AP Special Status: మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా… ఫోకస్ పెంచే పనిలో వైసీపీ..!
parliament winter session 2022 Updates: ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ ఫోకస్ పెట్టింది అధికార వైసీపీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టనుంది.
Special Status For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా... 2019 ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం. ప్రధాన పార్టీలన్నీ ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించాయి. ఇక హోదా కోసం టీడీపీ ఢిల్లీ వేదికగా పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా మోదీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వరకు వెళ్లింది. ఇక వైసీపీ మాత్రం... హోదా తమతోనే సాధ్యమని చెప్పుకుంటూ వచ్చింది. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపిస్తే హోదా తీసుకువస్తామని స్పష్టం చేసింది. అనుకున్నట్లే వైసీపీ... 25 లోక్ సభ స్థానాలకు గానూ..22 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత.. పరిస్థితి మారినట్లు కనిపించింది. పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చినప్పటికీ... కేంద్రంతో పోరాటానికి దిగిన సందర్భాలు అయితే లేవు. ఇక తాజాగా పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరబోతున్న నేపథ్యంలో... హోదా అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టే పనిలో పడింది వైసీపీ నాయకత్వం. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు కసరత్తు కూడా చేస్తున్నారు.
ప్రైవేటు మెంబర్ బిల్లు...!
ఈ నెల 7వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కేంద్రం.. అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. అయితే బయటికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన భరత్... హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ పార్టీ ప్రధాన అజెండా అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో కోరుతామని... ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెడుతున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటి ప్రస్తావించటంతో పాటు... రాష్ట్రానికి వచ్చే ప్రతిదాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటు వంటి అంశాలను ప్రస్తావిస్తామని చెప్పుకొచ్చారు. విభజన చట్టానికి సవరణ చేయాలని.. ఇందులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని కోరుతున్నామని అన్నారు. ఇందుకు కేంద్రం ఒప్పుకోపోతే ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతామని కామెంట్స్ చేశారు.
నిజానికి హోదా విషయంపై కేంద్రం అనేకసార్లు ప్రకటన కూడా చేసింది. ఏపీకి హోదా అనేది కుదరదని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పార్లమెంట్ వేదికగా కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేసుల విషయానికి భయపడే ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ పక్కన పెట్టేశారని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. అయితే వైసీపీ మాత్రం... ఈ విమర్శలను తిప్పికొడుతోంది. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడమే హోదాకి అడ్డంకిగా మారిందని అంటోంది. హోదా అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందని... ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి కూడా సీఎం జగన్ లేఖలు రాశారని చెబుతోంది.
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ... మరోసారి కూడా హోదా అంశం తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో అధికార వైసీపీ... మరోసారి హోదాపై ఫోకస్ పెంచే పనిలో పడినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే హోదాపై సంతకం చేస్తామని పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే.