగంట ముందు రావాలన్నట్లు చట్టసభలకు ఎన్నికయ్యే వారికి అలాంటి పరీక్ష కాలం ఎందుకని హనుమయ్య ప్రశ్నిస్తున్నారు. హనుమయ్య గ్రహచారమో లేక దురదృష్టమో తెలియదు కానీ, నామినేషన్ కు ఎన్నికల సంఘం ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు వారం రోజుల సమయం ఇచ్చింది. పోటీ చేయాలనుకునే హనుమయ్య ఏదో ఒకరోజు నామినేషన్ వేయచ్చుకదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చివరి నిముషంలో వచ్చి అదికారులను బ్రతిమిలాడడం, నిబంధనలను తప్పుపట్టడం ఎందుకంటున్నారు జనం.

పెద్దపల్లిలో 83 మంది..110 నామినేషన్ లు

పెద్దపల్లి ఎంపీ స్థానానికి రికార్డు స్థాయిలో 83 మంది అభ్యర్థులు 110 నామినేషన్ దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బిఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బిజేపి నుంచి గోమాస శ్రీనివాస్, ఎస్.కుమార్ నామినేషన్ వేశారు. బిజేపి నుంచి ఇద్దరు నామినేషన్ దాఖలు చేయగా రాష్ట్ర జాతీయ పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు ఎక్కువ మంది నామినేషన్ వేశారు. ఎస్సీ రిజర్వు స్థానం కావడం, ఎన్నికల డిపాజిట్ లో 12500 కావడంతో ఎక్కువ మంది నామినేషన్ దాఖలు వేసినట్లుగా బావిస్తున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ ల ఉపసంహరణ గడువు ఉండడంతో చివరకు పోటీలో ఎంతమంది ఉంటారో తేలాల్సి ఉంది.

రిపోర్టింగ్ - HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

WhatsApp channel