Viveka Murder case: వివేకా కేసు విచారణకు కొత్త 'సిట్'.. డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు -supreme cour green signal for new sit in viveka murder case investigation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case: వివేకా కేసు విచారణకు కొత్త 'సిట్'.. డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

Viveka Murder case: వివేకా కేసు విచారణకు కొత్త 'సిట్'.. డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 03:40 PM IST

SC On Viveka Murder case:వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు సీబీఐ ప్రతిపాదించిన కొత్త సిట్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది

వివేకా కేసు దర్యాప్తునకు కొత్త సిట్
వివేకా కేసు దర్యాప్తునకు కొత్త సిట్

Viveka Murder case Updates: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారి రామ్‍సింగ్‍ను కొనసాగించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో... సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను తప్పించింది సీబీఐ. ఈ మేరకు కొత్తగా సిట్ ఏర్పాటు చేస్తూ సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌కు సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వం వహించనున్నారు.

డెడ్ లైన్ విధింపు…

ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని పేర్కొంది. అలాగే 6 నెలల్లో కోర్టు ట్రయిల్ ప్రారంభించాలని … లేదంటే నిందితుల రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకుంటాం అని స్పష్టం చేసింది. ఏప్రిల్ 30లోగా విచారణను ముగించాలని సీబీఐకి డెడ్ లైన్ విధించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని కోర్టుకు స్పష్టం చేసింది సీబీఐ. అలాగే అదనపు ఛార్జ్ షీట్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలన్న తులసమ్మ పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు.

ఈ కేసుకు సంబంధించి బుధవారం ఉదయం విచారించిన సుప్రీంకోర్టు… దర్యాప్తు అధికారి రామ్‍సింగ్‍ను కొనసాగించడంపై అభ్యంతరం తెలిపింది. తులసమ్మ పిటిషన్ నేపథ్యంలో సిబిఐ నుంచి నివేదిక తెప్పించుకున్న న్యాయస్థానం, దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక చేరింది. తాజా దర్యాప్తు వివరాలను న్యాయస్థానం ముందు ఉంచారు.

మరోవైపు దర్యాప్తు మందకొడిగా సాగడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రామ్‍సింగ్‍తో పాటు మరొకరిని దర్యాప్తు అధికారిగా సూచిస్తే సీబీఐ కోర్టుకు వివరాలు తెలిపింది. దర్యాపులో పురోగతి సాధించనప్పుడు రామ్‍సింగ్‍ను కొనసాగించడంలో అర్థం లేదని న్యాయమూర్తి ఎంఆర్ షా అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొన సాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులశమ్మ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితె బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు విచారణ పూర్తి విషయంలో సీబీఐకి నిర్ణీత గడువును విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం