Botsa on AP Capital : 3 నెలల్లో రాజధానిగా విశాఖ.. మంత్రి బొత్స వ్యాఖ్యలు-vizag as executive capital within 3 months says minister botsa satyanarayana
Telugu News  /  Andhra Pradesh  /  Vizag As Executive Capital Within 3 Months Says Minister Botsa Satyanarayana
బొత్స సత్యనారాయణ
బొత్స సత్యనారాయణ (facebook)

Botsa on AP Capital : 3 నెలల్లో రాజధానిగా విశాఖ.. మంత్రి బొత్స వ్యాఖ్యలు

01 January 2023, 18:53 ISTHT Telugu Desk
01 January 2023, 18:53 IST

Botsa on AP Capital : విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 3 నెలల్లో విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అవుతుందని తెలిపారు. ఇదే మా కోరిక అని... ప్రభుత్వ విధానం కూడా అదేనని స్పష్టం చేశారు.

Botsa on AP Capital : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్... విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా ఉంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నది వైఎస్సార్సీ వాదన. అయితే.. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని టీడీపీ, జనసేన నినదిస్తూ ప్రజా క్షేత్రంలో పోరాడుతున్నాయి. అమరావతి రైతులు కూడా పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలతో పోరాటాలకు పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి.

మూడు రాజధానులు విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా .. ప్రభుత్వం మాత్రం తమ విధానానికే కట్టుబడి ఉంది. రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు సైతం మూడు రాజధానులకు అనుకూలంగా తమ వాదనలను తరచూ గట్టిగా వినిపిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 3 నెలల్లో విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అవుతుందని తెలిపారు. ఇదే మా కోరిక అని... ప్రభుత్వ విధానం కూడా అదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోరుకుంటున్నారని... ఆ ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లో ఇదంతా జరుగుతుందని వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో జరుగుతుందని అన్నారు. కొత్త సంవత్సరం రోజు.. విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.

విశాఖను రాజధానిగా చేయాల్సిందేనని.. లేని పక్షంలో ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగానైనా ప్రకటించాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రీకృతంగా మొత్తం ఖర్చు చేశామని... రాష్ట్ర విభజనతో విడిచిపెట్టి వచ్చామని అన్నారు. ఆ పొరపాటు మళ్లీ జరగకూడదని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలన్నారు. ధర్మాన వ్యాఖ్యలపై రాయలసీమ టీడీపీ, బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రజలని అయోమయానికి గురి చేస్తోందని.. అందుకే మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారికి నిజంగా ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలంటే... తమ ప్రాంతాన్ని కూడా గ్రేటర్ రాయలసీమ పేరిట ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు.