Poll pulse: ఓటరు నాడికి మీటర్‌ పెడితే..!?-decoding the digital democracy dance analysis by dileep reddy ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Poll Pulse: ఓటరు నాడికి మీటర్‌ పెడితే..!?

Poll pulse: ఓటరు నాడికి మీటర్‌ పెడితే..!?

HT Telugu Desk HT Telugu
Apr 16, 2024 02:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఎన్నికల వేళ ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలపై పొలిటికల్ అనలిస్ట్ ఆర్.దిలీప్ రెడ్డి విశ్లేషణ ఇదీ.

ఈవీఎం, వీవీప్యాట్ పరికరాలు
ఈవీఎం, వీవీప్యాట్ పరికరాలు (HT_PRINT)

ఎన్నికలు సమీపిస్తుంటే... ఎన్నెన్ని వేషాలు? మరెన్ని మోసాలు! తెరపైకి వస్తాయో లెక్కే లేదు! ఓటరు నాడి, ఓటరు మూడ్‌ ఎట్నుంచి ఎటు తిరిగిందో ఊహాత్మక లెక్కలు వేస్తూ వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించడంలో రాజకీయ పార్టీలు, వాటి నేతలు, వ్యూహకర్తలు తలమునకలవుతుంటారు. భుజాలకు రెక్కలు కట్టుకొని సర్వే సంస్థలూ వచ్చి వాకిట్లో వాలిపోతాయి.

ఈ లెక్కలను బట్టే గెలుపు ఓటమి అవకాశాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పిల్లి మొగ్గలు వేస్తున్నట్టు కథనాలు ప్రచారంలోకొస్తాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో జరుగుతున్నదదే! ఏ రోజు, ఏ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందో, మరే పార్టీ పరిస్థితి దిగజారుతుందో అంచనాకు అందని లాటరీ వ్యవహారంలా దృశ్యం బమ్మకడుతుంటుంది!

అభ్యర్థుల సానుకూల, ప్రతికూల పరిస్థితులు కూడా ఈ నీడలోనే అటిటు మళ్లుతున్నట్టు కథనాలు, ప్రచారాలు తెరపైకి వస్తుంటాయి. ఇక నంబర్‌ గేమ్‌ మొదలవుతుంది. దాన్ని బట్టి డబ్బు సంచులు చీకటి గదుల నుంచి బయటకొస్తాయి. పెద్ద మొత్తాలు చేతులు మారతాయి. ఆ పైన డబ్బు నేరుగా జనంలోకి వెళ్తుంది. జనసమూహాలను మచ్ఛిక చేసుకునే ‘సంప్రదింపులు. సంతృప్తీకరణ’ల పర్వం మొదలవుతుంది.

నిజంగా ప్రజాక్షేత్రం అలా ఉంటుందా? అంటే, ఔనని చెప్పలేం. సీన్‌ అంత అస్పష్టంగా, అనిశ్చితంగా, ఊగిసలాటలో ఉండదు. మీడియా కథనాల్లో, నాయకుల అంచనాల్లో, వ్యూహకర్తల సమాచారంలో, కార్యకర్తల ప్రచారంలో… అస్పష్టత ఉండొచ్చు. కానీ, ప్రజాక్షేత్రం ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. ఏ వైపో ఓ వైపు డిసైడయి ఉంటారు. అదే, అంతిమంగా ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది.

ఈ లోపున... వారి వారి ఊహశాల్యతను బట్టి అంచనాలు, కథలు, కథనాలు జనం నాలుకల మీద తిరుగుతూనే ఉంటాయి. ఎన్ని ఎత్తులో, ఎన్నెన్ని జిత్తులో, మరెన్ని మాయోపాయాలో? పిండి కొద్ది రొట్టె అన్నట్టు ‘చేసుకున్నమ్మకు చేసుకున్నంత’ ప్రచారం, హడావుడి, హంగామా!

సొంత డబ్బా కొట్టుకోవాల్సిందే!

లోకసభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి! పాలక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో, ప్రతిపక్ష తెలుగుదేశం పెద్దన్నగా ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీల ఎన్డీయే కూటమి పోటీ పడుతోంది. ముందు టీడీపీ-జనసేన జట్టు కట్టి, ఆ పైన బీజేపీతో కూడి ఎన్డీయే కూటమిగా ఏర్పడటం తెలిసిందే!

కమ్యూనిస్టుల సయోధ్య యత్నాలతో కాంగ్రెస్‌ కూడా బరిలో ఓ పోటీదారుగా ఉంది. వైఎస్‌ షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పుంజుకుంది, అనేది ఒక భావన! ‘అప్రతిహతంగా ఈ సారి కూడా గెలుపు మాదే’ అని పాలకపక్షం వైసీపీ చెబుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 గెలిచి వైఎస్సార్సీపీ కిందటి ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. అదే ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉందని, పాలకపక్షాన్ని గద్దె దింపి ఏపీ ప్రజలు ఈసారి తమనే ఎన్నుకోబోతున్నారని ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ మధ్యలో రకరకాల ప్రచారాలు. పలు సర్వే సంస్థల అంచనాలు. క్షేత్ర నివేదికలు, వాటిని ఉటంకిస్తూ రాజకీయ పార్టీల ఊహాగానాలు, మొత్తమ్మీద సీనంతా కలగాపులగంగా ఉంది. తెలంగాణలోనూ అంతే! గత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో ఆధిపత్యం తమదంటే తమదని కాంగ్రెస్‌, బీజేపీలు ఢంకా బజాయించి ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ 2014 నుంచి వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండి, ఈ ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిల పడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), ‘తానేమీ తక్కువ కాదు’ అంటున్నా, ఆ పార్టీకి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా అంచనాలు, అవకాశాలు లేవు.

సర్వేల పేరిట స్వీయ స్వరాలు!

పోలింగ్‌ తేదీ సమీపిస్తుంటే, ఏ రోజున ఏ పరిణామం ఎలా ముంచుకు వచ్చి ఓటరు మూడ్‌ను అమాంతంగా మార్చివేస్తుందో? అని భావించే రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఉంటారు. అందుకే, పలు ఊహాగానాలను సర్వే రంగులద్ది ప్రచారంలో పెడతారు. పార్టీల అధినాయకత్వాలు టిక్కెట్ల కేటాయింపులకు కూడా పలు రకాల సర్వేలను, ప్రచారంలో ఉన్న అంశాలను చక్కగా వాడుకుంటాయి. ఒకరికి టిక్కెట్టు ఖరారు చేయాలన్నా, మరొకరికి టిక్కెట్టు నిరాకరించాలన్నా… దానికి ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. సదరు ప్రతిపాదనను సమర్థించే డాటా, సాక్ష్యాధారాలు కూడా అవసరమే. అందుకు ఈ సర్వేలు, అంచనాలు, ప్రచారాలు వారికి బాగా పనికొస్తాయి.

శాస్త్రీయంగా జరిగే సర్వేల ఆధారంగా జనాధరణ ఉన్న వారికే టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియను పార్టీ నాయకత్వాలు నిజాయితీగా చేపడితే ఇబ్బందేమీ ఉండదు. వాస్తవంగా ప్రజాదరణ ఉండే నాయకులూ అదే కోరుకుంటారు. కొన్నిసార్లు, నిజానికి సర్వే జరిగినా, జరక్కపోయినా… ఆ పేరుతో తాము కోరుకున్నట్టే టిక్కెట్ల పంపిణీ చేసుకోవడానికి నాయకత్వం దీన్నొక సాకుగా, ఉపకరణంగా వాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. దానికి కొందరు ఆశావహులు జడుసుకుంటారు.

ఇంకో వైపు అభ్యర్తిత్వాలు ఖరారయ్యాక, ఇటువంటి ప్రచారాల ద్వారా తమ పరిస్థితే మెరుగ్గా ఉన్నట్టు జనం నమ్మాలనీ పోటీదారులు చూస్తారు. ‘ఏమో? ఏ ప్రచారం, ఏ మేర ఉపయోగపడి, తమ పరిస్థితిని ఏ కొంచెం మెరుగుపరచినా చాలు కద!’ అన్న ఆశే ఈ చేష్టలు, ప్రచారాల వెనుక ప్రేరణ!

తెల్లవారితే ఏ పేపర్లో, పొద్దు కుంకితే ఏ చానల్లో ఏ సర్వే వెల్లడై, తాజా గణాంకాలతో ఊదరగొడుతుందో జనానికి తెలియదు. పార్టీలు, ఆ మాటకొస్తే అభ్యర్థులు కూడా.... ‘నెల కిందటితో పోలిస్తే మా పరిస్థితి ఇప్పుడు మెరుగయింది’ అని ప్రచారం చేస్తుంటారు. నెల కింద తమకంత జనాదరణ లేదనో, తాము వెనుకబడి ఉన్నట్టో మాత్రం, అప్పుడు ఏ విధంగానూ అంగీకరించి ఉండరు. మరి, ఇప్పుడెందుకు అలా చెబుతారు? అంటే, అలా చెప్పటం ద్వారా నిజాయితీగా ఉన్నట్టు తమ మాటకు జనంలో విశ్వసనీయత పెరుగుతుందనే ఆశ కావచ్చు!

ఇలా ఆశల పల్లకీలో తిరగకుండా, ప్రచారాల హోరు సృష్టించకుండా, జనాన్ని బోల్తా కొట్టించకుండా... ఈ కాలపు ఎన్నికలను నిర్వహించడం ఏ పార్టీకైనా దాదాపు అసాధ్యమే! ఏ ప్రచారంలో వాస్తవం ఎంతో? దేన్ని నమ్మాలో...? దేన్ని నమ్మకూడదో తెలుసుకోవడం, ఒక రకంగా తేల్చుకోవడమే ఓటర్లకు కత్తిమీద సాము!

ముందుగానే ఓటరు నిర్ణయం

పోలింగ్‌ తేదీ సమీపిస్తుంటే... రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అభ్యర్థులు దింపుడు కళ్లం ఆశతో ఉంటారు. నమ్మకంగా ఉన్న చోట సరే! కానీ, సందేహంగా ఉన్నచోట మాత్రం, ఆఖరు నిమిషం వరకు ఓటర్లను ప్రభావితం చేసి, వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వారు ముమ్మర యత్నాలు చేస్తుంటారు. నిజంగా అప్పటివరకు ఓటరు, తాను ఎక్కడ ఓటు వేసేది నిర్ణయించుకోకుండా ఉంటారా? అంటే, ఉండరనే సమాధానం వస్తోంది. అప్పటికే నిర్ణయం తీసుకోకుండా, ఊగిసలాట దోరణితో ఉండేది చాలా తక్కువ శాతం మందే!

ప్రస్తుత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు, రెండు సార్లు ‘ప్రీ పోల్‌’ సర్వే జరిపిన ‘సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌)-లోక్‌నీతి’ సర్వే సంస్థ కూడా ఇదే అంశాన్ని నిర్దారించింది.

ఓటు ఎవరికి వేయాలో మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు అన్న మౌలిక ప్రశ్నకు, ప్రచారం మొదలవడానికి చాలా ముందే అని 37 శాతం మంది చెప్పారు.

ప్రచారం సాగుతున్న సమయంలో అని 16.4 శాతం మంది, అభ్యర్థుల ఖరారుకు ముందే అని 10 శాతం మంది తెలిపారు.

పోలింగ్‌ రోజున నిర్ణయం తీసుకుంటామని 14.2 శాతం మంది అంటే, అంతకు ఒకటి, రెండు రోజుల ముందు నిర్ణయిస్తామని 13.2 శాతం ఓటర్లు తెలిపారు.

ఇంకో ఆసక్తికరమైన అంశం కూడా ఈ ప్రీ-పోల్‌ సర్వేల్లో వెల్లడయింది. అదేమంటే, ఎవరికి ఓటు వేయాలనే విషయంలో కుటుంబ సభ్యులు పరస్పరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకునే సందర్భాలే ఎక్కువ! అంతే తప్ప, చాలా మంది భావిస్తున్నట్టు కులపెద్దలో, కుల సంఘాలో, ఆధ్యాత్మిక గురువులో, మత పెద్దలో చెబితే విని, దాని ప్రకారం ఓటేసే వారి సంఖ్య చాలా తక్కువ!

ఈ విషయంలో ఆసక్తికరమైన గణాంకాలున్నాయి. ఓటు వేయడానికి ఎవరి సలహానైనా తీసుకుంటారా? అని అడిగిన మౌలిక ప్రశ్నకు ‘లేదు’ అని 66 శాతం మంది చెప్పారు. ఇక, సలహా తీసుకుంటాము అన్న 32.5 శాతం మందిలోనూ... ఎవరి సలహా వింటారు, పాటిస్తారు అనే విషయంలో జనాలు రకరకాలుగా స్పందించారు. అందులో, భార్య లేదా భర్త (జీవిత భాగస్వామి)ని సంప్రదించి, మాట్లాడుకుని నిర్ణయిస్తామని చెప్పిన వారు 29.5 శాతం ఉన్నారు.

కుటుంబంలోని ఇతర సభ్యులతో మాట్లాడుకొని నిర్ణయిస్తామని చెప్పినవారు 20.7 శాతం మంది. స్థానిక నాయకులు, కార్యకర్తల సలహా మేరకు అని చెప్పిన వారు 17.2 శాతం మంది ఉన్నారు. స్నేహితులు, ఇరుగుపొరుగు మాటలను బట్టి అని 2.3 శాతం, గ్రామ, పట్టణ పెద్ద (సర్వంచ్‌/మేయర్‌) మాటలను బట్టి అని 1.2 శాతం, కుల పెద్దలు-కుల సంఘాల వారు చెప్పిందాన్ని బట్టి అని 0.9 శాతం, సహోద్యోగుల మాటల్ని బట్టి అని 0.5 శాతం మంది చెప్పారు.

ఓటు ఎటు అనే విషయంలో కుటుంబం నిర్ణయమే కీలకం! సలహాలు ఎవరివి తీసుకున్నా నిర్ణయం మాత్రం సొంతంగా, మాకు ఇష్టమైన మేరకే తీసుకుంటామన్న వారు పాతిక శాతం వరకున్నారు.

పార్టీ-అభ్యర్థి... రెండూ నచ్చితేనే!

తమ ప్రతినిధిగా తాము ఎన్నుకుంటున్న అభ్యర్థుల మంచి చెడులను బేరీజు వేసి, తగిన వారినే ఎన్నుకోవాలని ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా.. ఆ దిశలో వస్తున్న మార్పు తక్కువే! అభ్యర్థులతో పాటు, పార్టీలను స్థూలంగా నమ్ముతూ జనం విశ్వాసం ప్రకటిస్తున్న దోరణే ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థి ఎవరన్నది కూడా చూడకుండానే, పార్టీల వారీగా విడిపోయే ఓటర్లే ఎక్కువ. సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి సర్వే ప్రకారం అభ్యర్థికి-పార్టీకి రెంటికీ ఇంచుమించు ఏకరీతి ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టమయింది.

ఓటు వేయడానికి దేన్ని ముఖ్య ప్రాతిపదికగా తీసుకుంటారు? అని నిర్దిష్టంగా అడిగిన ప్రశ్నకు... పార్టీని బట్టి అని 32.1 శాతం మంది చెబితే, అభ్యర్థిని బట్టి అని 37.6 శాతం మంది చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరన్నదాన్ని బట్టి అని 13.5 శాతం మంది చెబితే, పార్టీ ఎన్నికల (ప్రణాళిక (మానిఫెస్టో) ను బట్టి అని 9.7 శాతం మంది తెలిపారు. జమిలి ఎన్నికలు వచ్చినపుడు, ఎంపీ అభ్యర్థిని బట్టి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకుంటామని చెప్పిన వారు కేవలం 2.8 శాతం ఉన్నారు.

- దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802

దిలీప్ రెడ్డి, పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,
దిలీప్ రెడ్డి, పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,
WhatsApp channel